నత్తలొస్తున్నాయ్‌ జాగ్రత్త!

Farmers Are Struggling With Snails Attacking Crops - Sakshi

కూరగాయ తోటల్లో విధ్వంసం

రాత్రివేళ పొలాల్లోకి చేరుతున్న వైనం 

టమాట, ఆలూ, మిరప, బీన్సు పంటలకు అధిక నష్టం

నత్తలు.. నత్తలు.. నత్తలు దండు కడుతున్నాయి..  పంటలపై దాడి చేస్తున్నాయి.. రాత్రివేళ యథేచ్ఛగా పొలాల్లో చేరిపోతున్నాయి.. మొక్క మొదళ్లలోని మృదువైన భాగాలను తినేస్తున్నాయి.. ముఖ్యంగా వివిధ రకాల కూరగాయలను ఆరగించేస్తున్నాయి.. డ్రిప్‌ పైపుల్లోకి దూరి నీటి సరఫరాను అడ్డుకుంటున్నాయి.. తోటల్లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి.. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఫలితం దక్కకుండా చేస్తున్నాయి. నివారణకు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నాయి. 

పలమనేరు(చిత్తూరు జిల్లా): కూరగాయ పంటలు సాగుచేసే రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌ పరిధిలోని 32 మండలాల్లో నత్తల దండు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టమాట, బంగాళాదుంప, బీన్సు, బీర, మిరప తదితర పంటల మొదళ్లలోని మృధువైన భాగాన్ని నత్త పురుగులు తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎదుగుదల దెబ్బతింటోంది. మొక్కలకు రోగనిరోధక శక్తి తగ్గి ఫంగస్‌ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి. వీటిని ఎలా అరికట్టాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.  

రాత్రి వేళల్లో దాడి 
డివిజన్‌ పరిధిలోని పలు రకాల పంటలు ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నాయి. గతంలో కురిసిన వర్షాలతో పంటకు ఆకు మాడు, ఫంగస్‌ తెగుళ్లు సోకుతున్నాయి. అన్నింటికీ మించి నత్తల సమస్య ఎక్కువగా ఉంది. పగటిపూట కనిపించని నత్తలు రాత్రి సమయాల్లో తోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. డ్రిప్పులు అమర్చిన పొలాల్లో మలి్చంగ్‌షీట్‌ కిందకు చేరి మొక్క మొదళ్లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు డ్రిప్పులేటర్లలోకి నత్తలు వెళ్లడంతో పైపుల్లో నీళ్లు రాకుండా బ్లాక్‌ అవుతున్నాయి. ఉదయం పూట ఓ తోట నుంచి మరో పొలంలోకి పాకిపోతున్నాయి. ఇవి జిగటలాంటి ద్రవాన్ని విసర్జిస్తూ వెళుతున్నట్టు రైతులు చెబుతున్నారు. గత ఏడాది రబీలో అక్టోబర్, నవంబర్‌లో అక్కడక్కడా కనిపించిన నత్తలు ఈ దఫా వేల సంఖ్యలో తోటలపై పడి సర్వనాశనం చేస్తున్నాయని రైతులు వెల్లడిస్తున్నారు. 

ఈ మండలాల్లోనే అధికం 
తేమ వాతావరణం కలిగిన భూముల్లో అధిక సంఖ్యలో నత్తలు చేరుతున్నాయి. కొబ్బరి చెట్ల నీడలోని పొలాలు, మామిడి తోటల్లోని అంతర పంటలు, చెరువు కింద ఆయకట్టు భూములు వీటికి ఆవాసాలుగా మారాయి. వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, రామసముద్రం మండలాల్లోని బంగాళదుంప, గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాలతోపాటు పుంగనూరు, మదనపల్లె, వాల్మీకిపురం నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న టమాటా పంటకు సమస్య ఎక్కువగా ఉంది.  

నష్టాల బెంగలో రైతులు  
టమాటా ఎకరా సాగుకు రూ.60 వేలు, బంగాళాదుంపకు రూ.80 వేలు, మిరపకు రూ.30 వేలు, బీన్సుకు రూ.50 వేలు ఇతర తీగ పంటలకు ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేల దాకా పెట్టుబడి పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఈ తరుణంలో నత్తల కారణంగా లక్షలాది రూపాయల్లో పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నత్తల సమస్య నిజమే  
నత్తల దాడులు నిజమే. ఈ ప్రాంతంలో ప్రస్తుతం తేమ వాతావరణం ఉంది. నత్తలనబడే స్లగ్స్‌ కూరగాయ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు డ్రిప్పుల్లోగానీ నేరుగా కానీ క్లోరిఫైరిపాస్, కాఫర్‌ఆక్సిక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. పొలం చుట్టూ సున్నం వేస్తే మంచిది. ఇవి అక్కడికి చేరి కొంతవరకు చనిపోతాయి.
– శ్రీనివాసులురెడ్డి, ఉద్యానశాఖ అధికారి, పలమనేరు 

నివారణ తెలియజేయాలి 
ప్రస్తుతం పలు రకాల పంటలకు నత్తల సమస్య అధికంగా ఉంది. నవంబర్, డిసెంబర్‌లో మంచు కురుస్తుంది కాబట్టి వీటి సంచారం మరింత ఎక్కువ కావొచ్చు. అధికారులు వెంటనే స్పందించి వీటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించాలి.
– గోవిందరెడ్డి, ఆత్మా చైర్మన్, పలమనేరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top