ఆండ్రూ మినరల్స్‌ తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు

Comprehensive investigation into the excavations of Andrew Minerals - Sakshi

అదనంగా 2 లక్షల టన్నుల లేటరైట్‌ను నిల్వ చేశారు

ఒడిశాలోని వేదాంత కంపెనీకి దాన్ని సరఫరా చేశారు

ఆ కంపెనీకి లేటరైట్‌ అవసరం లేదు, బాక్సైట్‌ అవసరం

లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ సరఫరా చేసినట్లు అనుమానం ఉంది

చైనాకు ఎగుమతి చేసిన 4.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజం లేటరైటా, బాక్సైటా అని దర్యాప్తు చేస్తున్నాం

ప్రాథమికంగా మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది

గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి, ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడి

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్‌లో ఆండ్రూ మినరల్స్‌ జరిపిన లేటరైట్‌ తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. తవ్విన లేటరైట్‌ ఖనిజాన్ని ప్రాసెస్‌ చేసి బాక్సైట్‌గా మార్చి విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో వివరాలు చెప్పారు. తమ శాఖలోని 5 విజిలెన్స్‌ బృందాలు ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో అక్రమాలు బయటపడినట్లు చెప్పారు. దీంతో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.  ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్‌ ఆదాయానికి గండి పడేలా వ్యవహరించినట్లు తేలిందన్నారు. వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే..

ఆండ్రూ మినరల్స్‌కు 2013లో రిజర్వు ఫారెస్టులో గిరిజనాపురం, లింగంపర్తి పరిధిలో ఆండ్రు శ్రీనివాస్‌ ఇతరుల పేరు మీద ఎనిమిది లేటరైట్‌ లీజులు మంజూరయ్యాయి. అక్కడ తవ్విన ఖనిజం కోసం తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో స్టాక్‌ యార్డ్‌లు నిర్వహిస్తున్నారు. అక్కడ ఖనిజాన్ని ప్రాసెస్‌ చేసి అల్యూమినియం, సిమెంట్‌ కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని యార్డులలో నిల్వ చేసినట్లు తనిఖీ బృందాలు నిర్ధారించాయి. ఈ ఖనిజాన్ని ఒడిశాలోని కలహండి జిల్లా లింజిఘడ్‌లోని వేదాంత లిమిటెడ్, సెసా స్టెరిలైట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు అలూమినియస్‌ (మెటలర్జికల్‌ గ్రేడ్‌)ను ఆండ్రూ మినరల్స్‌ సరఫరా చేసింది. ఫెర్రూజినియస్‌ (నాన్‌ మెటలర్జికల్‌ గ్రేడ్‌) లేటరైట్‌ను కూడా కొన్ని సిమెంట్‌ కంపెనీలకు సరఫరా చేసింది. 30:70 నిష్పత్తిలో మెటలర్జికల్, నాన్‌ మెటలర్జికల్‌ గ్రేడ్‌ లేటరైట్‌ను సరఫరా చేశారు. స్టాక్‌ యార్డుల్లో గుర్తించిన 2 లక్షల మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌లో 60 వేల టన్నులు మెటలార్జికల్‌ గ్రేడ్, మిగతాది  నాన్‌ మెటలార్జికల్‌ గ్రేడ్‌ ఉంది. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు చెల్లించాలి.

వేదాంతకు 32.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎగుమతి
వేదంత లిమిటెడ్‌ (ఒడిశా)కు 2014–15 నుంచి 2018–19 జనవరి వరకు ఆండ్రూ మినరల్స్‌ 32,75,815 మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌ను సరఫరా చేసింది. ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్‌ ఖనిజాన్ని వినియోగిస్తారు తప్ప లేటరైట్‌ను కాదు. లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ ఖనిజాన్ని ఆండ్రూ మినరల్స్‌ సరఫరా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. చైనాకు 4,65,342 మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని ఎగుమతి చేశారు. చైనాకు ఎగుమతి చేసింది లేటరైటా లేక ఆ పేరుతో బాక్సైట్‌ను పంపిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. లేటరైట్, బాక్సైట్‌ మధ్య చాలా స్వల్ప తేడా ఉంటుంది. సిలికా కంటెంట్‌ 38%లోపు ఉంటే లేటరైట్, అంతకంటే ఎక్కువ ఉంటే బాక్సైట్‌గా నిర్ధారిస్తారు. ప్రాథమిక తనిఖీల్లోనే ఆండ్రూ మినరల్స్‌ గ్రూప్‌ మైనింగ్‌ అక్రమాలకు పాల్పడినట్లు నిర్థారణ అయింది.

అందుకే ఆ సంస్థ మైనింగ్‌ కార్యక్రమాలన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఈటీఎస్‌ లేదా డీజీపీఎస్‌తోపాటు డ్రోన్‌లతో సర్వే చేయిస్తాం. తద్వారా ఆ కంపెనీకి నిర్దేశించిన ప్రాంతంలోనే మైనింగ్‌ చేశారా లేక సరిహద్దులను అతిక్రమించి మైనింగ్‌ చేశారా అన్నది తేలుస్తాం. మైనింగ్‌ ప్రదేశంలో భద్రత, రక్షణ నిబంధనలు, పేలుడు పదార్థాల లైసెన్స్‌లను పరిశీలిస్తాం. అన్ని క్లియరెన్స్‌లు ఉన్నాయా, పర్యావరణ విభాగం అనుమతించిన మైనింగ్‌ ప్రణాళిక ప్రకారమే పనులు చేస్తున్నారా, అన్ని అకౌంట్‌లను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా? వంటి విషయాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. 

ఇసుక కొరత లేదు
రాష్ట్రంలో ఇసుక కొరత లేదని ద్వివేది చెప్పారు. ప్రస్తుతం స్టాక్‌ యార్డుల్లో 60 లక్షల టన్నుల ఇసుక ఉందన్నారు. డిపోల వారీగా రవాణా చార్జీల్లో స్వల్ప మార్పులు చేస్తామని, ఆ వివరాలను త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పెడతామని తెలిపారు. డీజిల్‌ రేటు పెరిగితే స్వల్పంగా రేటు పెరుగుతుందని, తగ్గితే రేటు తగ్గుతుందన్నారు. 30›% స్టాక్‌ యార్డుల్లోనే రేటు స్వల్పంగా పెరుగుతుందన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top