కానిస్టేబుల్‌పై ‘అధికార’ జులుం | Driver attacks on constable | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌పై ‘అధికార’ జులుం

Jun 6 2025 3:24 AM | Updated on Jun 6 2025 3:24 AM

Driver attacks on constable

ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆయన సతీమణి డ్రైవర్‌ దాడి 

సోషల్‌ మీడియాలో వైరల్‌ 

వాహనాల తనిఖీలోఆపినందుకు రెచ్చిపోయిన డ్రైవర్‌ 

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘటన 

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటులపైనా అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్‌ బైక్‌ ఆపిన పాపానికి ఓ కానిస్టేబుల్‌ను ఇంటికి పిలిపించి మరీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వివరాలివీ.. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ అన్వర్‌బాషా 3వ తేదీ రాత్రి ఎస్‌ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్‌ సాయికుమార్‌ బైక్‌పై అటుగా వెళ్తున్నాడు. 

కానిస్టేబుల్‌ అతన్ని ఆపి తనిఖీ చేయగా.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌.. కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. తాను ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్‌నంటూ రెచ్చి  పోయి నానా హంగామా సృష్టించాడని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో డ్రైవర్‌కు నిర్వహించిన బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లో ఆల్కహాల్‌ పర్సంటేజ్‌ 145గా చూపించడంతో అతని సంతకం తీసుకుని ఎస్‌ఐ ఫైన్‌ చలనా రాసి పంపేశారని తెలిసింది. 

అయితే, ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్‌ తనపై దాడిచేసి కొట్టి గాయపరిచాడని ఎమ్మెల్యే సతీమణి ఎదుట డ్రైవర్‌ మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో.. బుధవారం ఉదయాన్నే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కానిస్టేబుల్‌ అన్వర్‌ బాషాను శ్రీకాళహస్తి రూరల్‌ సీఐ రవినాయక్‌ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని.. ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటే కానిస్టేబుల్‌పై డ్రైవర్‌ సాయికుమార్‌ దాడిచేశాడని, సీఐ ఆ దాడిని అడ్డుకున్నారని సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

అయితే, కానిస్టేబుల్‌పై దాడి అవాస్తవమంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి ఆడియో మెసేజ్‌ విడుదల చేశారు. కానీ, కానిస్టేబుల్‌ అన్వర్‌బాషా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తిలో పోలీసు కానిస్టేబుల్‌ అన్వర్‌బాషాపై దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement