అనంతపురంలో డెంగీ కలకలం | Dengue Cases in the Joint Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతపురంలో డెంగీ కలకలం

Published Sun, Jul 17 2022 3:43 PM | Last Updated on Sun, Jul 17 2022 7:36 PM

Dengue Cases in the Joint Anantapur District - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెంగీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒకటీ, రెండు నమోదయ్యే కేసులు పది రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో తక్కువగా ఉన్నా.. అనంతపురం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొబైల్‌ మలేరియా, డెంగీ క్లినిక్స్‌ (ఎంఎండీసీ)లను రంగంలోకి దించారు. తొలకరి జల్లులు పడగానే డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటికే నాలుగు సెంటినల్‌ సర్వేలెన్స్‌ కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైతే వీటిని విస్తరించాలని యోచిస్తున్నారు.


 
ప్లేట్‌లెట్స్‌ పేరిట భారీగా దోపిడీ 
వైరల్‌ జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. అయితే డెంగీ జ్వరమని చెబుతూ రోగిని, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్‌ ఆస్పత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. రకరకాల వైద్య పరీక్షలు చేయించి.. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా ఎవరైనా వసూళ్లు చేస్తే నేరుగా జిల్లా వైద్యాధికారికి గానీ, కలెక్టర్‌కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ డెంగీ నిర్ధారణ కాకున్నా ప్లేట్‌లెట్స్‌ పేరిట దోపిడీ చేయడం      ఆస్పత్రుల యాజమాన్యాలకు రివాజుగా మారింది. 

ధర్మవరం పట్టణానికి చెందిన ఖాదర్‌బాషా వారం రోజుల క్రితం జ్వరంతో అనంతపురం కమలానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని, డెంగీ లక్షణాలున్నాయని తెలిపి చికిత్స పేరుతో రూ.40వేలు వసూలు చేశారు. చివరకు అతనికి వైరల్‌ ఫీవర్‌ అని తేలింది. 

అనంతపురంలోని పాతూరుకు చెందిన నాగభూషణం వాంతులు, జ్వరంతో సాయినగర్‌లోని ఓ నర్సింగ్‌హోంలో చేరాడు. డెంగీ పేరుతో అతనినుంచి రూ.50వేలకు పైగా లాగారు. రోగి కోలుకున్నాడు కానీ, డెంగీ జ్వరం నిర్ధారణ కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement