ట్యాబ్‌లపై తప్పుడు రాతలు.. ప్రజల దృష్టి మళ్లించేందుకే..

Education Department condemned Yellow Media Fake News - Sakshi

పచ్చ మీడియా కథనాలను ఖండించిన విద్యాశాఖ 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను అత్యుత్తమ ప్రమాణాలతో ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్ది వారు అంతర్జాతీయ అవకాశాలను కూడా అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తుంటే.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక వర్గానికి చెందిన పచ్చ మీడియా ఇష్టారాజ్యంగా తప్పుడు వార్తలు వండి వారుస్తోంది.

రాష్ట్రంలో 5.18 లక్షల మంది విద్యార్థులు, టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను బుధవారం సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లుచేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంగళవారం ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న పచ్చపత్రిక ‘ల్యాప్‌ పోయి ట్యాబ్‌ వచ్చే’.. అంటూ అసత్యాలతో ఓ కట్టుకథను అల్లింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా అవాస్తవం, సత్యదూరమని విద్యాశాఖ మంగళవారం తీవ్రంగా ఖండించింది. వాస్తవాలేమిటో సవివరంగా ప్రకటించింది. ఆ వివరాలు..  

తప్పుడు వార్తలోని మొదటి ఆరోపణ 
రాష్ట్రంలోని 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేడు కేవలం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు మాత్రమే అందిస్తోంది. 

వాస్తవం ఇదీ: ఇది నిజం కాదు. గతంలో అమ్మఒడికి బదులు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం ఇస్తున్న ట్యాబ్‌ అమ్మఒడికి అదనం. ఈ ట్యాబ్, ఈ–కంటెంటు ఖరీదు రూ.31,899. దీనివల్ల ప్రతి విద్యార్థికీ అమ్మఒడికి అదనంగా అంతకుమించిన లబ్ధి  కలుగుతోంది. విద్యార్థికి 8, 9 తరగతుల కంటెంట్‌ను సెక్యూర్డ్‌ డిజిటల్‌ (ఎస్డీ) కార్డు ద్వారా ప్రస్తుతం అందిస్తున్నారు.

వచ్చే ఏడాది పదో తరగతి కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తారు. దీనివల్ల 4,59,564 మంది విద్యార్థులకు అత్యుత్తమ ఈ–కంటెంట్‌ ఈ ట్యాబ్‌ల ద్వారా అందుతుంది. అంతేకాక.. 4, 5, 6, 7, 9, 10 తరగతులకు సంబంధించిన 32 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా బైజూస్‌ ఈ–కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చాం. దీని ఖరీదు బహిరంగ మార్కెట్లో రూ.15వేలు.  

రెండో ఆరోపణ 
అమ్మఒడికి రూ.15వేలు ఇస్తుండగా.. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు రూ.21వేలు ఖర్చవుతుందని ఆ ప్రాజెక్టును ప్రభుత్వం అటకెక్కించింది. 
వాస్తవం ఇదీ: ఈ ఆరోపణా అవాస్తవమే. గత ఏడాది ల్యాప్‌టాప్‌ చిప్‌ల కొరత ఏర్పడింది. దీనివల్ల ల్యాప్‌టాప్‌ల విక్రేతలు కోట్‌ చేసిన ధర అంచనా విలువకన్నా 16 శాతం మేర అధికంగా ఉంది. అంతేకాక.. వారు నిర్ణీత సమయం కన్నా 200 రెట్లు ఆలస్యంగా సరఫరా చేస్తామని, ఆ మేరకు తమకు వ్యవధి ఇవ్వాలని అడిగారు.

ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీవల్ల ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావించింది. పైగా.. ల్యాప్‌టాప్‌ల కోసం 22 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆప్షన్‌ ఇచ్చారు. కానీ, ఇప్పుడు 8వ తరగతిలోని వందశాతం మంది విద్యార్థులు అమ్మఒడి కింద ఇచ్చే నిధులతో పాటు ట్యాబ్‌లను కూడా అందుకోనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top