ప్రతి పల్లెకు ఇంటర్నెట్‌తో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’: సీఎం జగన్‌

CM YS JaganMohanReddy: Review On Village Internet And Ammavodi Laptops - Sakshi

ల్యాప్‌టాప్‌లు జనవరి 9న అందించాలి

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌, అమ్మఒడిలో ల్యాప్‌టాప్‌ పంపిణీపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఏర్పాటు, అమ్మఒడి పథకంలో భాగంగా ఆప్షన్‌గా ఇవ్వాల్సిన ల్యాప్‌టాప్‌లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారు. మంత్రి బాలినేని, ఏపీ ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. అన్ని గ్రామాలకు అపరిమితంగా ఇంటర్నెట్‌ కనెక్షన్స్‌ ఉండాలని, సీఎంఏ స్పీడ్‌ కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. అన్ని గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు ఉండాలని చెప్పారు. స్వగ్రామంలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉండాలని తెలిపారు. నిర్ణీత వ్యవధిలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.

జనవరి 9న ల్యాప్‌టాప్‌లు అందించాలి
అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లు కోరుకున్నవారందరికీ జనవరి 9వ తేదీన అందించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులివ్వాలని తెలిపారు. ల్యాప్‌టాప్‌ చెడిపోతే సర్వీస్‌ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు 307 మండలాల్లోని 3,642 గ్రామాల్లో 14,671 కిలో మీటర్ల మేర ఏరియల్‌ కేబుల్‌ వేసినట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ సీఎంకు వివరించారు.

మరోవైపు 690 చదరపు అడుగుల విస్తీర్ణంతో వైఎస్సార్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు నిర్మిస్తున్నట్లు, ఒక్కో లైబ్రరీకి రూ.16 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రతి లైబ్రరీలో 20 సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ ఎండీ మధుసూధన్‌రెడ్డి, ఏపీటీఎస్‌ ఎండీ నందకిశోర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top