
చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో యువకుడి మృతి
మంత్రి సవిత అనుచరులే చంపేశారని యువకుడి తల్లి ఆందోళన
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుల వల్లే తన కుమారుడు వడ్డే సునీల్(24) చనిపోయాడంటూ తల్లి లక్ష్మీదేవి ఆరోపించారు. గురువారం సాయంత్రం తన కుమారుడిని ఇష్టానుసారం కొట్టి చంపేసి.. చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, నారాయణప్ప దంపతుల కుమారుడు సునీల్.. నెల నుంచి కియా పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
శుక్రవారం ఉదయం ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరికి వేలాడుతున్న స్థితిలో సునీల్ మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి నారాయణప్ప ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపారు.
సునీల్ రొద్దం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను వేధించేవాడని, ఈ క్రమంలో ఆమె సమీప బంధువైన విట్టాపల్లికి చెందిన ఓ వ్యక్తి కలగజేసుకుని పరిగికి చెందిన వ్యక్తితో ఈ విషయంపై చర్చించాడని, దీంతో పరిగికి చెందిన వ్యక్తి గురువారం సాయంత్రం సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల ఎదుటే మందలించాడని, దీన్ని అవమానంగా భావించిన అతను గురువారం సాయంత్రమే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ చెప్పారు.
కాగా, సునీల్‌తల్లి లక్ష్మీదేవి మాత్రం కియా పరిశ్రమలో డ్యూటీకి వెళ్లిన తన కుమారుడు ఇలా ఉరి వేసుకునేంత తప్పు చేయలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి అనుచరుడు చంద్ర ఇంటి వద్దకు వచ్చి తన కుమారుడిని మందలించాడని, ఆ తర్వాత మరికొందరు కలసి ఇష్టానుసారం కొట్టారని ఆమె తెలిపారు. తన కుమారుడి చావుకు మంత్రి అనుచరులే కారణమని.. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని విన్నవించారు.