
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. మిథున్ రెడ్డితో ఆయన తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్, ములాఖత్ అయ్యారు. వీరితో పాటుగా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా అక్కడికి వెళ్లారు. ఈ సందర్బంగా మిథున్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, ఆయన తల్లి స్వర్ణలత భావోద్వేగానికి గురయ్యారు. మిథున్ రెడ్డి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
అనంతరం, మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత మాట్లాడుతూ.. ‘అన్యాయంగా నా కుమారుడిని జైల్లో పెట్టారు. టెర్రరిస్టులను చూసినట్టు చూస్తున్నారు. కనీస సదుపాయాలు కల్పించలేదు. కాస్త మెరుగైన సదుపాయాలు అందించాలని కోరుతున్నాం’ అని అన్నారు.
మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలను కొనసాగిస్తోంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనకు ఇచ్చిన సదుపాయాలపై ఏనాడు రివ్యూ పిటిషన్ వేయలేదు. ఏసీ సదుపాయం కూడా కల్పించాం. జైలు అధికారులపై ప్రభుత్వ ఒత్తిడి ఎంత ఉందో రివ్యూ పిటిషన్ వేయడం చూస్తే అర్థమవుతుంది. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారు’ అని తెలిపారు.

డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం దారుణమైన విధానాలను అనుసరిస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారు. మిథున్ రెడ్డిని అన్యాయంగా మద్యం కేసులో ఇరికించారు. కచ్చితంగా ప్రజలంతా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యలు చేశారు.