Cage Culture: కేజ్‌ కల్చర్‌తో యువతకు ఉపాధి

Employment for youth with cage culture - Sakshi

ఏపీలో 150 కేజ్‌లు.. 200 టన్నుల దిగుబడి

500 కుటుంబాలకు జీవనోపాధి

కేజ్‌ కల్చర్‌ కేరాఫ్‌ నాగాయలంక

రిజర్వాయర్లలో ఈ తరహా సాగును ప్రోత్సహించేందుకు చర్యలు

సాక్షి, అమరావతి: కేజ్‌ కల్చర్‌ (పంజరంలో చేపలసాగు)ను మరింత ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్‌ కల్చర్‌ను 2007లో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ సాగుకు గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్‌ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించే ఈ సాగు సముద్రం, నదుల్లోనే కాదు.. అన్ని రకాల రిజర్వాయర్లలో ప్రోత్సహించే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. దీంతో మన రాష్ట్రంలోకంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ సాగుకు మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ కల్చర్‌ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కేజ్‌ తయారీ వినూత్నం..
6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్‌లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్‌లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్‌లో 10 మెరైన్‌ కేజ్‌లు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో 110 బ్యాక్‌వాటర్‌ కేజ్‌లు ఉన్నాయి.

అత్యధికంగా 70కు పైగా కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉండడంతో కేజ్‌ కల్చర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా 60ః40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్‌ కేజ్‌ ద్వారా ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బ్యాక్‌వాటర్‌ కల్చర్‌ ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.

కేజ్‌ కల్చర్‌ విస్తరణకు ఏపీ అనువైన ప్రాంతం
ఏపీలో కేజ్‌ కల్చర్‌ విస్తరణకు అవకాశాలున్నాయి. సుదూరమైన సముద్రతీర ప్రాంతంతోపాటు పొడవైన కృష్ణా, గోదావరి బ్యాక్‌వాటర్‌ ప్రాంతం ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున రిజర్వాయర్లున్నాయి. ప్రత్యేకంగా కేజ్‌ కల్చర్‌ పాలసీని తీసుకొస్తే అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఐఆర్‌ సిద్దంగా ఉంది.    
– డాక్టర్‌ సుభాదీప్‌ఘోష్, సీఎంఎఫ్‌ఆర్‌ఐ విశాఖ రీజనల్‌ సెంటర్‌ హెడ్‌

త్వరలో కొత్త పాలసీ
బ్యాక్‌వాటర్‌తో పాటు రిజర్వాయర్లలో కేజ్‌ కల్చర్‌ విస్తరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.    
– కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ

12 కేజ్‌లు ఏర్పాటు చేశా..
కేజ్‌ కల్చర్‌ ఎంతో లాభదాయకం. నేను 2 కేజ్‌లతో ఈ సాగు ఆరంభించా. ప్రస్తుతం 12 కేజ్‌లకు విస్తరించగలిగా. ఒక్కో కేజ్‌కు రూ.50 వేలు పెట్టుబడిపెడితే రూ.లక్ష ఆదాయం వస్తోంది. చెరువులు అవసరం లేకుండా చేపలు పెంచే ఈ విధానం నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగం.
– తలశిల రఘుశేఖర్, కేజ్‌ కల్చర్‌ రైతు, నాగాయలంక 

ముందుకొచ్చే వారికి శిక్షణ
కేజ్‌ కల్చర్‌ను మరింత మెరుగుపర్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కల్చర్‌కు ముందుకొచ్చే వారికి పంజరం తయారీలో శిక్షణనిస్తున్నాం. సీడ్, ఫీడ్‌ అందిస్తున్నాం. సాగులో మెళకువలపై అవగాహన 
కల్పిస్తున్నాం.     
– డాక్టర్‌ శేఖర్‌ మేఘరాజన్, సీనియర్‌ శాస్త్రవేత్త, సీఎంఎఫ్‌ఆర్‌ఐ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top