అస్మదీయుడి కోసం అవినీతి స్కెచ్‌ | Corruption in the Thalli Bidda Express contract | Sakshi
Sakshi News home page

అస్మదీయుడి కోసం అవినీతి స్కెచ్‌

Jul 28 2025 5:43 AM | Updated on Jul 28 2025 5:43 AM

Corruption in the Thalli Bidda Express contract

రూ.200 కోట్ల ప్రాజెక్టు దొడ్డిదారిలో కైవసానికి సర్వం సన్నద్ధం

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కాంట్రాక్టు కట్టబెట్టేలా చక్రంతిప్పిన కీలక నేత

ఇప్పటికే సేవలు నిర్వహిస్తున్న సంస్థతో అస్మదీయుడి ఫౌండేషన్‌ కన్సార్షియం 

దీనికే కాంట్రాక్ట్‌ దక్కేలా ముందుగానే నిబంధనల రూపకల్పన

గత ప్రభుత్వంలో ట్రిప్‌నకు రూ.895 వంతున మాత్రమే చెల్లింపు

ఇప్పుడు మాత్రం రూ.2,200 చొప్పున ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు  

సాక్షి, అమరావతి: ఆరోగ్య శాఖలో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం అవినీతి వరద పారిస్తోంది. దొడ్డిదారిలో కీలక కాంట్రాక్ట్‌లు అన్నింటినీ అస్మదీయులు, బంధువర్గాలకు కట్టబెట్టడం ద్వారా తండ్రీ తనయులు రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు. వీరి బాటలోనే మరో కీలక నేత దోపిడీకి తెరలేపారు. తండ్రీ తనయులు, కీలక నేత దోపిడీలోనూ నీకింత, నాకింత అన్నట్లుగా వాటాలు వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో తన వాటా కిందకు వచ్చిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టేలా కీలక నేత వేసిన పథకం ఫలించిందని వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల మేర కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి చెందిన అనామక ఫౌండేషన్‌కు సమర్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కన్నింగ్‌ కన్సార్షియం 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన బాలింత, శిశువును ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకం కింద ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. అదే విధంగా గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు, ఇతర సేవల కోసం ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేలా ఉచిత రవాణా సౌకర్యాన్ని ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. నిర్వహణకు కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం కోసం ఈ ఏడాది మార్చిలో ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్‌ పిలిచింది. 

కానీ, కాంట్రాక్ట్‌ను అస్మదీయులకు కట్టబెట్టడం ద్వారా పెద్దఎత్తున లబ్ధి పొందాలని కీలక నేత స్కెచ్‌ వేశారు. అనుకున్నదే తడవుగా బెంగళూరుకు చెందిన సన్నిహితుడిని రంగంలోకి దింపారు. ఈయనకు మహారాష్ట్రలో ఓ ఫౌండేషన్‌ ఉంది. ఈ అనామక సంస్థను అడ్డుపెట్టి   కాంట్రాక్ట్‌ కైవసం చేసుకోవాలని పథకం పన్నారు.  

» ఫౌండేషన్‌తో నేరుగా టెండర్‌ వేయిస్తే.. సేవల్లో కనీస అనుభవం, ఫైనాన్షియల్‌ టర్నోవర్‌ లేనందున  కాంట్రాక్ట్‌ దక్కే పరిస్థి­తి లేదు. దీంతో కన్నింగ్‌ కన్సార్షియంకు తెర తీశా­రు. ఇప్పటికే రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందిసు­్తన్న సంస్థతో అస్మదీయుడి ఫౌండేషన్‌ జట్టు (కన్సార్షియం) కట్టింది. దీనికే కాంట్రాక్ట్‌ దక్కేలా టెండర్‌ మార్గదర్శ­కాలను ముందే రూపొందించేశా­రు. 

వా­స్తవా­నికి ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థపై కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే స­దరు కీలక నేత పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. సేవలు నిర్వహించడంలో విఫలమ­య్యారంటూ మండిపడ్డారు. కానీ, ఇప్పు­డు అదే సంస్థతో  ఆయన అస్మదీయుడి ఫౌండేషన్‌ను జట్టు కట్టించి అవినీతికి తెరలేపారు.  

వ్యయం ఎంత పెరిగితే అంత మేలని.. 
ప్రస్తుతం రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ల రూపంలో పెద్దఎత్తున దోపిడీ నడుస్తోంది. ఇందులోభాగంగా ప్రాజెక్ట్‌ల వ్యయం ఎంత పెరిగితే అంత లబ్ధి పొందవచ్చని అమాంతం రేట్లు పెంచేస్తున్నారు. ఇదే సూత్రం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లోనూ అమల్లోకి తెచ్చారు.  

»  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో.. 2022లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. అప్పట్లో ట్రిప్‌నకు రూ.895 చొప్పున మాత్రమే చెల్లించారు. ఇదే ధరతో రాష్ట్రం మొత్తం 500 వాహనాలతో సేవలందిస్తూ వచ్చారు. ప్రస్తుతం మూ­డేళ్ల కాల పరిమితితో టెండర్‌ పిలిచి, మ­రో రెండేళ్లు పొడిగించుకునే వీలు కల్పించారు. అంటే ఐదేళ్లు కాంట్రాక్ట్‌ పొందవచ్చ­న్న మాట. పాత టెండర్‌కు మూడేళ్లు పూర్త­యింది. ఇలా పరిశీలిస్తే రూ.300 ఆపై­న ధర పెరగడం సహజం. కానీ, కీలక నేత అస్మదీయుడు ఏకంగా ట్రిప్‌నకు రూ.2,200 కోట్‌ చేస్తూ ఫైనాన్షియల్‌ బిడ్‌ దాఖలు చే­శా­రు. గతంతో పోలిస్తే ఏకంగా ఒకటిన్నర రెట్లు ధర పెంచి దోచేయాలని స్కెచ్‌ వేశారు. 

» 500 వాహనాలు నెలకు 15 వేలు, ఆ పైనే ట్రిప్‌లు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.కోటిన్నర చొప్పున ఏడాదికి రూ.18 కోట్లే ఖర్చు అవుతోంది. అదే... కీలక నేత తాజా అవినీతి స్కెచ్‌ ప్రకారం నెలకే రూ.3.30 కోట్లు అవుతుంది. అంటే ప్రాజెక్ట్‌ వ్యయం ఏడాదికి రూ.40 కోట్లు, ఐదేళ్లకు రూ.200 కోట్లకు పెరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement