మీ కెరీర్‌ మలుపు తిప్పే టర్నింగ్‌ పాయింట్‌.. నిజంగా ఇది గోల్డెన్‌ ఛాన్సే.. | Sakshi
Sakshi News home page

మీ కెరీర్‌ మలుపు తిప్పే టర్నింగ్‌ పాయింట్‌.. నిజంగా ఇది గోల్డెన్‌ ఛాన్సే..

Published Thu, Sep 1 2022 9:18 AM

Engineering Students: Internship For First Step Toward Career Success - Sakshi

రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు.
చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? 

కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్‌ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది.

ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా  సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్‌ ఎంతగానో తోడ్పడుతుంది.

అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్‌ అనేది ఇంజినీరింగ్‌ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్‌గా పరిగణిస్తే భవిష్యత్‌కు ఇబ్బందికరమంటున్నారు.

ఉపాధి పొందే అవకాశం  
♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్‌షిప్‌ ప్రధాన ఉద్దేశం.  
♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి.  
♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. 
♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్‌ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్‌ స్కిల్స్‌ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్‌ చేస్తుంటాయి. 
♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్‌ షిప్‌ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి.  
♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి.  
♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్‌ చేసుకోవడం జరుగుతుంటుంది.  
♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్‌షిప్‌  ఎంతగానో దోహదపడుతుంది.  
♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. 
♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్‌షిప్‌ అనుభవంగా సహకరిస్తుంది.

పీహెచ్‌డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది  
కంపెనీలు ఇచ్చే జాబ్‌ సెలక్షన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్‌ చేసి, పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎన్టీఆర్‌ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్‌ఫిప్‌ చేసే అవకాశాలు వచ్చాయి. 
– ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్‌చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ

మార్గదర్శకాలను అనుసరించే..
ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్‌ విద్యార్థులంతా ఇంటర్న్‌షిప్‌ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్‌ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్‌షిప్స్‌ ఎక్కువగా సమ్మర్‌ హాలిడేస్‌లో చేస్తుంటారు.  
– డాక్టర్‌ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌

అనుభవాన్ని అందించింది
ఎలక్రిక్టకల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్‌ కంట్రోల్‌ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది.  
– కార్తీక్‌కుమార్‌రెడ్డి, వసంతకుమార్, మౌనిక 

Advertisement
Advertisement