సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ

Conviction Based Trial Case Monitoring System Giving Good Resuts Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు చేసిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రేమించిన మహిళను దారి కాచి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి కాకినాడ 3వ అదనపు సెషన్స్ జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 

ఈ ఘటనపై  దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన కేవలం 144 రోజులు, (నాలుగున్నర నెలలలోనే)విచారణ జరిపి శిక్ష విధించిన కోర్టు. మహిళల భద్రత విషయంలో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరుకు ఈ కేసు నిదర్శనం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇది చెంపపెట్టుగా నిలిచింది.

అసలేం జరిగిందంటే..
తనను ప్రేమించకుండా దూరం పెడుతుందనే అక్కసుతో కాకినాడ కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన కాదా దేవిక(21) అనే యువతిని వెంకట సూర్యనారాయణ అనే యువకుడు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్యచేశాడు. గతేడాది అక్టోబర్‌ 8న  పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద ఈ ఘోరం జరిగింది.  జరిగిన ఘటనపై మృతురాలి చిన్నాన్న గుత్తుల బాలాజి ఇచ్చిన ఫిర్యాదుపై పెదపూడి పోలీసు స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లో అరెస్ఠ్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి 7 పని దినాలలోపే ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.

ఈ కేసులో నేరం జరిగిన నాటి నుండి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక శ్రద్ధ వహించి, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు.  నిర్ణీత సమయంలో రిపోర్టులు (పోస్టుమార్టం, రసాయనిక పరీక్షల రిపోర్టులు) రావడానికి సంబంధిత అధికారులను సంప్రదించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయించారు.


 
దీంతో కాకినాడలోని గౌరవ 3వ అదనపు సెషన్స్ జడ్జ్  పి కమలాదేవి ఈ కేసు విచారణను జనవరి 9న ప్రారంభించారు. కోర్టు విచారణ సమయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ఆదిత్య కుమార్ ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ, వాద ప్రతివాదనలు విన్న అనంతరం నిందితుడుపై నేరం రుజువైనందున ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తేదీన తీర్పునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top