
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా గత ప్రభుత్వంపై విమర్శలే తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదు
జర్నలిస్టులపై దాడులు, కేసులు పెట్టడం సరికాదు
‘సాక్షి’తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
ఏడాదైనా గత ప్రభుత్వంపై విమర్శలే తప్ప అభివృద్ధి లేదు
పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
మీడియా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
రాష్ట్రంలో ఫాసిస్టు పాలన.. విద్య, వైద్యం, సంక్షేమమే లేదు
‘సాక్షి’తో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
తిరుపతి సిటీ: ‘కూటమి పార్టీలు అధికార దాహంతో ఎన్నికల్లో గెలుపు కోసం హామీలను గుప్పించాయి. గత ప్రభుత్వంలోని సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి ప్రజలకు అందిస్తామని చెప్పాయి. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టిసారించడం లేదు. అసలు ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. సీఎం చంద్రబాబుకు హంగూ ఆర్భాటాలే తప్ప అభివృద్ధిపై దృష్టిలేదు’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఏడాది అయినా.. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూటమి సర్కారు కాలయాపన చేస్తోందే కానీ, అభివృద్ధిపై దృష్టిసారించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఫాసిస్టు ధోరణి పాలన సాగుతోందని, కార్పొరేట్, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం తీరు మారిపోయిందని... ఈ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో చిన్నచూపు తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పేదల విద్యకు నిలయాలుగా, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు సంపన్నుల విద్యకు
కేంద్రం కావడం దారుణమని, వైద్యంలో సైతం ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు, కార్పొరేట్ ఆసుపత్రులు ధనికులకు అన్నట్లున్నాయని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న రాఘవులు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన, ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే..
⇒ పత్రికలు, జర్నలిస్టులపైన దాడులు, బెదిరింపులు, నిరాధారమైన కేసులు పెట్టడం దారుణం. తప్పులను ఎత్తిచూపుతూ ప్రభుత్వాలను మేల్కొలిపే జర్నలిజంపై దాడులు చేయడం బాధాకరం. ప్రశ్నించే గళంపై కక్షసాధింపు చర్యలను సమాజం హర్షించదు. పత్రికా హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. న్యూస్ పోర్టల్‌ను బ్లాక్ చేయడం వంటివి ప్రజా వ్యతిరేక చర్యలు. ఇవి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
⇒ ఆర్థిక వనరుల మెరుగుదలకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టకపోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారన్న మాటే తప్ప నిధులు రాబట్టలేకపోతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, రాయితీలంటూ ఉత్త మాటలే తప్ప ఆచరణ లేదు. విద్య, వైద్యం ప్రైవేటీకరణతో పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలలు, వైద్యం చేయించుకునే ఆస్పత్రులను పట్టించుకునే పరిస్థితి కరువైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల మత విద్వేషాలను రెచ్చగొట్టేలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు.
భూసేకరణే తప్ప అమరావతి పూర్తిపై దృష్టి లేదు
మోదీ దగ్గర మెప్పు పొందండం, ప్రజలకు ఏదో చేసేస్తున్నామన్న ఆర్భాటం, హంగు తప్ప అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టి లేదు. అమరావతి పునర్నిర్మాణం అంటూ మరో 40 వేల ఎకరాలు సేకరిస్తున్నారు. ప్రజల నుంచి భూ సేకరణే తప్ప అమరావతిని పూర్తి చేయడంపై ధ్యాస లేదు. అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టం చేసేందుకు ప్రయత్నించడంతో నాలుగేళ్లలో అయినా పూర్తి చేస్తారో.. లేదోననే అనుమానం ప్రజలకు కలుగుతోంది. చంద్రబాబు తన పాలనకు హంగూ ఆర్భాటాలు చేసుకోవడమే తప్ప అభివృద్ధి సాధించే రీతిలో అడుగులు పడడం లేదు.