గిరిజన మ్యూజియం దేశానికే ఆదర్శం

Deputy CM Pushpa Sreevani Inaugurated Tribal Museum At Visakhapatnam - Sakshi

సాక్షి, చింతపల్లి(విశాఖ) : తాజంగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం దేశానికే ఆదర్శంగా నిలవాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీ వాణి ఆకాంక్షించారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని శుక్రవారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటైన సభలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 21 ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మ్యూజియాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాయన్నారు.

చింతపల్లి ప్రాంతం వేదికగా అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో ఎంతోమంది గిరిజనులు బ్రిటిషు పాలకులపై తిరుగుబాటు చేశారన్నారు. డౌనూరు నుంచి లంబసింగి వరకు ఘాట్‌రోడ్డు నిర్మాణ సమయంలో అల్లూరి సీతారామరాజే స్వయంగా బ్రిటిషు పాలకులపై దాడి చేసేందుకు సిద్ధంకావడం గొప్ప చరిత్ర అన్నారు. సాధారణ విల్లంబులతో చింతపల్లి పోలీసుస్టేషన్‌పై దాడిచేసి తుపాకులు స్వాధీనం చేసుకోవడం బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో దడ పుట్టించిందన్నారు. ఆయనకు అండగా మల్లుదొర, మర్రి కామయ్యలు ప్రాణత్యాగానికి సిద్ధంకావడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలన్నారు. దేశ స్వాతంత్య్రంలో పాల్గొన్న గిరిజన యోధుల గురించి భావితరాలకు తెలియాలన్నారు. అందుకు మ్యూజియం నిర్మాణం పూర్తయితే లంబసింగి ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గిరిజనులకు కూడా ఉపాధి కలుగుతుందని పుష్పశ్రీ వాణి అభిప్రాయపడ్డారు.

అన్ని రాష్ట్రాల గిరిజనులకు ఆదర్శం
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లోని గిరిజనులకు ఇక్కడి మ్యూజియం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర కశ్మీర్‌ అయిన లంబసింగిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు, జీసీసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి, ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు, ఐటీడీఏ పీఓ ఆర్‌. గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్, ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల లోగోలను ఆవిష్కరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top