ఏపీ పోలీసులపై తెలంగాణలో క్రిమినల్‌ కేసు | Criminal case filed against AP police in Telangana | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసులపై తెలంగాణలో క్రిమినల్‌ కేసు

Jul 2 2026 5:00 AM | Updated on Jul 2 2026 7:52 AM

Criminal case filed against AP police in Telangana

విజయలక్ష్మితో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఏపీ పోలీసులు

జర్నలిస్ట్‌ కేవీ రెడ్డిని బలవంతంగా తీసుకెళ్లిన బొబ్బిలి పోలీసులు 

ఈ క్రమంలో ఆయన భార్యతో అనుచిత ప్రవర్తన  

సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు 

క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు

సాక్షి, సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో నివసిస్తున్న జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డి (కేవీ రెడ్డి)ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఆయన భార్య చేయి పట్టి లాగటంతో పాటు అనుచితంగా ప్రవర్తించడంపై సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌పై కేవీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయనగరం జిల్లా బాడంగికి చెందిన మాజీ సర్పంచ్‌ కండి రమేష్‌ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా బాడంగి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌ 10న కేసు నమోదు చేశారు.

బీఎన్‌ఎస్‌లోని 152, 197, 296, 353, 352... ఐటీ యాక్ట్‌లోని 67, 67 (ఎ) సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో కేవీ రెడ్డిపై బొబ్బిలి కోర్టు ఈ ఏడాది మే 5న నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కేవీ రెడ్డిని అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేవీ రెడ్డిని అరెస్టు చేయడానికి బొబ్బిలి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం మంగళవారం రాత్రి 7.30 గంటలకు సాధారణ దుస్తుల్లో, ప్రైవేట్‌ వాహనంతో (టీఎస్‌ 08 ఎఫ్‌పీ 2712) హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ మధురానగర్‌లో ఉన్న జీవీ రెడ్డి ఇంటికి చేరుకుంది. 

ఆ సమయంలో షార్ట్, బనియన్‌తో ఉన్న కేవీ రెడ్డిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. కనీసం వ్రస్తాలు మా­ర్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. దీంతో తమ ఇంటికి వచ్చిన వాళ్లు దుండగులని, తన భర్తను కిడ్నాప్‌ చేస్తున్నారని భావించిన కేవీ రెడ్డి భార్య కె.విజయలక్ష్మి ఆర్తనాదాలు చేస్తూ పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఏపీ పోలీసుల వాహనాన్ని అడ్డగించారు. దీంతో తాము పోలీసులమని, కేవీ రెడ్డిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉందని చెబుతూ విజయలక్ష్మిని ఒడి­సి పట్టుకున్న ఏపీ పోలీసులు.. ఆమె పట్ల అభ్యంతరకరంగా, అనుచితంగా ప్రవర్తించారు. 

ఆమె చేయి లాగిపడేశారు. దాదాపు అర గంట పాటు ఈ హైడ్రా­మా నడిచింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చే­రు­కున్న సరూర్‌నగర్‌ పోలీసులు ఏపీ పోలీసు అధికారుల్ని, విజయలక్ష్మిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారెంట్‌ కాపీతో పాటు తమ వివరాలు అందించిన ఏపీ పోలీసులు అక్కడ నుంచి కేవీ రెడ్డిని తమ కా­రు­లో తీసుకువెళ్లారు. ఈ క్రమంలో పోలీసుస్టేషన్‌ వద్ద తతంగాన్ని రికార్డు చేస్తున్న మీడియా ప్రతినిధులతోనూ ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం ఏపీ పోలీసుల ప్రవర్తనపై విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్‌ పోలీసులు బొబ్బిలి సీఐ శ్రీనివాస్‌ తదితరులపై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారనే ఆరోపణలతో క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement