‘పరిషత్‌’ ఫలితాల్లో ప్రతిబింబించిన ప్రభుత్వ పనితీరు

CM YS Jaganmohan Reddy Comments In video conference - Sakshi

స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

కలెక్టర్ల నుంచి వలంటీర్ల వరకు అందరి పని తీరు బావుంది

అవినీతి, వివక్ష లేకుండా పథకాలు అమలవుతున్నాయి 

మంచి పాలన వల్లే ప్రజల ఆదరాభిమానాలు పొందగలిగాం

ఇతరత్రా ఎక్కడైనా అవినీతి ఉంటే ఏరిపారేయాలి

ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరు పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వివిధ పథకాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు.. ఇలా అందరి పని తీరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. నాడు– నేడు నుంచి మహిళా సాధికారత, రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ చక్కటి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. అన్ని పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్నారని, తద్వారా ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇలాంటి ఫలితాలను చూసి ఉండరని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఆది నుంచి ఇవే ఫలితాలు
► మొదటి నుంచీ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు, పార్లమెంటు స్థానాల్లో 88 శాతం సీట్లు సాధించాం. ఇదే ట్రెండ్‌ సర్పంచి ఎన్నికల్లోనూ కొనసాగింది. మా పార్టీ మద్దతుదారులు 81 శాతం చోట్ల గెలుపొందారు.
► తర్వాత మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే కొనసాగింది. 75 మునిసిపాల్టీల్లో 74 చోట్ల అంటే 98 శాతం గెలుపొందాం. కార్పొరేషన్లలో 12కు 12 చోట్ల అంటే 100 శాతం గెలిచాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగింది. 100 శాతం జెడ్పీలు గెలిచాం. 
► దేవుడి దయ వల్ల మంచి పనితీరు చూపుతున్నాం. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు చేరుస్తున్నాం. వివక్ష, అవినీతి లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో వారికి ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగేలా చూడాలి. 
► ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్న మీకందరికీ అభినందనలు. మీ పనితీరు ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు అక్కడ మంచిగా పని చేస్తే, అది ప్రజల గుండెల్లో ప్రభుత్వ పనితీరు కింద ప్రతిబింబిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. 
► ఇతరత్రా ఎక్కడైనా అవినీతి ఉంటే ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అక్కడా మంచి వ్యవస్థను, సుపరిపాలనను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతిమంగా దేవుడి దయవల్ల 2024లో కూడా ఇవే ఫలితాలు కొనసాగడమే కాదు.. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top