వ్యధలెన్నో.. విషాద గాథలెన్నో..

Coronavirus Effect on Poor People in East Godavari - Sakshi

కరోనా తెచ్చిన కష్టాలు 

ఒక్కో జీవితంలో ఒక్కోలా.. 

కరోనా జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.. జీవన చక్రాన్ని మార్చేస్తోంది.. కుటుంబాలనే కుదిపేస్తోంది.. ఎవరిని కదిలించినా ఏదోక వ్యధే.. కన్నీటి గాథే.. ఒక్కో ఘటన ఒక్కో హృదయ విదారక అంశమే.. ఈ కష్టకాలం అందరిలో నిస్సహాయత నింపుతోంది.. జిల్లాలోని కొన్ని ఘటనలను పరిశీలిస్తే..

భయం నిండింది.. గుండె ఆగింది 
రాజానగరం: భయమే ఆ యువకుడి ప్రాణాలను బలిగొంది.. కరోనా సోకడంతో మనోధైర్యాన్ని కోల్పోయిన అతని ఆయువు చివరికి గాల్లో కలిసిపోయింది.. వైరస్‌ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరానికి చెందిన ఓ వ్యాపారి(37) ఆదివారం మృతి చెందాడు. ఆ గ్రామంలో సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న ఈ యువకుడు నాలుగు మాసాలుగా కరోనా వైరస్‌ సమాచారాన్ని పరిశీలిస్తూ భయాన్ని కూడా పెంచుకున్నాడు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ నెల 22న బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడికి తీసుకెళ్లే సమయంలోనూ బిగ్గరగా ఏడుస్తూ విపరీతంగా భయపడిపోయాడు. 26న ఆయాసం ఎక్కువ కావడంతో రాజానగరంలోని జీఎస్‌ఎల్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌కు తీసుకువచ్చారు. అతనిలో భయాన్ని పోగొట్టి మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతుడికి నాన్నమ్మ, తల్లిదండ్రులతో పాటు భార్య, 8, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. అతని భార్యకు జీఎస్‌ఎల్‌లోనే ఆఖరి చూపులు చూసే అవకాశం కల్పించి, మృతదేహాన్ని పారిశుద్ధ్య సిబ్బంది ఖననానికి తరలించారు. 

అన్నా.. నేనూ నీతోనే.. 
పిఠాపురం:  అనుబంధాలను కరోనా తుంచేస్తోంది.. అందరికీ శోకాన్ని మిగుల్చుతోంది.. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఓ వ్యక్తి మృతి చెందగా.. దానిని జీర్ణించుకోలేని అతని చెల్లెలూ తనువు చాలించింది.. ఈ హృదయ విదారక ఘటన పిఠాపురంలో చోటు చేసుకుంది. పట్టణంలో ఆయన ఒక ముస్లిం పెద్ద (68). ఆయనకు ఒక చెల్లి (55) ఉన్నారు. వారిద్దరిదీ విడదీయరాని బంధం. చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వివాహాల అనంతరం వేర్వేరు కుటుంబాలుగా ఉన్నా అన్ని విషయాల్లో ఒకలాగే నిర్ణయాలు తీసుకునేవారు. రోజూ కలవక పోయినా ఫోన్‌లో అయినా మాట్లాడుకోకుండా ఉండలేరని వారి బంధువులు చెప్పారు. ఇటీవల ఆ ముస్లిం పెద్ద కంటి ఆపరేషన్‌ కోసం వైద్యులను కలవగా కరోనా టెస్టు చేయించుకోమన్నారు. ఇంతలో ఆయనకు జ్వరం వచ్చింది. దీంతో ఆయన టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్‌ అని తేలింది. ఇది తేలిన ఒక్క రోజుకే ఈ నెల 24న మృతి చెందారు. ఈ విషయం ఆయన చెల్లికి తెలిస్తే తట్టుకోలేదని బంధువులు దాచిపెట్టారు. చివరకు విషయం తెలిసిపోయింది. అన్నను కడసారి చూపైనా చూపించాలంటూ బంధువులను వేడుకుంది. కరోనా సోకిన వారిని చూడడం కుదరదని చెప్పడంతో తట్టుకోలేకపోయింది. అన్న మృతిని జీర్ణించుకోలేక.. కనీసం కడచూపైనా దక్కలేదని రోదిస్తూ శనివారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె మృతితో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది. ఇలా ఎన్నో జీవితాల్లో కరోనా శోకాన్ని నింపుతోంది.

ఏఎన్‌ఎంలకు... ఎంత కష్టమో!
మామిడికుదురు: కరోనా సమయంలోనూ వైద్య సేవలందిస్తున్న ఏఎన్‌ఎంలకు పెద్ద కష్టం వచ్చింది. నివాసం ఉండేందుకు ఇళ్లు లేక ఆలయ ప్రాంగణంలోని కళా వేదికపై తలదాచుకునే పరిస్థితిని కరోనా తెచ్చింది. పెదపట్నం గ్రామానికి చెందిన ఇద్దరు ఏఎన్‌ఎంల దయనీయ పరిస్థితి ఇది. పెదపట్నం ప్రధాన ఏఎన్‌ఎం కేడీవీ సత్యవతి అద్దెకుంటున్న అపార్ట్‌మెంటులో ఐదు కుటుంబాలకు చెందిన 11 మందికి పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయింది. అక్కడ మిగిలిన 14 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు.  అపార్టుమెంట్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

కరోనా ఘంటికలను ముందే పసిగట్టిన సత్యవతి తన కుటుంబ సభ్యులను వేరే ప్రాంతానికి పంపించేసింది. కానీ ఆమె అదే గ్రామంలో ఉద్యోగం చేస్తున్న దృష్ట్యా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. అపార్టుమెంట్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఏం చేయాల్లో తెలియని సమయంలో స్థానికంగా ఉన్న షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఆశ్రయం కోరింది. దీనికి ఆలయ కమిటీ సమ్మతించడంతో మూడు రోజుల నుంచి ఆ ప్రాంగణంలోనే ఉంటోంది. అక్కడే భోజనం చేస్తూ రాత్రి నిద్రపోతోంది. తాను విధులకు హాజరవ్వాలో లేదో తెలియక మదన పడుతోంది. పీహెచ్‌సీ ఉద్యోగులు తన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాలు పట్టించుకోలేదని ఆవేదనతో తెలిపింది. ఆమె ఇటీవల న్యూరో సర్జరీ చేయించుకుంది. 

ఇంచుమించు అలానే..
అదే గ్రామంలో సచివాలయ ఏఎన్‌ఎం వి.ఆదిలక్ష్మిది కూడా ఇంచుమించు ఇలాంటి గాథే. ఆమె తల్లి లక్ష్మీవెంకట సత్యవతి హార్ట్‌ పేషెంట్‌. ఇటీవల బైపాస్‌ సర్జరీ చేశారు. ఆమె తండ్రి నరసింహారావు షుగర్, బీపీతో బాధపడుతున్నారు. తల్లీ తండ్రి ఆరోగ్య సమస్యలను గుర్తించి ఆదిలక్ష్మి కూడా రెండు రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా అదే ఆలయ ప్రాంగణంలో తన సహచర ఏఎన్‌ఎంతో కలసి ఉంటోంది. 

శభాష్‌ బిడ్డా..
అంబాజీపేట: బోసి నవ్వుతో తల్లి వెచ్చని పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ చిన్నారికి కరోనా సోకింది.. నాలుగు నెలలకే పెద్ద కష్టం వచ్చిపడింది. చివరికి ఐసోలేషన్‌ సెంటర్‌కు చేరింది. అమ్మ జోల పాట లేనప్పటికీ, అక్కడి నర్సుల ఆలనా పాలనా.. అమ్మ లాంటి మమకారంతో బోసి నవ్వులే ఊపిరిగా చేసుకుని కరోనాను జయించింది. ఈ సంఘటన అంబాజీపేట మండలం మొసలపల్లిలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో భార్యాభర్తలు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి మూడో కుమార్తె (నాలుగు నెలలు)కు కరోనా సోకడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందింది. చివరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు.

ఆ చిన్నారికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉందని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దాంతో అప్పట్లో వైద్యం అందించి ఆ చిన్నారిని కాపాడారు. నాలుగు నెలల తర్వాత ఈ నెల 4న ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో తల్లిదండ్రులు కంగారు పడి అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు సేవలు అందించారు. మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులు చెప్పడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకుని ఇంటికి వచ్చే సమయంలో ఆ చిన్నారికి కరోనా సోకింది. బోసి నవ్వులతో తిరిగి శనివారం ఇంటికి సురక్షితంగా చేరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top