Coconut: కొబ్బరికి కరోనా దెబ్బ 

Corona Effect To Coconut Export, import - Sakshi

ఎగుమతి, దిగుమతుల్లో ఇబ్బందులతో ధరల్లో ఒడిదొడుకులు 

కేంద్రం నాఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించాలని రైతుల వినతి

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావం కొబ్బరి ధరలపైనా పడింది. కొబ్బరిని ఉత్పత్తి చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో 15 రోజులుగా ధరల్లో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కొబ్బరిని ఎక్కువగా ఉత్పత్తి చేసే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ సంకట స్థితి తలెత్తినట్టు వ్యాపార, రైతు వర్గాలు చెబుతున్నాయి. మిల్లింగ్‌ కొబ్బరి (డ్రై కోప్రా) కొనుగోళ్లు ప్రారంభం కానున్న తరుణంలో మిల్లింగ్‌ కొబ్బరి ధర తగ్గింది.

కొబ్బరి గుండ్రాల (బాల్‌ కోప్రా) ధర మాత్రం నిలకడగా ఉంది. 15 రోజుల్లో మిల్లింగ్‌ కోప్రా ధర క్వింటాల్‌కి రూ.600కు పైగా తగ్గినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్‌లో రెండు వారాల కిందట రూ.13,100 ఉన్న క్వింటాల్‌ మిల్లింగ్‌ కొబ్బరి ధర ఇప్పుడు రూ.12 వేల నుంచి రూ.12,550 మధ్య ఉంది. కొబ్బరి మార్కెట్‌కు పేరుగాంచిన కేరళ, తమిళనాడుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త కొబ్బరి మార్కెట్‌కు వస్తున్న సమయంలో ధరలు పతనం కావడం రైతుల్ని కలవరపెడుతోంది. 

తెల్లదోమ దెబ్బ మరువక ముందే.. 
ఇప్పటికే తెల్లదోమ తెగులుతో కొబ్బరి పంట బాగా దెబ్బతింది. దిగుబడి గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో వ్యాపారులు నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాల సాకుతో కొబ్బరి ధర తగ్గిస్తున్నారు. దీనికి కరోనా రెండోదశ విజృంభణ, జాతీయ, అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు తోడుకావడంతో కొబ్బరి ధర మరింత తగ్గింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నాఫెడ్‌ ద్వారా కొబ్బరిని కొనుగోలు చేయించాలని రైతులు కోరుతున్నారు.  

తగ్గిన వినియోగం.. 
కొబ్బరి నూనె ధర పెరుగుదలతో మార్కెట్‌లో అమ్మకాలు కూడా తగ్గాయని కొబ్బరి నూనె వ్యాపారి టి.సుబ్బారావు చెప్పారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇటీవలి కాలంలో కొబ్బరి నూనె వాడకం పెరిగినా ధరల పెంపుతో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా చౌకగా దొరికే నూనెల వైపు మళ్లారని పేర్కొన్నారు. అయితే కోవిడ్‌ మహమ్మారితో ఎగుమతి దిగుమతుల్లో ఏర్పడిన ఇబ్బందులతో అన్ని రకాల వంట నూనెల ధరలు పెరిగాయి. 

వర్జిన్‌ కోకోనట్‌ ఓకే.. 
మరోపక్క స్వచ్ఛమైన కొబ్బరి నూనె (వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌) కోవిడ్‌ చికిత్సకు పనికి వస్తుందని పరిశోధనల్లో తేలడంతో క్రూడ్‌ కోకోనట్‌ ఆయిల్‌కు ప్రధాన కేంద్రమైన ఫిలిప్పీన్స్‌లో ధరలు పెరిగాయి. టన్ను వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ ధర ఈ నెలలో 1,400 డాలర్ల నుంచి 1,800 డాలర్లకు చేరింది. వియత్నాం, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కూడా దాదాపు అదేవిధంగా ఉన్నట్లు ఆయిల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. 

నిలకడగా బాల్‌ కోప్రా.. 
బాల్‌ కోప్రా ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కర్ణాటకలోని తిప్తూర్‌ మార్కెట్‌లో బాల్‌ కోప్రా క్వింటాల్‌ ధర రూ.15,600 నుంచి రూ.15,900 మధ్య ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో 39 శాతం మాత్రమే కొబ్బరిగా మారుతుంది. అది సుమారు 15 మిలియన్‌ టన్నులు. ఇందులో 23 శాతాన్ని ఎండు కొబ్బరిగా గృహ అవసరాలకు వినియోగిస్తారు. మిగతా 77% వంట నూనెల తయారీకి వాడతారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top