పచ్చ మీడియా దుష్ప్రచారం.. ‘కేంద్ర డీఆర్‌ఐ నివేదిక 2021–22’  వెల్లడి.. డ్రగ్స్‌ కట్టడిలో ఏపీ భేష్‌

DRI report: Andhra Pradesh stands first in Country in Curbing Drugs - Sakshi

సాక్షి, అమరావతి: మాదక ద్రవ్యాల (డ్రగ్స్‌)పై ఉక్కుపాదం మోపడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నాలుగు రాష్ట్రాలతో కూడిన దండకారణ్యం ప్రాంతం నుంచి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో సమర్థవంతమైన పాత్ర పోషించింది. పకడ్బందీ ప్రణాళికతో విస్తృతంగా దాడులు నిర్వహించి గంజాయి సాగును, రవాణాను అడ్డుకోవడంతోపాటు ఎక్కువగా కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది.

కేంద్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) విడుదల చేసిన ‘భారతదేశంలో స్మగ్లింగ్‌ నివేదిక 2021–22’ ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22లో దేశవ్యాప్తంగా 28,334.32 కేజీల డ్రగ్స్‌ను జప్తు చేసినట్టు నివేదిక పేర్కొంది. దేశంలో 12 రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా సాగుతోంది. ఏపీలో గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా వ్యవహరించిందని ఈ నివేదిక పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఏకంగా 90 మంది స్మగ్లర్లను అరెస్టు చేసింది. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు చాలా ఉదాసీనంగా ఉన్నాయని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది.

ఏపీలో గత ప్రభుత్వాలు గంజాయి, ఇతర డ్రగ్స్‌ దందాను పట్టించుకోలేదు. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల దందాపై ఉక్కుపాదం మోపారు. ఇందుకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)ని ఏర్పాటు చేసి, అత్యంత సమర్థులైన అధికారులు, సిబ్బందిని ఇందులో నియమించారు. దీంతోపాటు 2021లో ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు, డ్రోన్‌ కెమెరాలతో సర్వే చేసి కేవలం రెండు నెలల్లో 11,550 ఎకరాల్లో గంజాయి సాగును ప్రభుత్వం కూకటివేళ్లతో పెకలించివేసింది. 2.49 లక్షల కిలోల గంజాయిని జప్తు చేసింది.

ఏపీ ప్రభుత్వ చర్యలను కేంద్ర నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)తో సహా యావత్‌ దేశం అభినందించింది. ఇప్పుడు డీఆర్‌ఐ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. విజయవాడలోని బోగస్‌ చిరునామాతో కస్టమ్స్‌ అధికారుల కళ్లుగప్పి పంజాబ్‌కు తరలించేందుకు అఫ్ఘానిస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు అక్రమంగా తరలించిన 2,988.21 కిలోల  డ్రగ్స్‌ ఉదంతాన్ని కూడా ఈ నివేదికలో ప్రస్తావించారు. ఆ డ్రగ్స్‌ వ్యవహారంతో విజయవాడకు ఏమాత్రం సంబంధంలేదని, కేవలం కస్టమ్స్‌ అధికారులను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు వేసిన ఎత్తుగడలో భాగంగా ఇక్కడి చిరునామా ఇచ్చారని డీఆర్‌ఐ దర్యాప్తులో వెల్లడైంది కూడా.

చదవండి: ('నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు')

పచ్చ మీడియా దుష్ప్రచారం
ప్రభుత్వం డ్రగ్స్‌ కట్టడిలో సమర్ధంగా పని చేస్తున్నా.. వక్ర భాష్యాల పచ్చ మీడియా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. డీఆర్‌ఐ నివేదిక ప్రశంసిస్తే.. దానిని కూడా రాష్ట్రంలో టీడీపీకి వత్తాసు పలికే పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. ఎక్కువ కేసులు నమోదు చేయడం, ఎక్కువ మందిని అరెస్టు చేయడం అంటే స్మగ్లింగ్‌ ఎక్కువగా జరుగుతోందంటూ ఆ మీడియా కథనాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు విమర్శిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి అక్రమ రవాణాను ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టే ఎక్కువ గంజాయిని జప్తు చేయలేదని, ఎక్కువ మంది స్మగ్లర్లను అరెస్టు చేయలేదన్నది సుస్పష్టం. అందుకు భిన్నంగా ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా గంజాయి , ఇతర డ్రగ్స్‌ దందాకు అడ్డుకట్ట వేస్తోందన్న విషయం కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించిందని నిపుణులు చెబుతున్నారు.  

చదవండి: (రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top