బ్యాక్‌ వాటర్‌ ముప్పు ఒట్టిదే

CWC On Polavaram project backwater Andhra Pradesh - Sakshi

పోలవరం కట్టాక భద్రాచలం, దుమ్ముగూడెం వద్ద పెరిగే నీటి మట్టం 10 సెంటీమీటర్లే

ఏపీఈఆర్‌ఎల్, సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడి

ఇదే అంశాన్ని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు నియమించిన గోపాలకృష్ణన్‌ కమిటీ

ఐఐటీ–హైదరాబాద్, ఐఐటీ–రూర్కీ నిపుణుల అధ్యయనాల్లోనూ అదే స్పష్టత  

అయినా ముంపు సమస్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మూడు రాష్ట్రాలు

ఆయా రాష్ట్రాలతో చర్చించి నెలాఖరులోగా నివేదికకు సుప్రీంకోర్టు ఆదేశం

ఈ నేపథ్యంలో 29న నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం సమావేశం

కేంద్ర జల్‌ శక్తి.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శుల సమక్షంలో భేటీ

ముంపు ముప్పు ఉండనే ఉండదని కుండబద్దలు కొట్టనున్న సీడబ్ల్యూసీ, పీపీఏ, ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపు ముప్పు ఉంటుదన్నది ఒట్టి అపోహేనని ఆదిలోనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్‌ అధ్యక్షతన సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ ఐఐటీతో తెలంగాణ ప్రభుత్వం.. రూర్కీ ఐఐటీతో ఒడిశా సర్కార్‌ చేయించిన అధ్యయనాలలోనూ ఇదే అంశం స్పష్టమైంది.

గోదావరిపై పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు.. కట్టాక, ప్రాజెక్టులోకి గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా వెనుక భాగంలో వరద నీటి మట్టం పది సెంటీమీటర్లు అంటే 1/3 అడుగు మేర మాత్రమే పెరుగుతుందని హైదరాబాద్‌ ఐఐటీ, రూర్కీ ఐఐటీ అధ్యయనాలలో వెల్లడైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988లో ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీస్‌(ఏపీఈఆర్‌ఎల్‌), 2009లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీకో సంస్థ చేసిన అధ్యయనాలలోనూ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావం పరిగణించదగ్గ స్థాయిలో ఉండదని స్పష్టమైంది.

ఇదే అంశాన్ని ఈనెల 29న కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌ గుప్తాల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో నిర్వహించే సమావేశంలో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఇసుమంత కూడా ఉండదనే అంశాన్ని ఈ సమావేశంలో మరో మారు స్పష్టం చేయాలని సీడబ్ల్యూసీ కూడా నిర్ణయించింది. 

పెద్దగా తేడా ఉండదు..
► గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తోందని.. దీని వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ సర్కార్‌లు వేర్వేరుగా ఎస్సెల్పీ(స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌)లు దాఖలు చేశాయి.

► వీటిపై విచారించిన సుప్రీంకోర్టు 2011 ఏప్రిల్‌ 11న సీడబ్ల్యూసీ రిటైర్డు సభ్యులు ఎం.గోపాలకృష్ణన్‌ నేతృత్వంలో సీడబ్ల్యూసీ అధికారులు, నిపుణులతో ముంపు ప్రభావాన్ని తేల్చడానికి కమిటీ వేసింది. ఈ కమిటీ 2011 మే 23, 24న పోలవరంలో పర్యటించి.. సమగ్రంగా అధ్యయనం చేసి, 2011 జూన్‌ 14న సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారమే ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోందని.. ఈ ప్రాజెక్టు కట్టినా, కట్టకపోయినా వెనుక జలాల్లో పెద్దగా ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.

► పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్వహణే అత్యంత కీలకమని.. సమర్థవంతంగా నిర్వహిస్తే ఎలాంటి ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్‌ నిపుణులు తెగేసి చెప్పారు. ప్రపంచంలో అత్యాధునిక హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ విధానంలో గేట్ల నిర్వహణను చేపట్టిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ముప్పు ఉండదని అభిప్రాయపడ్డారు.

► గోదావరికి 50 లక్షలు, 40 లక్షలు, 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు కుంట, శబరి లాస్ట్‌ క్రాస్‌ వద్ద ఏ స్థాయిలో నీటి మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు కట్టాక కూడా అదే స్థాయిలో నీటి మట్టం ఉంటుందని ఐఐటీ–రూర్కీ తేల్చింది. 

► పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 150 అడుగుల గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సంయుక్త సర్వే చేయాలి. ఇందుకు ఏపీ పలుమార్లు లేఖ రాసినా ఒడిశా స్పందించడం లేదు.  

► శబరి, సీలేరులకు కరకట్టలు కట్టినా కట్టకున్నా పెద్దగా మార్పు ఏమీ ఉండదని సీకో అధ్యయనం తేల్చిచెప్పింది.

గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పునకు లోబడే..
► గోదావరిపై పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 150 అడుగుల (45.72 మీటర్లు) సామర్థ్యంతో నిర్మించుకోవడానికి ఆమోదం తెలుపుతూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. దాంతో పోలవరం ప్రాజెక్టుకు గోదావరి ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపింది. 

► ప్రాజెక్టులో 140 అడుగుల్లో (42.672 మీటర్లు) నీటి మట్టం ఉన్నప్పుడు గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వేను నిర్మించాలని పేర్కొంది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. పోలవరం ప్రాజెక్టు వెనుక భాగాన ఎలాంటి ముంపు ప్రభావం ఉండకూడదనే లక్ష్యంతో ఆ మేరకు నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో స్పిల్‌ వేను నిర్మించేలా సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) డిజైన్‌లు ఆమోదించింది. ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోంది. తద్వారా ఎగువ నుంచి భారీ వరద వచ్చినా బ్యాక్‌ వాటర్‌ ప్రభావం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలపై ఏమాత్రం పడదు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశం
► పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలు అన్నింటితో నెలాఖరులోగా చర్చించి, నివేదిక ఇవ్వాలని ఈనెల 6న సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో ఈనెల 29న కేంద్రం నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. 

► విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులతోపాటు ఏవైనా రాష్ట్రాలతో సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ నేపథ్యంలో ఈనెల 29న నిర్వహించే సమావేశంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై వేర్వేరు అధ్యయనాలలో వెల్లడైన అంశాలను వివరించి ఆ రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top