రాష్ట్రంలో టీకా ప్రారంభం నేడే

Corona Vaccination In AP Starts On 16th Jan - Sakshi

332 కేంద్రాల్లో ఏర్పాట్లు

ఉదయం 11.25 గంటలకు విజయవాడలో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/ఏలూరు టౌన్‌: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ నేడు రాష్ట్రంలోనూ ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ  చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేస్తారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో కుటుంబ సంక్షేమశాఖ అధికారులు టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాట్లను సమీక్షిస్తున్న అధికారులు 

మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 

విజయవాడ జీజీహెచ్‌లో సీఎం ప్రారంభం
విజయవాడలోని సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11.25 గంటలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో నిర్ణయించిన మేరకు టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ఆస్పత్రిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తదితరులు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రి అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష జరిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top