విక్రయాల్లో విచిత్రాలెన్నో..

Dealers Irregularities In Urea Sales - Sakshi

23 మందికే 2 వేల టన్నులకు పైగా యూరియా అమ్మినట్లు నమోదు 

మండలానికి సరిపోయే యూరియా ఒక్కరే కొన్నారట! 

డీలర్ల అక్రమాలపై ప్రభుత్వం సీరియస్‌

విచారణ చేస్తున్న డీఆర్వో 

కర్నూలు(అగ్రికల్చర్‌): యూరియా అమ్మకాల్లో ప్రయివేటు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు ఒడిగట్టారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి సమగ్ర విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో ఆయన  జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) పుల్లయ్యతో విచారణ చేయిస్తున్నారు. ఇప్పటికే డీఆర్వో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేశారు. ఈ క్రమంలో డీలర్ల ‘వేషాలు’ వెలుగు చూశాయి.

నందికొట్కూరులోని రెండు దుకాణాల్లో ముగ్గురు వ్యక్తులే 188 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. దీనిపై డీఆర్‌వో విచారణ చేయగా.. ఆ ముగ్గురూ ఆయా షాపుల్లో పనిచేసే గుమాస్తాలేనని తేలింది. బిజినవేములకు చెందిన ఇర్ఫాన్‌ 84.6 టన్నులు, షేక్‌ సికిందర్‌ 49.14 టన్నులు, చెరుకుచెర్లకు చెందిన శివన్న 54.945 టన్నులు కొన్నట్లు డీలర్లు రికార్డు చేశారు. 

నంద్యాలలోని ఒక ఫర్టిలైజర్‌ దుకాణంలో బి.గోవిందు అనే వ్యక్తి ఏకంగా 174.555 టన్నుల యూరియా (3,491 బస్తాలు) కొనుగోలు చేసినట్లు రికార్డు అయ్యింది. ఒక మండలానికి సరిపోయే యూరియాను ఒకే వ్యక్తి కొన్నట్లు డీలర్లు మాయ చేశారు. అలాగే అద్దంకి సత్యనారాయణ అనే వ్యక్తి 169.155 టన్నుల యూరియా కొనుగోలు చేసినట్లు చూపారు. 

ఇలా 23 మంది వేలాది బస్తాల యూరియా కొనుగోలు చేసినట్లు డీలర్లు చూపడం వెలుగులోకి వచ్చింది.   యూరియాతో సహా రసాయనిక ఎరువులను పట్టాదారు పాసు పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు  ఈ–పాస్‌ మిషన్‌లో రైతు వేలిముద్ర తీసుకుని పంపిణీ చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ డీలర్లు అడ్డగోలుగా వ్యవహరించారు.
 

3 షాపుల లైసెన్స్‌ సస్పెండ్‌ 
యూరియా అధిక ధరకు అమ్ముతున్నట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో తేలిన నేపథ్యంలో కల్లూరు మండలం చిన్నటేకూరులోని ధనుంజయ ఫర్టిలైజర్స్, కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని సాయికృప ఏజెన్సీస్, వసుంధర ఆగ్రో ఏజెన్సీస్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేస్తూ కర్నూలు సబ్‌ డివిజన్‌ ఏడీఏ ఆర్‌.విజయశంకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top