రిషికొండ తవ్వకాలపై కమిటీ 

Committee on Rishikonda Excavations Andhra Pradesh - Sakshi

4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి హైకోర్టు ఆదేశం 

సాక్షి, అమరావతి: రిషికొండ తవ్వకాలపై సర్వే నిమిత్తం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌) కొత్త కమిటీని నియమించింది. గతంలో కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసారి కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారులకు మాత్రమే స్థానం కల్పించింది.

సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యనిర్వాహక ఇంజనీర్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వి.వి.ఎస్‌.ఎస్‌.శర్మ, సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు శాస్త్రవేత్త డి.సౌమ్య, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ మాణిక్‌ మహాపాత్రలకు ఈ కమిటీలో స్థానం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ కోర్టుకు నివేదించారు.

ఈ వివరాలతో ఆయన ఓ మెమోను కోర్టు ముందుంచారు. సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు ఎనిమిది వారాల గడువు మంజూరు చేయాలని కోరారు. అయితే హైకోర్టు నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.

రిషికొండ తవ్వకాలపై ఏదైనా సమాచారాన్ని డీఎస్‌జీ ద్వారా కమిటీకి అందచేసేందుకు పిటిషనర్లకు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top