ఒకే అభ్యర్థి బరిలో ఉన్నా ‘ఏకగ్రీవం’ వద్దు

Elections should be held under the NOTA in place of Unanimous - Sakshi

నోటా కింద ఎన్నికలు నిర్వహించాలి

హైకోర్టులో పిల్‌.. ప్రతివాదులకు నోటీసులు

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్నచోట ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించకుండా, నోటా కింద ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఒకే అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఫారం 10 జారీచేయాలని చెబుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్‌ 16 అమలును, ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 34 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు పీపుల్స్‌ యాక్షన్‌ కమిటీ (సీపీఏసీ) అధ్యక్షుడు ఎ.రాంబాబు, మరొకరు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది అన్వేష వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top