మెగా డీఎస్సీలో మెలిక! | Coalition government dashed the hopes of DSC candidates | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీలో మెలిక!

Apr 21 2025 4:57 AM | Updated on Apr 21 2025 8:09 AM

Coalition government dashed the hopes of DSC candidates

డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరి 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డిగ్రీలో 45 శాతం, పీజీలో 50 శాతం ఉండాల్సిందే

ఇంటర్‌ అర్హతతో రాసే ఎస్‌జీటీ పోస్టులకూ ఇదే నిబంధన 

డీఎస్సీ దరఖాస్తు దశలోనే సగం మందిపై అనర్హత వేటు  

వెరసి 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం 

కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారి పోస్టులకూ నోటిఫికేషన్‌ 

హామీ మేరకు వారికి వెయిటేజీ ఇవ్వకుండా సర్కారు మోసం 

27,333 పోస్టులు ఖాళీ ఉన్నా కేవలం 16,347 పోస్టులకే నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో కూటమి సర్కారు మెలిక పెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యా రంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి సర్కారు.. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు, ఇంటర్‌ అర్హతతో రాసే ఎస్‌జీటీ పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 

2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదని, ఆ నోటిఫికేషన్‌ను పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో నోటిఫికేషన్‌ అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం.. నోటిఫికేషన్‌ ఇచ్చి తమ ఆశలను చిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు.  

హడావుడి చేసినంత కూడా లేదు.. 
ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేసి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ అగ్ర నాయకులు హామీలు గుప్పించారు. గతేడాది జూన్‌ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. 

ఆగస్టులో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి, గత ప్రభుత్వంలో 6,100 పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. తర్వాత టెట్‌ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి, టెట్‌కు, డీఎస్సీకి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యా శాఖలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా, కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేశారు.  

గ్రామీణ పేద విద్యార్థులపై వేటు 
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిర పడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్‌ లేదా బీఈడీ మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాసై ఇంటర్‌ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మందికి పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల శాతం 40–45 ఉంటుంది. 

ప్రస్తుత డీఎస్సీ–2025లో జనరల్‌ అభ్యర్థులకు ఎస్‌జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం, పీజీటీకి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. అలాగే, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్‌జీటీ/ఎస్‌ఏ పోస్టులకు 45, పీజీటీకి 50 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అర్హత గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన అందిస్తున్న టీచర్లు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. 

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ్‌ పాఠశాలల్లో గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లుగా సుమారు 1,200 మంది పని చేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం, ఏపీ మోడల్‌ స్కూళ్లలో మరో 2 వేల మంది పని చేస్తు­న్నారు. ప్రస్తుత డీఎస్సీలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టు­లు రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీసు అందిస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement