ఓట్ల చోరీ.. అడ్డదారుల్లో ఎన్నికలు | Elections are not being held properly in any state in the country says Parakala Prabhakar | Sakshi
Sakshi News home page

ఓట్ల చోరీ.. అడ్డదారుల్లో ఎన్నికలు

Jun 7 2026 4:34 AM | Updated on Jun 7 2026 4:34 AM

Elections are not being held properly in any state in the country says Parakala Prabhakar

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదు 

సర్‌ ప్రక్రియ అపహాస్యమవుతోంది 

ఇప్పటికే 6.50 కోట్ల మంది ఓట్లు తొలగింపు.. కోట్లాది మంది అర్హులు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం 

కేంద్రం చేతిలో కీలుబొమ్మలా భారత ఎన్నికల సంఘం  

రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ ఆందోళన    

నెల్లూరు (బారకాసు): దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని, ఓట్లు చోరీకి గురవుతున్నా­యని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ, అడ్డదారుల్లో ఎన్నికలపై ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కేఎంఏ సుభాన్‌ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో ‘మే­లుకో ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంలో భాగంగా ‘ఎన్నికల సంఘం పనితీరు – సర్‌పై అవగాహన–శిక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ అపహాస్యమవుతోందని చెప్పారు. పారదర్శకత లేకుండా చేపడుతున్న ఈ విధానం వల్ల రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కోట్లాది మంది అర్హు­లు కోల్పోతున్నారని చెప్పారు. సర్‌ ద్వారా ఇప్పటికే దేశంలో 6.50 కోట్ల మంది ఓట్లను తొలగించారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 16.50 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు.  

ఇది ఇంతటితో ఆగదు... 
వాస్తవానికి 2002లో జరిగిన సర్‌ ప్రక్రియకు, ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌కు చాలా తేడా ఉందని పరకాల చెప్పారు. అప్పుడు ‘సర్‌’ అంటే స్పెషల్‌ రివిజన్‌ ఆఫ్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ అని, ఇప్పుడు ‘సర్‌’ అంటే స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌(ఉద్దేశపూర్వకంగా రివిజన్‌) అని ఆయన వివరించారు. దేశంలో సర్‌ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదని, 30 కోట్ల మంది ఓట్లను తొలగించేంత వరకూ మళ్లీ మళ్లీ కొనసా­గుతూనే ఉంటుందన్నారు. 

సర్‌ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని వివరించారు. దాని గురించి ఎవరూ చర్చించడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికలను, రాజకీయాలను క్రికెట్‌ ఆటను చూసిన విధంగా చూస్తున్నారని, ఇది సరికాదన్నారు.  

ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయిస్తున్న పాలకులు 
గతంలో ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించేవారని, కానీ ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు నిర్ణయిస్తున్నారని పరకాల పేర్కొన్నారు. దేశంలో సర్‌ ప్రక్రియను నిర్వహించాలని ఎవరు నిర్ణయించారు? ఎందుకు, ఎలా నిర్వహిస్తున్నారన్న విషయాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. కేంద్రం చేతిలో భారత ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందని విమర్శించారు.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. అనంతరం తొలగించిన ఓట్లను తిరిగి ఎలా పొందాలి, ఓటు చోరీకి గురి కాకుండా ఎలా కాపాడుకోవాలి తదితర విషయాలను మసూద్‌ఖాన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement