‘పది’.. పాపమంతా ‘నారాయణ’దే

Conspiracy by Narayana Educational Institution On Tenth Exams - Sakshi

చిత్తూరు అర్బన్‌: రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలను రాజకీయం చేసేందుకు, తమ స్వలాభం కోసం నారాయణ విద్యాసంస్థ చేసిన కుట్ర బట్టబయలైంది. తిరుపతిలో తెలుగు కాంపోజిట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన ప్రధాన నిందితులు నారాయణ సిబ్బందేనని గుర్తించిన పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. తిరుపతి నారాయణ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌రెడ్డి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌ చేసిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. గతంలో నారాయణలో పనిచేసి ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూస్తుంటే ప్రభుత్వంపై తెరవెనుక జరుగుతున్న కుట్ర బట్టబయలవుతోంది.

రెండు రోజుల క్రితం ప్రారంభమైన పది పరీక్షల్లో తెలుగు కాంపోజిట్‌ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడం, దీనికి కొనసాగింపుగా గురువారం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి హిందీ పేపర్‌ లీకేజీ వార్తలు ప్రచారం చేయడం ఇందుకు నిదర్శనం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాయి. చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు మంత్రిగా చక్రం తిప్పిన నెల్లూరు జిల్లా టీడీపీ నేత పొంగూరి నారాయణ ఈ విద్యా సంస్థల అధిపతి అనే విషయం తెలిసిందే. పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వైరల్‌ కావడంపై చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

చిత్తూరు నుంచే..
పరీక్ష ప్రారంభమయ్యాక తెలుగు కాంపోజిట్‌ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీన్ని చిత్తూరు టాకీస్‌ అనే వాట్సాప్‌ గ్రూపులో.. తిరుపతి నారాయణ పాఠశాల వైస్‌ ప్రిన్స్‌పాల్‌ గిరిధర్‌రెడ్డి పోస్టు చేశాడు. తొలుత తనకు రైల్వేకోడూరు నారాయణలో పనిచేసిన సుధాకర్‌ అనే వ్యక్తి ప్రశ్నపత్రాన్ని పంపాడని చెప్పి గిరిధర్‌రెడ్డి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. చిత్తూరు నగరంలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి.. నారాయణ సిబ్బంది డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కక్కుర్తిపడ్డ ఉపాధ్యాయుడు నారాయణ వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌రెడ్డికి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇలా నారాయణ సిబ్బంది నుంచి పలువురికి ప్రశ్నపత్రం ఫార్వర్డ్‌ అయినట్లు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు తెలుసుకున్నారు. ఆ మేరకు 90 శాతం కేసును ఛేదించారు.

పెద్ద ముఠా..
ఈ వ్యవహారంలో నారాయణ వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు మరో 10 మంది నారాయణ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు నూటికి నూరు మార్కులు వచ్చేలా చేయడానికి.. నారాయణతో పాటు పలు పేరొందిన విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఫలితంగా పరీక్ష ప్రారంభమైన గంటలోపు ప్రశ్నపత్రం బయటకు తీసుకురావడం, వాటికి సమాధానాలు రాసి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు పంపడానికి ఓ ముఠానే పనిచేస్తున్నట్లు సమాచారం. కొలిక్కివచ్చిన ఈ కేసులో శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లెలో 12 మంది అరెస్ట్‌
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ 12 మంది ఉపాధ్యాయులను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం పదిన్నర గంటల సమయంలో మూడో నంబర్‌ గదిలోని ఓ విద్యార్థికి చెందిన ప్రశ్నపత్రాన్ని సీఆర్పీ రాజేష్‌ తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీశాడు. అదే స్కూల్‌లోనే క్రాఫ్ట్‌ టీచర్‌ రంగనాయకులకు సెల్‌ఫోన్‌ ఇచ్చి సమీపంలోని రూములో ఉన్న టీచర్లకు ఇవ్వమని చెప్పాడు. సెల్‌ఫోన్‌ను టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డికి రంగనాయకులు అందించాడు. వారు రాజేష్‌ సెల్‌ఫోన్‌ నుంచి ప్రశ్నపత్రాన్ని తొమ్మిది మంది ఉపాధ్యాయులకు వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ చేశారు. తర్వాత టీచర్లంతా కలిసి వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నలకు జవాబులు తయారు చేసి అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ వాటర్‌ బాయ్స్‌గా అవతారమెత్తిన ఈశ్వర్, భగీరథ, చంద్రకిరణ్, విజయ్‌కుమార్‌ ద్వారా తొమ్మిది గదుల్లోకి ఆయా ఇన్విజిలేటర్ల అనుమతితో స్లిప్‌లు పంపారు.

ఉపాధ్యాయులతో పాటు మరొక సీఆర్పీ మద్దిలేటి సెల్‌ఫోన్‌కు క్వశ్చన్‌ పేపర్‌ రాగానే ఆన్సర్‌లు తయారు చేసి పంపించాడు. పోలీసులు, విద్యాశాఖాధికారులు వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. తహసీల్దార్‌ షేక్‌ మోహిద్దీన్‌ ఫిర్యాదు మేరకు 12 మందిపై కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తలారి రాజేష్‌ (సీఆర్పీ), నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదనరావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు(అంకిరెడ్డిపల్లె), దస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్‌), ఆర్యభట్ట (అబ్దులాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్‌ టీచర్‌ అంకిరెడ్డిపల్లె), మద్దిలేటి (సీఆర్పీ) పోలీసుల అదుపులో ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top