Sakshi News home page

3 దశల్లో భూముల రీసర్వే పూర్తికి ప్రణాళిక 

Published Mon, Jun 6 2022 4:22 AM

Complete planning of land re-survey in 3 phases Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మూడు దశల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 5,300, రెండో దశలో 5,700, మూడో దశలో 6,460 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది. సర్వే ప్రక్రియలో చేపట్టాల్సిన నాలుగు కీలక పనుల్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలో కూడా షెడ్యూల్‌ రూపొందించారు. డ్రోన్‌ సర్వే పూర్తి చేసి ఆ ఫొటోలను ఇవ్వడం, క్షేత్ర స్థాయి సర్వే, సర్వే పూర్తయినట్లు ప్రకటించే నోటిఫికేషన్‌ (నంబర్‌ 13), వైఎస్సార్‌ జగనన్న భూహక్కు పత్రం జారీకి ఈ షెడ్యూల్‌ ఇచ్చారు.

మొదటి దశ గ్రామాల్లో వచ్చే ఏడాది జూలై 31, రెండో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది ఆగస్టు 30, మూడో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది నవంబర్‌ 30 నాటికి భూ హక్కు పత్రాలు జారీ చేయనున్నారు. ప్రస్తుతం 2,562 రెవెన్యూ గ్రామాల్లో (4,593 ఆవాసాలు) డ్రోన్‌ సర్వే పూర్తయింది. వాటిలో 1,272 రెవెన్యూ గ్రామాల డ్రోన్‌ ఫొటోలను సర్వే బృందాలకు అందించారు. ఇప్పటివరకు దాదాపు వెయ్యి గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. ప్రస్తుతం 67 డ్రోన్లు వినియోగిస్తుండగా త్వరలో వాటి సంఖ్యను పెంచనున్నారు.  

బాగా పనిచేసిన జిల్లాలు.. 
రీసర్వేలో కీలకమైన క్షేత్ర స్థాయి నిజ నిర్థారణలో బాగా పనిచేసిన జిల్లాలుగా శ్రీకాకుళం, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాలను రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలు ఇంకా సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉందన్నారు. గ్రామాల్లో సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో శ్రీకాకుళం, తిరుపతి, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు బాగా పనిచేయగా.. ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు బాగా పనిచేయాల్సి ఉందని తేల్చారు. 

మార్గదర్శకాలు జారీ.. 
షెడ్యూల్‌ ప్రకారం సర్వే పూర్తి చేయడానికి యంత్రాంగానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో డ్రోన్లు ఎగరేయకముందే గ్రామ రికార్డులను అప్‌డేట్‌ చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో చేపట్టిన సర్వేను 5 నెలల్లో పూర్తి చేసి.. భూముల రిజిస్ట్రేషన్లను సంబంధిత గ్రామ సచివాలయాల్లో ప్రారంభించాలని ఆదేశించింది. ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదని స్పష్టం చేసింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైఎస్సార్‌ భూ హక్కు పత్రాల జారీని పకడ్బందీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15న 41 ఆవాసాల్లో హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement