Andhra Pradesh: ఇక ‘ఈ–పాఠశాల’.. విద్యా రంగంలో మరో విప్లవాత్మక ముందడుగు.. వచ్చే ఏడాది నుంచి అమలు

E Schools To Start in Andhra Pradesh From Next Year - Sakshi

4వ తరగతి నుంచి 9 వరకు ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తున్న ప్రభుత్వం..

ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో చురుగ్గా కసరత్తు

2024–25లో సిలబస్‌ మార్పు అనంతరం పదో తరగతికి కూడా..

సాక్షి, అమరావతి: విప్లవాత్మక సంస్కరణల­తో విద్యా రంగాన్ని కొత్త పుంతలు తొక్కి­స్తు­న్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వే­స్తోంది. ఇప్పటికే బైజూస్‌ ద్వారా స్మార్ట్‌ ఫో­నుల్లో, ట్యాబుల్లో ఈ–కంటెంట్‌ అంది­స్తున్న ప్రభుత్వం ఇక నుంచి ఈ–పాఠశాలను ప్రవే­శపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీ­ఈ­ఆర్‌టీ) ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ను అందించనుంది. ఇందుకోసం పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకంగా ఈ–పాఠశాల యాప్‌ను రూపొందిస్తోంది.

ఈ కొత్త విధానం వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లు, కింది తరగతుల్లో స్మార్ట్‌ టీవీల ద్వారా ప్రభుత్వం డిజిటల్‌ విద్యాబోధన అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ తరగతులకు అవసరమైన ఈ–కంటెంట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా 4వ తరగతి నుంచి ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. 

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా..
లాంగ్వేజెస్, నాన్‌ లాంగ్వేజెస్‌.. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ–కంటెంట్‌ను రూపొందించే పనిలో ఎస్‌సీఈఆర్‌టీ నిమగ్నమైంది. ప్ర­స్తుతం 4వ తరగతి నుంచి నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు బైజూస్‌ సంస్థ ద్వారా కంటెంట్‌ అందిస్తున్నారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నా­యంగా ఎస్‌సీఈఆర్‌టీ అదే తరహాలో ఈ–కం­టెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. నాన్‌ లాంగ్వేజెస్‌ సబ్జెక్టులకు మాత్రమే కాకుండా లాంగ్వేజెస్‌ సబ్జెక్టుల్లో కూడా రూపొందిస్తోంది. పాఠ్యప్రణాళికలను రూపొందించేది ఎస్‌­సీ­ఈఆర్‌టీయే కాబట్టి భవిష్యత్తులో బైజూస్‌ సంస్థ ఉన్నా, లేకున్నా విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా ఈ– కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది.

దీన్ని ఏపీ ఈ–పాఠశాల, యూట్యూబ్, దీక్షా ప్లాట్‌­ఫారం, ఐఎఫ్‌బీ ప్లాట్‌ఫారం, పీఎం ఈ–విద్య (డీటీహెచ్‌ చానెల్‌)లో అందుబా­­టులో ఉంచుతారు. ఈ నేపథ్యంలో ఒకే రక­మైన కంటెంట్‌ ఉండేలా.. ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తు­తం ఎవ­రికి నచ్చినట్లు వారు ఈ–కంటెంట్‌ను రూ­పొందించి యూ­ట్యూ­బ్‌లో పెడుతున్నారు. దీనివల్ల విద్యా­ర్థులు కొంత సంశయానికి లోనవు­తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ­మే అన్ని అధికారిక చానెళ్లలో ఎన్‌సీఈ­ఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన ఈ–కంటెంట్‌ను అందుబాటులో ఉంచనుంది. 

బైజూస్‌ ఈ–కంటెంట్‌ ఉన్నా..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యా­ర్థు­లకు బైజూస్‌ కంటెంట్‌ అందుబాటులో ఉంది. అయితే ఇది నాన్‌ లాంగ్వేజెస్‌ (మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌)కు మాత్రమే పరిమి­తమైంది. విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఈ–కంటెంట్‌ను అభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించింది. వీరు 10వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ పాఠ్యాంశాలను ట్యాబుల్లోనే చదువుకోవచ్చు. అయి­తే బైజూస్‌ ద్వారా లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు ఈ–కంటెంట్‌ లేదు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌ఈసీ­ఆర్‌టీ) ద్వారా లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు (తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌) కూడా ప్రభుత్వం ఈ–కంటెంట్‌ను సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా ముందు 8వ తరగతిలో లాంగ్వేజ్‌ సబ్జెక్టులకు ఈ–కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇప్ప­టికే ఈ ప్రక్రియను చేపట్టిన ఎస్‌సీఈఆర్‌టీ మరో రెండు నెలల్లో దీన్ని పూర్తి చేయనుంది. ఆ తర్వాత వరుసగా 9, 7, 6 తరగతులకు రూపొందిస్తారు. 10వ తరగతికి 2024–25లో సిలబస్‌ మారుస్తా­మని.. ఆ తర్వాత ఈ–కంటెంట్‌ను రూపొందిస్తామని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు వివరించారు. వచ్చే ఏడాది నాటికి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ–కంటెంట్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగానే పాఠ్యాంశాలు
రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవే­శపెడుతున్నందున ఎన్‌సీఈఆర్‌టీ సిల­బస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ పా­ఠ్యాంశాలు ఉండేలా ఎస్‌సీఈఆర్‌టీ చ­ర్యలు చేపట్టింది. కేవలం మన రాష్ట్రా­నికి సంబంధించిన అంశాలనే విద్యార్థి నేర్చుకుంటే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెను­క­బడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నీట్, జేఈఈ వంటి పరీక్షలన్నీ ఎన్‌సీ­ఈఆర్‌టీ సిలబస్‌ ఆధారంగానే జరు­గు­తున్నాయి.

ఈ నేపథ్యంలో విద్యా­ర్థులు అలాంటి పరీక్షల్లోనూ మంచి విజయాలు సాధించేలా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఈ–కంటెంట్‌ రూపకల్ప­నలో యథాతథంగా అనుసరిస్తు­న్నా­రు. జాతీయ కరిక్యులమ్‌ను అనుసరించి జాతీయ అంశాలను బోధించేట­ప్పుడు మన రాష్ట్ర అంశాలను ఆసరా­గా చేసుకొని చెప్పేలా టీచర్లకు సూచనలు సైతం చేశారు.
చదవండి: ఇంటింటా జన నీరాజనం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top