వలలో వరాలు.. అదృష్టం అంటే ఇదే!

Fisherman Net Catching Demand Tuna Fish - Sakshi

సాక్షి,అరసవల్లి( శ్రీకాకుళం): ఉద్దానం మత్స్యకారుల వలలో వరాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అరుదుగా దొరికే ట్యూనా చేపలు నాలుగు రోజులుగా ఇక్కడి గంగపుత్రులకు దండిగా దొరుకుతున్నాయి. టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి వారు సంబరపడుతున్నారు. జిల్లాలో అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో ఉద్దానం తీరాల్లో తక్కువ మొత్తంలోనే ట్యూనా దొరికేది. ఎవరికో గానీ ఆ అదృష్టం వరించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా వేటకు వెళ్లిన అన్ని వలలకు ట్యూనా చేపలు పడటం విశేషం. 

నాలుగు రోజుల్లో 200 టన్నులు.. 
జిల్లాలో సోంపేట, కవిటి మండలాల పరిధిలోనే ట్యూనా చేపలు లభ్యమవుతున్నాయని స్థానిక మత్స్యకారులు, అధికారులు చెబుతున్నారు. బారువ, ఇసుకలపాలెం, ఉప్పలాం, గొల్లగండి తదితర తీర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా ట్యూనా చేపలు లభ్యమయ్యాయి. ఈ చేపల లభ్యత సమాచారాన్ని తెలుసుకున్న చేపల వ్యాపారస్తులు స్థానికులతో ఫోన్లలో బేరాసారాలు చేసుకుని రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజుల్లో సుమారు 200 టన్నుల ట్యూనా చేపలు కేరళ, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలించారు. తొలి రెండు రోజుల్లో కిలో చేపల ధర రూ.30 వరకు ఉంటే, ఇప్పుడు రూ.38 నుంచి రూ.45కి చేరింది. ఇదే ధరలతో కేరళకు భారీగా చేపలు విక్రయాలు జరిగినట్లుగా మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఇక ఈ చేపలకు జపాన్‌ తదితర నార్త్‌ ఈస్ట్‌ దేశాల్లో గిరాకీ అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచి చేపలను ఎగుమతి చేసేందుకు వ్యాపారులు సన్నాహాలు చేస్తున్నారు. 

విదేశాల్లో డిమాండ్‌ ఉంది 
ట్యూనా చేపలను స్థానికంగా సూరలని పిలుస్తుంటారు. ఇక్కడి వారి కంటే ఇతర దేశస్తులు అధికంగా ఆహారంగా తీసుకుంటారు. గతంలో పోల్చితే ఈసారి అధికంగా చేపల సంతతి బయటపడటంతో అక్కడి వలలకు చిక్కాయి. దేశంలోనే చేపల అభివృద్ధిలో ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిలిచింది. అలాగే ఇందులో మన జిల్లా కూడా ప్రాధాన్యతను పొందడం విశేషం. 
 – పీవీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ, జేడీ 

ఇన్ని ఎప్పుడూ దొరకలేదు 
ట్యూనా చేపలు అప్పుడప్పుడూ దొరుకుతాయి. అయితే ఇంత ఎక్కువ ఎప్పుడూ చూడలేదు. కేజి రూ.38 చొప్పున సుమారు 60 టన్నుల వరకు కేరళ రాష్ట్రానికి పంపించాం. ముందు రోజుల్లో ధర కాస్తా తగ్గించి ఇచ్చాం. ట్యూనా చేపలతో లాభం బాగుంది. 
 – చిడిపల్లి గురుమూర్తి, మత్స్యకారుడు 

వచ్చే నెల వరకు చిక్కుతాయి
ట్యూనా చేపలకు డిమాండ్‌ ఉంది. మరో నెల రోజుల వరకు కూడా చేపలు వలలకు చిక్కుతాయనే అనుకుంటున్నాం. అందుకే మళ్లీ వేటకు వెళ్తాం. ఇతర దేశాలకు ఉద్దాన తీర ప్రాంత చేపల రుచి చేరనుంది. వాతావరణం అనుకూలిస్తే మరిన్ని రోజులు వేట కొనసాగిస్తాం. 
– సవధాల ఢిల్లేసు, మత్స్యకారుడు  

చదవండి: విదేశీ అతిథులు రా..రమ్మంటున్నాయి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top