పింఛన్‌ పంపిణీకి సర్వం సిద్ధం  | Sakshi
Sakshi News home page

పింఛన్‌ పంపిణీకి సర్వం సిద్ధం 

Published Wed, Aug 31 2022 4:09 AM

Everything is ready for pension distribution in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/దేవరాపల్లి: రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1న 62.70 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం వినాయక చవితి పండుగ అయినప్పటికీ.. ఒకటో తేదీ (గురువారం) తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయానికే రూ.1,594.66 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ మంగళవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చే చేశారన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే పంపిణీకి సిద్ధంగా ఉండాలని సెర్ప్‌ అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోగా వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. లబ్ధిదార్లకు పింఛన్లు అందజేసే సమయంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్‌ విధానాలను అమలు చేస్తున్నామన్నారు.

అలాగే రియల్‌ టైమ్‌ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఆర్‌బీఐఎస్‌) విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్‌సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement