మహిళా ఎస్‌ఐ ఆత్మహత్య

Female SI suicide at Vizianagaram - Sakshi

విజయనగరం పీటీసీలో ఘటన

విజయనగరం క్రైమ్‌/సఖినేటిపల్లి/కోడూరు: విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో మహిళా ఎస్‌ఐ కొప్పనాతి భవాని (27) ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి ఎస్‌ఐగా పనిచేస్తున్న భవాని శిక్షణ కోసం పీటీసీకి వచ్చారు. ఆదివారం తెల్లవారేసరికి ఆమె గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించి ఉండటాన్ని గుర్తించారు. విజయనగరం వన్‌టౌన్‌ సీఐ జి.మురళి తెలిపిన మేరకు.. పీటీసీలో ఐదురోజుల శిక్షణ శనివారం సాయంత్రం పూర్తయింది. అనంతరం శిక్షణకు వచ్చినవారంతా వెళ్లిపోయారు. తాను ఆదివారం వెళతానని సహచరులకు తెలిపిన భవాని శనివారం సాయంత్రం 6 గంటలకు తన సోదరుడు శివశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడి తాను వైజాగ్‌ వస్తానని, కలుస్తానని చెప్పారు.

ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పీటీసీలో విధి నిర్వహణకు వచ్చిన స్వీపర్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరిచి చూశారు. గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని  భవాని మృతిచెంది ఉండటాన్ని గమనించి డ్యూటీ అధికారులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న  వన్‌టౌన్‌ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారమందించి విచారణ చేపట్టారు. పీటీసీ డ్యూటీ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ మురళి ఆధ్వర్యంలో ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు  దర్యాప్తులో తేలాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతోనే ఎస్‌ఐ భవాని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు.

కూలి పనులకు వెళ్లి.. కష్టపడి చదివి..
కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెంలో కొప్పనాతి శ్రీనివాసరావు, నాగేశ్వరమ్మ దంపతులకు కుమారుడు శివశంకరరావు, కుమార్తె భవాని సంతానం. పిల్లల చిన్నప్పుడే శ్రీనివాసరావు మృతిచెందారు. తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లల్ని పోషించింది. తల్లి కష్టాన్ని పంచుకోవాలనే తపనతో భవాని చిన్నప్పటినుంచే ఆమెతోపాటు కూలి పనులకు వెళ్లేది. పనులకు వెళుతూనే గ్రామంలో పదోతరగతి వరకు చదువుకుంది. చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించిన భవాని అవనిగడ్డలో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసింది.

2018లో తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా ఎంపికైన భవాని రాజోలు పోలీస్‌ స్టేషన్‌లో శిక్షణ అనంతరం సఖినేటిపల్లిలో పనిచేస్తున్నారు. తల్లి, ఉద్యోగాన్వేషణలో ఉన్న సోదరుడితో కలిసి సఖినేటిపల్లిలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామంలో ఉన్న తాతయ్య కొప్పనాతి కృష్ణ, నాయనమ్మ చంద్రలంకమ్మల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. భవానీకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టాలు ఏమీ లేవని ఆమె  కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సాలెంపాలెం తీసుకురానున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top