శాంతియుత పోరాటంపై ఇన్ని కుట్రలా!?
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సర్కారు కుతంత్రం
సాక్షి, అమరావతి: ‘కష్టం చెప్పుకుంటే ఇంత నయవంచనా.. న్యాయంగా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇన్ని కుట్రలా.. శాంతియుతంగా జరిగిన పోరాటానికి ఇంతలా వెన్నుపోటు పొడవాలా’.. అంటూ కొద్దిరోజులుగా విద్యుత్ ఉద్యోగులు ఆక్రోశంతో రగిలిపోతున్నారు. విద్యుత్ సంస్థల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టాలనుకున్న విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) గతనెల 18న అకస్మాత్తుగా ఆ నిర్ణయాన్ని విరమించుకుంది.
ప్రభుత్వం, యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ఉద్యోగులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడనప్పటికీ జేఏసీ సమ్మె విరమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెపె్టంబరు 15 నుంచి దశల వారీగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మహాధర్నాలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు వంటి నిరసనలను జేఏసీ ఎందుకు విరమించిందనే విషయం అర్ధంకాక ఉద్యోగులు తలలుపట్టుకున్నారు.
ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం నియమించిన స్టీరింగ్ కమిటీ ఎందుకంత మొండివైఖరిని అవలంబించిందనేది కూడా ఎవరికీ అర్థంకాలేదు. చర్చల వేళ జేఏసీ నేతలు అర్ధరాత్రి వరకూ కాళ్లావేళ్లా పడి బతిమాలినా కమిటీ కరగలేదు. పైగా.. వారికి ప్రభుత్వం ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. గంటల తరబడి విద్యుత్ సౌధ వద్ద పడిగాపులు పడేలా చేసింది. అయితే, ఇదంతా తెరముందు కనిపించగా.. తెరవెనుక అసలు కథ వేరేగా నడిచింది.
తెరవెనుక జరిగిందిదీ..
విద్యుత్ ఉద్యోగులు అక్టోబరు 15 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించగా, ప్రభుత్వం చర్చలకు పిలిచి ప్రధాని పర్యటన నేపథ్యంలో సమ్మెను వాయిదా వేయాలని కోరింది. దీంతో జేఏసీ అందుకు అంగీకరించింది. కానీ, అప్పుడే తెరవెనుక కుట్రలకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరలేపింది. జేఏసీతో అక్టోబరు 18న చర్చలు జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందుగా, అంటే అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)లో ఉన్న 102 మంది ఎలక్ట్రికల్ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిoచింది.
తద్వారా.. ఒకేసారి ఇంతమందిని పదోన్నతులపై బదిలీ చేయడం ద్వారా విద్యుత్ ఉద్యోగుల సంఘాల మధ్య కూటమి చిచ్చుపెట్టింది. వారిని విభజించి పాలించడం ద్వారా ఉద్యమానికి ఎసరు పెట్టింది. జేఏసీతో ఇంజినీర్ల సంఘం కలవకుండా ఉండేందుకే వంద మందికి పైగా ఇంజినీర్లకు ఒకేసారి పదోన్నతులతో గాలం వేసింది. దీంతో.. వారు జేఏసీతో కలిసేది లేదని, సమ్మెలో పాల్గొనేది లేదని కరాఖండీగా చెప్పేశారు.
లొంగని వారికి బెదిరింపులు..
మరోవైపు.. ఉద్యోగుల తరఫున ఆందోళనలు చేస్తూ, చర్చల్లో డిమాండ్లపై పట్టుబడుతున్న వారినీ ప్రలోభాలకు గురిచేసింది. కొందరికి పదోన్నతులు కల్పిస్తామని ఆశ పెట్టింది. వారికి, వారు కోరుకున్న వారికి తాయిలాలు ఇస్తామని హామీ ఇచి్చంది. కానీ, వీటికి లొంగని వారిని వ్యక్తిగతంతా బెదిరించింది. వారి ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ హెచ్చరించింది. గతంలో ఉన్న వివాదాలను తెరపైకి తెస్తామని, ఆరోపణలపై విచారణలు జరిపిస్తామని, శాఖాపరంగా చర్యలు తప్పవని భయపెట్టింది.
ఇవన్నీ ఓపక్క తెర వెనుక చేస్తూ మరోపక్క చర్చల పేరుతో కాలయాపన చేసింది. చివరికి.. తాను అనుకున్నట్లుగానే ఉద్యోగులకు మొండి చేయిచూపించి, ఆందోళనను విరమించేలా చేసి, సమ్మెలపై నిషేధం విధించింది. కూటమి ప్రభుత్వం నడిపిన ఈ మొత్తం ఎపిసోడ్‌తో విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.


