విజయవాడ: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందేలు, పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలనే సూచనలు జిల్లా స్థాయి అధికారులకు ఉన్నప్పటికీ.. కోడి పందాలు జోరు.. జూద శాలల నిర్వహణే కనబడుతోంది. తూర్పు గోదావరి, డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు పలు జిల్లాల వ్యాప్తంగా అటు పందెం బరులు.. ఇటు క్యాసినోన తలపించే జూద శాలలే కనబడుతున్నాయి. దాంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. మరొకవైపు అక్కడే మద్యం కూడా ఏరులై పారుతోంది. కోడి పందాలు, జూదాలు జరిగే చోట మద్యం స్టాల్స్‌ను పెట్టి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు.

చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూ లేనంతగా కోడి పందాలు, జూద క్రీడల నిర్వహణ సాగుతోంది. ఒక్క రాజానగరం నియోజవర్గ పరిధిలోనే 35 బరులు ఏర్పాటు చేశారు. దాంతో కోట్లాది రూపాయలు క్షణాల్లో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు అన్నట్లు చేతులు మారుతున్నాయి. తినకుండేపూడి రఘుదేవపురం కోటి మధురపూడి రాజవరం గ్రామాల్లో భారీ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారు.

ఒక్క బరిలోనే ఐదు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. పలుచోట్ల టిడిపి నేతల ఆధ్వర్యంలో కోడిపందాలు జూద శిబిరాలు నిర్వహిస్తన్నారు. జంబు పట్నంలో టిడిపి జనసేన నేతల మధ్య విభేదాలతో రెండు బరులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో టిడిపి నేత ఆధ్వర్యంలో భారీ కోడిపందాలు బరి ఏర్పాటు చేయగా, కడియం వీరవరం రోడ్డులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూటమినేతల ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా బరితెగించి కోడిపందాలు పేకాటలు నిర్వహిస్తున్నా తమకేమి సంబంధం లేనట్టు మిన్నకుండిపోతున్నారు పోలీసులు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా కోడి పందాలు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. కూటమి నేతల అండతో కోడి పందాలు, జూద శాలలు ఏర్పాటు చేయగా, మంచి నీళ్ల మాదిరిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లిలో టిడిపి నేతల ఆధ్వర్యంలో మినీ క్యాసినో నిర్వహిస్తున్నారు. రామవరప్పాడులో మినీ స్టేడియాన్ని తలపిస్తున్న కూటమి నేతలు ఏర్పాటు చేసిన బరి. కోడి పందాల బరుల్లో ప్రత్యేకంగా పేకాల కోసం బరులు ఏర్పాటు చేశారు. పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, తిరువూరు, మైలవరంలో భారీగా జూదం బరులు నిర్వహిస్తన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇదే పరిస్థితి కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.


