
సాక్షి, అమరావతి: పోలీసుల నియామకానికి సంబంధించి ప్రత్యేక బోర్డు, నిబంధనలు ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణించేందుకు రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ఉన్న అధికారాన్ని ఇలా ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. చట్ట నిబంధనలు లేనప్పుడు మాత్రమే అధికరణ 309 కింద అధికారాలను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రామ,వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను (మహిళా సంరక్షణ కార్యదర్శులు) పోలీసు శాఖలో అంతర్భాగంగా పరిగణించడం అంటే మహిళా పోలీసులను దొడ్డి దారిలో నియమించినట్లేనని వ్యాఖ్యానించింది.
ఇందుకు సంబంధించిన జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఈ కేసు అర్హమైందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, సిలబస్, జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీసు నిబంధనలను ఖరారు చేస్తూ ఇచ్చిన ఈ రెండు జీవోలను పోలీసు చట్టానికి, నియామక నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.