breaking news
Talli bidda express
-
అస్మదీయుడి కోసం అవినీతి స్కెచ్
సాక్షి, అమరావతి: ఆరోగ్య శాఖలో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం అవినీతి వరద పారిస్తోంది. దొడ్డిదారిలో కీలక కాంట్రాక్ట్‌లు అన్నింటినీ అస్మదీయులు, బంధువర్గాలకు కట్టబెట్టడం ద్వారా తండ్రీ తనయులు రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు. వీరి బాటలోనే మరో కీలక నేత దోపిడీకి తెరలేపారు. తండ్రీ తనయులు, కీలక నేత దోపిడీలోనూ నీకింత, నాకింత అన్నట్లుగా వాటాలు వేసుకున్నారు.ఈ నేపథ్యంలో తన వాటా కిందకు వచ్చిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి కట్టబెట్టేలా కీలక నేత వేసిన పథకం ఫలించిందని వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల మేర కాంట్రాక్ట్‌ను అస్మదీయుడికి చెందిన అనామక ఫౌండేషన్‌కు సమర్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నింగ్ కన్సార్షియం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన బాలింత, శిశువును ఇళ్లకు చేర్చడానికి ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం కింద ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. అదే విధంగా గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు, ఇతర సేవల కోసం ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేలా ఉచిత రవాణా సౌకర్యాన్ని ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. నిర్వహణకు కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం కోసం ఈ ఏడాది మార్చిలో ఏపీఎంఎస్ఐడీసీ టెండర్ పిలిచింది. కానీ, కాంట్రాక్ట్‌ను అస్మదీయులకు కట్టబెట్టడం ద్వారా పెద్దఎత్తున లబ్ధి పొందాలని కీలక నేత స్కెచ్ వేశారు. అనుకున్నదే తడవుగా బెంగళూరుకు చెందిన సన్నిహితుడిని రంగంలోకి దింపారు. ఈయనకు మహారాష్ట్రలో ఓ ఫౌండేషన్ ఉంది. ఈ అనామక సంస్థను అడ్డుపెట్టి కాంట్రాక్ట్ కైవసం చేసుకోవాలని పథకం పన్నారు. » ఫౌండేషన్‌తో నేరుగా టెండర్ వేయిస్తే.. సేవల్లో కనీస అనుభవం, ఫైనాన్షియల్ టర్నోవర్ లేనందున కాంట్రాక్ట్ దక్కే పరిస్థితి లేదు. దీంతో కన్నింగ్ కన్సార్షియంకు తెర తీశారు. ఇప్పటికే రాష్ట్రంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందిసు్తన్న సంస్థతో అస్మదీయుడి ఫౌండేషన్ జట్టు (కన్సార్షియం) కట్టింది. దీనికే కాంట్రాక్ట్ దక్కేలా టెండర్ మార్గదర్శకాలను ముందే రూపొందించేశారు. వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థపై కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సదరు కీలక నేత పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. సేవలు నిర్వహించడంలో విఫలమయ్యారంటూ మండిపడ్డారు. కానీ, ఇప్పుడు అదే సంస్థతో ఆయన అస్మదీయుడి ఫౌండేషన్‌ను జట్టు కట్టించి అవినీతికి తెరలేపారు. వ్యయం ఎంత పెరిగితే అంత మేలని.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ల రూపంలో పెద్దఎత్తున దోపిడీ నడుస్తోంది. ఇందులోభాగంగా ప్రాజెక్ట్‌ల వ్యయం ఎంత పెరిగితే అంత లబ్ధి పొందవచ్చని అమాంతం రేట్లు పెంచేస్తున్నారు. ఇదే సూత్రం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లోనూ అమల్లోకి తెచ్చారు. » గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. 2022లో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. అప్పట్లో ట్రిప్‌నకు రూ.895 చొప్పున మాత్రమే చెల్లించారు. ఇదే ధరతో రాష్ట్రం మొత్తం 500 వాహనాలతో సేవలందిస్తూ వచ్చారు. ప్రస్తుతం మూడేళ్ల కాల పరిమితితో టెండర్ పిలిచి, మరో రెండేళ్లు పొడిగించుకునే వీలు కల్పించారు. అంటే ఐదేళ్లు కాంట్రాక్ట్ పొందవచ్చన్న మాట. పాత టెండర్‌కు మూడేళ్లు పూర్తయింది. ఇలా పరిశీలిస్తే రూ.300 ఆపైన ధర పెరగడం సహజం. కానీ, కీలక నేత అస్మదీయుడు ఏకంగా ట్రిప్‌నకు రూ.2,200 కోట్ చేస్తూ ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేశారు. గతంతో పోలిస్తే ఏకంగా ఒకటిన్నర రెట్లు ధర పెంచి దోచేయాలని స్కెచ్ వేశారు. » 500 వాహనాలు నెలకు 15 వేలు, ఆ పైనే ట్రిప్‌లు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.కోటిన్నర చొప్పున ఏడాదికి రూ.18 కోట్లే ఖర్చు అవుతోంది. అదే... కీలక నేత తాజా అవినీతి స్కెచ్ ప్రకారం నెలకే రూ.3.30 కోట్లు అవుతుంది. అంటే ప్రాజెక్ట్ వ్యయం ఏడాదికి రూ.40 కోట్లు, ఐదేళ్లకు రూ.200 కోట్లకు పెరగనుంది. -
వైద్య సేవలపై ఫిర్యాదులకు '104 '
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతూ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఫిర్యాదులను సైతం స్వీకరించేలా ఇప్పటికే విస్తృత ప్రచారం పొందిన 104 టోల్ ఫ్రీ నంబర్ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. తొలుత ఐదు సేవలతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్(ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం.. ఈ ఐదు సేవలకు సంబంధించి తొలుత ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం ఇతర సేవలకు విస్తరించనున్నారు. స్పందనతో అనుసంధానం 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన సేవలు, సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే ప్రజలకు అందిస్తున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో 30 మంది సిబ్బందితో పనిచేసే కాల్‌సెంటర్‌కు నిత్యం వెయ్యి వరకూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఫిర్యాదులు స్వీకరించేందుకు విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటైంది. ఇక్కడ 30 మంది విధుల్లో ఉంటారు. ఫిర్యాదుల కాల్‌సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ ప్రజాసమస్యల పరిష్కార వేదిక డ్యాష్‌బోర్డుకు అనుసంధానించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, పరిష్కారానికి సంబంధించి డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎస్వోపీ రూపకల్పన కాల్ సెంటర్‌కు అందే ఫిర్యాదులను ఎంత సమయంలోగా పరిష్కరించాలి? ఎవరెవరు బాధ్యత వహించాలి? అనే అంశాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించారు. గత మూడేళ్లుగా ఐదు సేవలకు సంబంధించిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించింది. సమస్య తీవ్రత ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని అత్యంత వేగం, వేగం, సాధారణం అని మూడు విభాగాలుగా విభజించారు. అత్యంత వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను గంట లోపు పరిష్కరిస్తారు. వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 24 నుంచి 72 గంటలు, సాధారణ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 7 నుంచి 21 రోజుల్లోగా పరిష్కరించాలని నిర్దేశించారు. దీనిపై కాల్‌సెంటర్ సిబ్బంది, ఆరోగ్యశ్రీ, 104 ఎంఎంయూ, 108 జిల్లా కోఆర్డినేటర్లు, టీమ్‌లీడర్లు తదితరులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే వారం ప్రారంభం ఐదు రకాల సేవలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. ఇబ్బందులు ఎదురైతే 104కు కాల్ చేయవచ్చు. వచ్చే వారం ఫిర్యాదుల స్వీకారం ప్రారంభిస్తాం. అంబులెన్స్‌లు, ఆరోగ్య మిత్ర కియోస్క్‌లపై ఫిర్యాదుల నంబర్ ప్రదర్శించేలా స్టిక్కర్లు సిద్ధం చేశాం. వైద్య సేవలు పొందడంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాం. – వినయ్‌చంద్, ఆరోగ్యశ్రీ సీఈవో ఫిర్యాదులు ఇలా... ► నిర్దేశించిన ఐదు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటే 104కి కాల్ చేసి 1వ నంబర్ నొక్కాలి. ► అనంతరం కాల్ సెంటర్ సిబ్బంది లైన్లోకి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు. ► ఉదాహరణకు ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్య మిత్ర అందుబాటులో లేకుంటే ఈ ఫిర్యాదు అత్యంత వేగంగా స్పందించాల్సిన విభాగం పరిధిలోకి వస్తుంది. ఇది గంటలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్‌కు సమాచారం ఇస్తారు. ఒకవేళ అక్కడ స్పందించడంలో ఆలస్యం అయితే వెంటనే జిల్లా ఆరోగ్యమిత్ర కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌కు ఫిర్యాదు వెళుతుంది. గంటలోగా ఫిర్యాదు పరిష్కారం కాకుంటే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు అధికారుల దృష్టికి వచ్చేలా చర్యలు చేపట్టారు. సకాలంలో ఫిర్యాదు పరిష్కరించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. పలు సమస్యలు – వాటి పరిష్కారం ఇలా ఆరోగ్య శ్రీ అత్యంత వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (గంటలోపు) ► ఆరోగ్యమిత్ర అందుబాటులో లేకపోవడం ► ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్, చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడం వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► హెల్త్ కార్డు డీయాక్టివేషన్‌లో ఉండటం ► అడ్మిషన్, చికిత్స సమయంలో డబ్బు డిమాండ్ చేయడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► పోస్ట్ ఆపరేషన్, ఫాలో అప్‌లో సమస్యలు ► హెల్త్‌కార్డు అందకపోవడం ► కుటుంబసభ్యుడిని కార్డులో చేర్చడం, తొలగించడం ► ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతున్న రోగి మరణించడం, ఇతర ఫిర్యాదులు ఆరోగ్య ఆసరా వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► బ్యాంక్ ఖాతాలో ఆసరా డబ్బు జమకాకపోవడం ► ఆసరాకు దరఖాస్తు చేయడంలో ఆరోగ్యమిత్ర ఆలస్యం చేయడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► మంజూరైన దానికంటే తక్కువ భృతి అందడం, ఇతర ఫిర్యాదులు 104 ఎంఎంయూ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► గ్రామానికి 104 ఎంఎంయూ రాకపోవడం ► ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లిపోవడం ► వైద్యపరీక్షలు చేయకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► వైద్యసేవలు అందించడానికి డబ్బు డిమాండ్ చేయడం ► సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ► పరికరాలు పనిచేయకపోవడం, ఇతర సమస్యలు 108 అంబులెన్స్ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► అంబులెన్స్ ఆలస్యంగా రావడం, సేవలు అందించడానికి తిరస్కరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం ► అంబులెన్స్‌లో ఆక్సిజన్, మందులు, పరిశుభ్రంగా లేకపోవడం ► సిబ్బంది ప్రవర్తన, ఇతర సమస్యలు మహాప్రస్థానం వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► డ్రైవర్ మద్యం తాగి ఉండటం ► వాహనం అందుబాటులో లేకపోవడం, గమ్యస్థానానికి చేర్చడానికి నిరాకరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► సిబ్బంది ప్రవర్తన, డబ్బు డిమాండ్ చేయడం, ఇతర ఫిర్యాదులు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో) ► వాహనాలు అందుబాటులో లేకపోవడం, ఆలస్యం చేయడం, తరలింపునకు నిరాకరించడం సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో) ► డబ్బు డిమాండ్ చేయడం, వాహనం పరిశుభ్రంగా లేకపోవడం, ఇతర సమస్యలు -
తల్లీబిడ్డ.. నిరీక్షణ!
♦ ఆస్పత్రుల్లో బాలింతల అవస్థలు ♦ సమయానికి అందుబాటులో ఉండని వాహనాలు ♦ చెట్ల కింద తప్పని పడిగాపులు ♦ లక్ష్యం చేరని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ♦ సర్వజనాస్పత్రిలో పరిస్థితి దయనీయం యాడికి మండలం పీఎం పల్లికి చెందిన ఈ బాలింత పేరు షాహీదా. గత శనివారం అనంతపురం సర్వజనాస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం డిశ్చార్జి చేయడంతో ఆస్పత్రి ప్రధాన ద్వారం సమీపంలోని చెట్టు వద్ద ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం కోసం నిరీక్షించింది. కుటుంబ సభ్యులు వాహన డ్రైవర్‌కు ఫోన్ చేస్తే ‘వస్తాం.. అక్కడే ఉండండి’ అంటూ సమాధానం. ఫలితంగా వీరి అవస్థలు వర్ణనాతీతం. అనంతపురం మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం తర్వాత బాలింతలను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. డిశ్చార్జి సమయానికి ఒక రోజు ముందు నుంచే ఆందోళన మొదలవుతోంది. ఈ కారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచి మాతాశిశు మరణాల రేటును తగ్గించేందుకు ఉద్దేశించి ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ లక్ష్యం నీరుగారుతోంది. బాలింత, శిశువుతో పాటు సహాయకులను ఇంటికి చేర్చాలనేది ఈ వాహన ఉద్దేశం. వైద్యం ఖరీదైన ప్రస్తుత తరుణంలో ఈ పథకం మంచిదే అయినా అమల్లో చతికిలపడుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో తల్లీబిడ్డకు నిరీక్షణ తప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా 30 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత వైద్యులు డిశ్చార్జి తేదీ ప్రకటించగానే సంబంధిత ఆరోగ్య సిబ్బంది ‘102’ సర్వీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఫలానా బాలింతను ఫలానా తేదీన ఇన్ని గంటలకు పంపిస్తారని, వారికి సహాయంగా ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తారు. కచ్చితంగా ఆ సమయానికి అందుబాటులో ఉన్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఆస్పత్రికి వెళ్లి ఇంటికి చేర్చాలి. అయితే అమలులో ఆ పరిస్థితి లేదు. అనంతపురం సర్వజనాస్పత్రిలో 10, గుంతకల్లు–2, ధర్మవరం–2, తాడిపత్రి–2, గుత్తి–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–1, హిందూపురం–3, మడకశిర–1, పెనుకొండ–1, గోరంట్ల–1, కదిరి–3, అమడగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వాహనం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక వాహనం రోడ్డు ప్రమాదానికి గురి కాగా, మరో రెండు వాహనాలు మరమ్మతులో ఉన్నాయి. చాలా పీహెచ్‌సీల్లో బాలింతలు సొంత ఖర్చులతోనే ఇళ్లకు వెళ్తున్నారు. ఉన్న ప్రాంతాల్లో కూడా సేవలు సమయానికి అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆర్థికంగా స్థోమత లేని వారు గంటల తరబడి వేచిచూస్తున్నారు. మరికొందరైతే ఈ సేవలు వద్దనుకుని బస్సుల్లోనో.. ఆటోల్లోనే వెళ్లిపోతున్నారు. శస్త్ర చికిత్స ద్వారా కాన్పు జరిగిన వారికి, ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత కాన్పులోనే ఆపరేషన్ చేయించుకున్న వారు ఆటోలు, బస్సుల్లో వెళ్తూ నరకం అనుభవిస్తున్నారు. సర్వజనాస్పత్రిలో మరీ ఘోరం జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సాధారణ, సిజేరియన్ ద్వారా కాన్పులు నెలకు సుమారు 800 పైగా నిర్వహిస్తారు. పది వాహనాలు అందుబాటులో ఉన్నాయనే మాటే కానీ సేవలు మాత్రం మేడిపండు చందంగా మారుతున్నాయి. గతంలో సాయంత్రం సమయంలో డిశ్చార్జి చేసే వారు. దీంతో వాహనాల్లో తీసుకెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఇప్పుడు వీలైనంత వరకు మధ్యాహ్నం సమయానికే డిశ్చార్జి చేస్తున్నారు. అయితే ఆ సమయానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. సగం వాహనాలను ఆస్పత్రి వెనుక భాగంలో ఉంచి డ్రైవర్లు నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పర్యవేక్షణ గాలికి.. ఆస్పత్రిలో వైద్య సేవల పర్యవేక్షణకు ఆర్ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మ ఉన్నారు. మరో డిప్యూటీ ఆర్ఎంఓ జమాల్‌బాషా సెలవులో ఉన్నారు. ఇక్కడ గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు నిత్యం గొడవలకు దారితీస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. ఈ షయమై తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 108 వాహన సర్వీసుల ప్రోగ్రాం మేనేజర్ అంజన్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. సర్వజనాస్పత్రిలో అందరినీ ఒకే సారి డిశ్చార్జి చేస్తుండడంతో సమస్య వస్తోందన్నారు. ఈ విషయాన్ని తెలియజేసినా వారిలో మార్పు రావడం లేదన్నారు.