ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు 

Eenadu news paper false statements on power cuts - Sakshi

రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు 

గాలివానకు విరిగి లైన్లపై పడుతున్న చెట్ల కొమ్మలు 

ఎండలవల్ల కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజులు 

దీంతో అక్కడక్కడ కొంతసేపు సరఫరాకు అంతరాయం 

ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె. సంతోషరావు, ఏపీఈపీడీసీఎల్‌ సీజీఎం వి.విజయలలిత స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతల్లేవని, వినియోగదారులకు నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సీఎండీ  కె. సంతోషరావు, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) సీజీఎం వి. విజయలలిత స్పష్టంచేశారు.

ఈనాడు దినపత్రికలో శుక్రవారం ‘ఎడాపెడా విద్యుత్‌ కోతలు’.. ‘కరెంటు కోతతో రోగుల కన్నీరు’.. ‘రొయ్యకు కరెంట్‌ షాక్‌’.. శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై వారు స్పందించారు. కేవలం సాంకేతిక సమస్యలతోనే అక్కడక్కడా సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయే తప్ప, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలను అమలుచేయడంలేదని వారు వెల్లడించారు. వారు పేర్కొన్న అంశాలివీ.. 

తిరుపతి జిల్లా, పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో విద్యుత్‌ కోతలులేవు. గ్రామ పరిధిలోని ఓ వినియోగదారుడు చెట్ల కొమ్మలను తొలగిస్తున్నప్పుడు కొమ్మలు విద్యుత్‌ లైనుపై పడడంతో సంబంధిత ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో మాత్రమే గురువారం ఉ.8  నుంచి 10 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా నాయుడుపేటలో కండక్టర్‌ తెగిపోయిన కారణంగా బుధవారం రాత్రి అరగంట పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ ఫీడరు ద్వారా విద్యుత్‌ సరఫరా చేశారు. అయితే, లైన్‌ మరమ్మతు పూర్తయిన తర్వాత ఫీడర్‌ను మార్చేందుకు మరోమారు పది నిమిషాలపాటు  సరఫరాలో అంతరాయం ఏర్పడింది.  

  ఏలూరు జిల్లా, దెందులూరులో విద్యుత్‌ కోతలులేవు. కానీ, గత శుక్ర, శనివారాలలో రాత్రి వేళల్లో భీమడోలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈదురుగాలులు, వర్షాల కారణంగా, 33కేవీ లైనులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వాటి మరమ్మతుల కారణంగా విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. ఎండల తీవ్రతకు, అధిక లోడు వలన 220 కేవీ నుంచి ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌లో మూడో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఓవర్‌ లోడ్‌ కారణంగా దానిని మార్చడానికి లైన్‌ క్లియర్‌ తీసుకున్నారు. దీంతో గణపవరం, నిడమర్రు, ఉండి, భీమవరం, పాలకోడేరు, కాళ్ళ, ఆకివీడు మండలాల్లో ఆక్వా రైతులకు కొంతమేర విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. 

 విజయనగరం జిల్లాలో గురువారం ఉ.11.02 నుండి 11.08 వరకు, బుడతనాపల్లి గ్రామంలో ఎల్‌టి సర్విసు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏబీ స్విచ్‌ ఆపడంవల్ల అంతరాయం కలిగింది. గురువారం 11 కేవీ ఉడా ఫీడర్‌పై 14.42 గంటలకు యూకలిప్టస్‌ చెట్టు కొమ్మలు పడటంవల్ల అదే ఫీడర్‌పై ఉన్న బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కార్యాలయానికి విద్యుత్‌ అంతరాయం కలిగిన వెంటనే సిబ్బంది చెట్లు, కొమ్మలు తొలగించి 15.48 గంటలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 

 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం 50 పడకల ఆసుపత్రి, ఏలూరు గవర్నమెంట్‌ ఆస్పత్రికి ఎలాంటి విద్యుత్‌ అంతరాయం ఏర్పడలేదు. టెక్కలి గవర్నమెంట్‌ ఆస్పత్రికి గు­రువారం 12 నిమిషాల పాటు, పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి గంట 40 నిమిషాలు పాటు ఈదురుగాలులు వేస్తు­న్న సమయంలో మాత్రమే అంతరాయం ఏర్పడింది. 

వేసవిలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా వున్నందున విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరుగుతోంది. సంస్థ పరిధిలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగినప్పటికీ డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా  చేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీల వినియోగం పెరగడంవల్ల లోడ్‌ ఎక్కువైనపుడు కొన్ని ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లలో ఫ్యూజులు పోతున్నాయి. గత కొన్నిరోజులుగా బలమైన గాలులు, వర్షాల కారణంగా విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.  

ఎండలు, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. 
ఇక ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోటాను అందిస్తోంది. రోజూవారీ వినియోగం 255 మిలియన్‌ యూనిట్లు ఉన్నప్పటికీ కోతలు లేకుండా సరఫరా చేస్తోంది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది ఎండలు, వర్షాన్ని లెక్కచేయకుండా త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నారు.

ముఖ్యంగా ఆస్పత్రులకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి కోతలు విధించడంలేదు. అదేవిధంగా రాత్రి సమయాల్లో విధుల నిర్వహణకు టీమ్‌లను ఏర్పాటుచేశారు. సమాచారం అందుకున్న సిబ్బంది సత్వరం స్పందించి సరఫరాను పునరుద్ధ రించేందుకు చర్యలు చేపడుతున్నారు.

కార్పొరేట్‌ ఆఫీస్‌ నుంచే కాకుండా సర్కిల్‌ స్థాయి, డివిజన్‌ స్థాయిల్లో కూడా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల పర్యవేక్షణకు లోడ్‌ మానిటరింగ్‌ సెల్‌లు 24గంటలూ పనిచేస్తున్నాయి. విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912కు ఫోన్‌చేసి పరిష్కారం పొందవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top