
ఆయా వర్గాలకే శాసన మండలిలో ప్రాతినిధ్యాన్ని విడిచిపెట్టాలి
మండలి చైర్మన్ మోషేన్‌రాజు వ్యాఖ్య
పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు మండలిలో వీడ్కోలు కార్యక్రమం
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు జొప్పించకుండా, శాసన మండలిలో ఆయా వర్గాలకే ప్రాతినిధ్యాన్ని విడిచిపెట్టాలని మండలి చైర్మన్ మోషేన్‌రాజు అభిప్రాయపడ్డారు. పీడీఎఫ్ సభ్యుల పదవీ విరమణ వల్ల విద్యార్థులు, యువత, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రస్తావించడంలో సభ మూగబోతుందేమోనని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసన మండలిలో పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ(పీడీఎఫ్), యనమల రామకృష్ణుడు, పి.అశోక్‌బాబు, డి.రామారావు, బీటీ నాయుడు(టీడీపీ)లకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలపడంతో ఆయా వర్గాల ప్రాతినిధ్యాన్ని, వారి గొంతుకను అడ్డుకుంటున్నామా? అనే భావన కలుగుతోందన్నారు. పీడీఎఫ్ సభ్యులు లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, రఘువర్మ సభలో బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించేటప్పుడు సంతోషంగా ఉండేదన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం గల యనమల రామకృష్ణుడు తాను నమ్మిన పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలందించారని ప్రశంసించారు. బీటీ నాయుడు మరోసారి ఎన్నికవడం అభినందనీయమన్నారు. ఇకపై ఎమ్మెల్సీలు ఎవరైనా పదవీ విరమణ పొందితే సభా సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తామని చైర్మన్ ప్రకటించారు.
సభలో యనమల ఉంటే బాగుండేది: బొత్స
సభలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలపైనే పోరాటం తప్ప సొంత అజెండాలు ఉండవని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా సభలో యనమల రామకృష్ణుడు కూడా ఉండి ఉంటే బాగుండేదని బొత్స అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అలాంటి సీనియర్ రాజకీయ నాయకుల మాటలు, అనుభవం సభ్యులకు అవసరమన్నారు.
చైర్మన్ స్పందిస్తూ... తాను ఫోన్ చేసినప్పటి కీ అనారోగ్యం కారణంగా యనమల రాలేకపోతున్నట్టు చెప్పారన్నారు. బొత్స మాట్లాడుతూ యనమల ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, స్పీకర్‌గా, ఆర్థిక మంత్రిగా ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు. స్పీకర్‌గా యనమల తీసుకొచి్చన సంస్కరణలను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని తెలిపారు.
పీడీఎఫ్ సభ్యులు సమాజంలోని రుగ్మతలను సభలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ శాసన వ్యవస్థలో లైవ్ స్ట్రీమింగ్ అనేది యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా వచ్చిందన్నారు.