AP: నేడు కంటైనర్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభం.. ప్రమాదాల నివారణ దీని ప్రత్యేకత

Container Sub Station Commencement In Gollapudi Today - Sakshi

విజయవాడ గొల్లపూడిలో నిర్మాణం

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఇదే

ఓ చోటి నుంచి ఇంకొక చోటికి మార్చే అవకాశం

సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.5.5 కోట్ల ఖర్చు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజ­యవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో నిర్మించిన కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ)తో అతి తక్కువ స్థలంలో ఈ సబ్‌­స్టేషన్‌ను నిర్మించారు. విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మె­ల్యే వసంత కృష్ణప్రసాద్, ఏపీసీపీ­డీసీఎల్‌ సీఎండీ కె.పద్మజ­నార్దనరెడ్డి స్థానిక ప్రజాప్రతిని­ధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ ఇదే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) ఈ కంటైనర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను నిర్మించింది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీనివాసనగర్‌లో ప్రయోగాత్మకంగా నిర్మించిన ఈ సబ్‌స్టేషన్‌ ట్రయల్‌ రన్‌ ఇప్పటికే విజయవంతమైంది. ఈ సబ్‌స్టేషన్‌ 4.5 మీటర్ల వెడల్పు, 13 మీటర్ల పొడవున ఉంది. అందులోనే సబ్‌ స్టేషన్‌కు సంబంధించిన పరికరాలు అన్నింటినీ ఏర్పాటు చేశారు. అత్యా­ధునిక రీతిలో తక్కువ స్థలంలో కంప్యూటర్‌ ఆధారంగా ఆపరేట్‌ చేసేలా ఈ కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. దీని నుంచి ట్రాన్‌ఫార్మర్లకు కనెక్షన్‌ ఇచ్చి విద్యుత్‌ సరఫరా చేస్తా­రు. పూర్తి ఆటోమేషన్‌ విధానంలోనే ఈ కంటైనర్‌ సబ్‌ స్టేషన్‌ పనిచేస్తుంది. ఈ సబ్‌ స్టేషన్‌తో అర్బన్‌ ప్రాంతాల్లో బహుళ ప్రయోజనాలున్నాయి.

ఎంతో ప్రయోజనకరం
గొల్లపూడి ప్రజలకు ఈ కంటైనర్‌ సబ్‌ స్టేషన్‌ వరం లాంటిది. ఈ ప్రాంతం «శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిషత్తులో నిరంత విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలుగా ఏపీసీపీడీసీఎల్‌ అధికారులు ఈ కంటైనర్‌లో సబ్‌ స్టేషన్‌ను నిర్మించారు. మా ప్రాంత విద్యుత్‌ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన వెంటనే స్పందించారు. కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సహకరించిన మంత్రి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– కారంపూడి సురేష్, మార్కెట్‌ యార్డు చెర్మన్‌ గొల్లపూడి

నిర్వహణ వ్యయం తక్కువ
కంటైనర్‌ సబ్‌స్టేషన్ల ద్వారా డిస్కంలకు నిర్వహణ వ్యయం తగ్గుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గొల్లపూడిలో ప్రయోగాత్మకంగా దీనిని నిర్మించారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుంది. స్తంభాలతో పనిలేకుండా ఈ కంటైనర్‌ సబ్‌స్టేషన్లు ఆకర్షణీయంగా పనిచేస్తాయి. దీని నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి, మంత్రి, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– వసంత కృష్ణప్రసాద్, మైలవరం ఎమ్మెల్యే

ప్రయోజనాలు ఇలా..

  • కంటైనర్‌ సబ్‌స్టేసన్‌లో సమస్య తలెత్తితే వెంటనే సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్‌గా తలుపులు తెరచుకొంటాయి. 
  • వీడియో కాల్‌ ద్వారా సబ్‌స్టేషన్‌ పనితీరును పరిశీలించి తగు సూచనలు ఇచ్చి సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉంది. 
  • సబ్‌స్టేషన్‌ లోపల ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
  • సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ లైన్లు తెగిన వెంటనే ట్రిప్‌ అయ్యి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే వ్యవస్థ ఉంది. 
  • ఏ వీధిలో అయినా సమస్య తలెత్తితే సబ్‌స్టేసన్‌లో తెలుసుకొనే వీలుంది. 
  • వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని చోట రిమోట్‌ లోకేషన్‌ నుంచి కంప్యూటర్‌ ద్వారా ఆపరేట్‌ చేయొచ్చు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top