కోవిడ్‌ పరిస్థితులకు తగ్గట్లు సిద్ధం కావాలి.. అధికారులతో సీఎం జగన్‌

CM YS Jagans Review On Covid - Sakshi

తాడేపల్లి:  వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ప్రత్యేకంగా కోవిడ్‌ అప్రమత్తతపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

దేశంలో కరోనా కేసులు మళ్లీ కనిపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ సూచించారు. సరిపడా ఆక్సిజన్‌ బెడ్‌లను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. ఏపీలో ఇప్పటివరకు కోవిడ్‌ న్యూ వేరియెంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌. 7 ఎక్కడా నమోదు కాలేదని అధికారులు వివరించగా.. కోవిడ్‌ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్‌ క్లినిక్‌లే కేంద్రంగా చికిత్స అందించాలని.. అందుకు తగ్గట్లు ఎస్‌ఓపీలు ఉండాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. 

టెస్టింగ్, మెడికేషన్‌ విలేజ్‌ క్లినిక్‌ కేంద్రంగా జరగాలని, ఏఎన్‌ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్‌ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలని, పీహీచ్‌సీల పర్వవేక్షణలో విలేజ్‌ క్లినిక్‌లు పనిచేయాలని సీఎం తెలిపారు.  మాస్కులు ధరించడంతో పాటు కోవిడ్‌ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలన్నారు. అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలన్న ఆయన.. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను ముందుగా తనిఖీ చేయాలని, 2023 జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియంతా పూర్తి చేయాలని సీఎం జగన్‌ మరోసారి అధికారులకు తేల్చి చెప్పారు.

ప్రభుత్వాసుపత్రిలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలన్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్‌ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలని తెలిపారు. దీనికి స్పందించిన అధికారులు.. రోజుకు 60వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టింగ్‌ కెపాసిటీ గతంలో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఆ కెపాసిటీ 30 వేలుగా ఉందని తెలిపారు. అదే విధంగా.. విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌ కూడా అందుబాటులో ఉందని సీఎంకు నివేదించారు. 13 చోట్ల టెస్టింగ్‌ ల్యాబులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపిన అధికారులు, మరో 19 చోట్ల టెస్టింగ్‌ ల్యాబులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. 320 టన్నుల మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు, ఎన్‌ – 95 మాస్కులు, కోవిడ్‌ పీపీఈ కిట్స్‌ అందుబాటులో ఉంచుతామని సీఎం జగన్‌కు వివరించారు.

అలాగే.. అన్ని ఆసుపత్రుల్లోనూ మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్న సీఎం జగన్‌.. కోవిడ్‌ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్‌ క్లినిక్స్‌కు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రిఫర్‌ చేసేలా ఉండాలని తెలిపారు. 

వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష.. 

వైద్య ఆరోగ్యశాఖలో డాక్టర్లు, సిబ్బంది భర్తీ, మందుల పంపిణీ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, బోధనాసుపత్రుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా.. వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీపై సీఎంకు నివేదిక సమర్పించారు అధికారులు. జనవరి 26 నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కూడా కల్పించాలని, జనవరి 26 నాటికి విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు కూడా పూర్తి కావాలని సీఎం జగన్‌.. అధికారులకు స్పష్టం చేశారు. 

విలేజ్‌ క్లినిక్స్‌ మొదలుకుని సీహెచ్‌సీలతో సహా బోధనాసుపత్రుల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. దీనికోసం ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. ఎక్కడా మందుల కొరత తలెత్తకూడదని తెలిపారు. ఆపై వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపైనా సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలని, కొత్తగా మంజూరు చేసిన పార్వతీపురం మెడికల్‌ కాలేజీ సహా అడక్కడగా ప్రారంభంకాని బోధనాసుపత్రుల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. జనవరి 26వ తేదీ(2023) నాటికి పార్వతీపురంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా చేపడుతున్న అన్ని మెడికల్‌ కాలేజీల్లో నిర్మాణ పనులు మొదలు కావాలని అధికారులకు లక్ష్య నిర్దేశన గుర్తు చేశారు.

ఆపై ఆరోగ్యశ్రీపైనా సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు అవసరమైన 104 వాహనాలను జనవరి 26వ తేదీనాటికి సిద్ధం చేసుకోవాలన్నారు. 104 సేవలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఆరోగ్యశ్రీ రిఫరల్‌కు సంబంధించిన యాప్‌ ఏఎన్‌ఎం, ఆరోగ్యమిత్రతో సహా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులో ఫాలో అఫ్‌ మెడిసన్‌ అందుతుందా లేదా అనే విషయాల్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్‌ సిబ్బంది ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ  కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమీక్ష సమావేశానికి  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ జవహర్ రెడ్డి,  ప్రిన్సిపాల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఇతర అధికారులుహాజరయ్యారు.దేశంలో పలు రాష్ట్రాలో కరోనా ఛాయలు మళ్లీ కనిపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పలు మార్గదర్శకాలను సూచించింది. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top