జీసీసీకి 5 జాతీయ అవార్డులు

Five National Awards to GCC - Sakshi

గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర అందించడంలో దేశంలోనే టాప్‌

సేంద్రియ ఆహార ఉత్పత్తులో ఫస్ట్‌  

మరో 3 విభాగాల్లో ర్యాంకులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ట్రైబల్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ట్రైఫెడ్‌) ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 5 సాధించి సత్తా చాటింది. రెండు విభాగాల్లో మొదటి ర్యాంకు, ఒక విభాగంలో రెండో ర్యాంకు, మరో రెండు విభాగాల్లో మూడో ర్యాంకు లభించాయి. 

► ప్రతిస్పందన విభాగంలో.. గిరిజనుల కోసం ప్రధానమంత్రి వన్‌ ధన్‌ వికాస్‌ యోజన కేంద్రాలు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల (ఎంఈపీ)కు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను అందించడంలోను దేశంలోనే టాప్‌లో నిలిచి మొదటి ర్యాంకు సాధించింది.
► రిటైల్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగంలో.. సేంద్రియ, సహజ ఆహార ఉత్పత్తుల సరఫరాలోను జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు గెల్చుకుంది. 
► కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4 కోట్ల 50 లక్షల 74 వేల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు దక్కింది. 
► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.9 కోట్ల 76 లక్షల, 27 వేల విలువైన చిన్న తరహా అటవీ ఫలసాయాలు (ఎంఎఫ్‌పీ) సేకరించినందుకు జాతీయ స్థాయిలో 3 వ ర్యాంకు సాధించింది. 
► 2020–2021లో అత్యధికంగా రూ.12 కోట్ల 86 లక్షల 12 వేలను వినియోగించినందుకు దేశంలోనే 3 వ ర్యాంకు దక్కించుకుంది. 

సీఎం మార్గనిర్దేశం.. సిబ్బంది అంకితభావంతోనే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశం, అధికారులు, సిబ్బంది అంకితభావం వల్లే జీసీసీకి 5 అవార్డులు దక్కాయి. కరోనా కష్టకాలంలోను ఉత్తమ పనితీరుతో జీసీసీ అధికారులు, సిబ్బంది అధికంగా వ్యాపార వ్యవహారాలను నిర్వహించగలిగారు. అటవీ, వ్యవసాయోత్పత్తుల సేకరణకు 2019–20లో రూ.13.18 కోట్లు, 2020–21లో రూ.76.37 కోట్లు ఖర్చుచేశాం. జీసీసీ ఉత్పత్తుల అమ్మకాలు 2019–20లో రూ.24.22 కోట్లు జరగ్గా, 2020–21లో రూ.33.07 కోట్లకు పెరిగాయి. 2019–20లో జీసీసీ రూ.368.08 కోట్ల వ్యాపారాన్ని మాత్రమే చేయగా, 2020–21లో తీవ్రమైన కరోనా నేపథ్యంలోను రూ.450.68 కోట్ల మేరకు వ్యాపారం చేయగలిగింది.
– పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి

జాతీయస్థాయిలో సత్తా చాటింది
జాతీయస్థాయి ర్యాంకింగ్‌ల్లో జీసీసీ సత్తా చాటింది. పలు విభాగాల్లో ఏకంగా 5 జాతీయ అవార్డులు రావడం ఎంతో గర్వకారణం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జీసీసీలు పలు విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు కేంద్ర ట్రైఫెడ్‌ సంస్థ ఈ అవార్డులను అందిస్తుంది. తీవ్రమైన కోవిడ్‌ పరిస్థితుల్లోను అటవీ ఉత్పత్తుల సేకరణలో జీసీసీ పటిష్టమైన కార్యాచరణ చేపట్టింది. అటవీ ఉత్పత్తుల అమ్మకాల్లో రాష్ట్రంలోని గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమన్వయం, పర్యవేక్షణతోనే ఇంత గొప్ప రికార్డును సాధించడానికి సాధ్యమైంది. 
– పీఏ శోభ, జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్, విశాఖపట్నం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top