పారిశుద్ధ్యంపై జనచైతన్యం

Fighting Infections On Using Social Media - Sakshi

సోషల్‌ మీడియాను ఉపయోగించి అంటువ్యాధులపై సమరం 

యువతకు భాగస్వామ్యం కల్పించాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయం 

గ్రామాల్లో కోటిమంది సామాజిక మాధ్యమాల వినియోగదారులు 

పరిశుభ్రత ప్రయోజనాలు తెలిపే స్క్రీన్‌షాట్లతో ప్రచారం

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై స్థానిక ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మలేరియా వ్యాధులు సగానికి పైగా తగ్గగా.. డెంగీ, డయేరియా తదితర వ్యాధులు దాదాపు 20 శాతానికే పరిమితమయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రజాచైతన్యాన్ని మరింత పెంచడం ద్వారా గ్రామాల్లో అంటువ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు ఆ శాఖ నడుంకట్టింది.
 
► మనం – మన పరిశుభ్రత పేరుతో పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామాల్లోనూ విడతల వారీగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో 1,320 గ్రామాల్లో , రెండో విడతలో 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు.  
► దీనికి తోడు ప్రజాచైతన్యం కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2.70 కోట్ల వరకు జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో కోటిమందికిపైగా ఇంటర్‌నెట్‌ వసతితో కూడిన మొబైల్‌ ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించింది. వీరిలో 66 లక్షల మంది ఫేస్‌బుక్, వాట్సాప్‌లను, 40 లక్షలమంది ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు.  
► పరిసరాల అపరిశుభ్రత కారణంగా సంక్రమించే వ్యాధులు, ఫలితంగా కలిగే ఆర్థికభారం, సంపూర్ణ పారిశుద్ధ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ స్క్రీన్‌షాట్లను రూపొందించి గ్రామాల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగదారులకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రాంతాల వారీగా సబ్‌ గ్రూపుల రూపకల్పనకు ఆలోచిస్తున్నారు. 
► గ్రామీణ ప్రాంతానికి ఎక్కువగా సంబంధం ఉండే ఉన్నత పా´ఠశాలలు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులతో పాటు ఇతరత్రా చురుగ్గా ఉండే వారిని వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపట్టే చర్యల్లో భాగస్వాముల్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top