
తప్పు ఎవరు చేసినా తప్పే. అందుకే వ్యవస్థలో మార్పులు రావాలనే ఈ చర్యలు తీసుకున్నాం. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మన బంధువులే బాధితులైతే.. ఉపేక్షిస్తామా? ఇలాంటి ప్రశ్నలు మనకు మనం వేసుకుని నిష్పక్షపాతంగా ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందేశం సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి వరకు వెళ్లాలి. దీనిపై ఎస్పీలు చొరవ చూపాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : దళితులపై దాడులను, అనైతిక చర్యలను ఉపేక్షించేది లేదని, బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. దళితులపై దాడులకు సంబంధించి పోలీసు అధికారులపై కూడా కేసు నమోదు చేసి జైలుకు పంపించామని, ఈ సందేశం కింది స్థాయి పోలీసు వరకూ తీసుకు వెళ్లాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గతంలో దళితులపై జరగరానివి జరిగితే ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దళితులపై ఇటీవల దాడులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
‘స్పందన’పై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
తప్పు ఎవరు చేసినా తప్పే
► దళితుల మీద దాడులు సహా ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునే వారు కాదు. కానీ ఇలాంటి ఘటనల విషయంలో ఈ ప్రభుత్వం ఊరకే చూస్తూ కూర్చోబోదు. తప్పు ఎవరు చేసినా తప్పే. మన ప్రభుత్వ ఆలోచనలో ఉన్న స్పష్టత ఇది.
► ఏదైనా తప్పు చేస్తే.. ఎస్‌ఐని కూడా జైల్లో పెట్టిన ఘటన గతంలో జరగలేదు. ఎస్‌ఐ తప్పు చేసినా, సీఐ తప్పు చేసినా కూడా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకుంది. నాలుగైదు చోట్ల ఇలా చర్యలు తీసుకున్నాం.
► పోలీస్ శాఖలో కింది స్థాయి వరకు ఓరియెంటేషన్ రావాలి. ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు ఆ ఓరియెంటేషన్ నిర్వహించాలి. మానవత్వం గురించి, ప్రజల హక్కుల గురించి అవగాహన కలిగించాలి.
► ఏదో జరిగిందని తీసుకు రావడం, గుండు కొట్టించడం లాంటి ఘటనలు తప్పు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదు.
కొంచెం కష్టమైనా కఠినంగా వ్యవహరిస్తున్నాం
► అలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయి కాబట్టే, వ్యవస్థలో మార్పు కోసం కొంచెం కష్టమైనా.. నేను, హోం మంత్రి, డీజీపీ, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది.
► మన రాష్ట్ర హోం మంత్రి దళితురాలు. మన డీజీపీ ఒక ఎస్టీ. ఇలాంటప్పుడు సమాజంలో దిగువన ఉన్న వారికి మనం రక్షణగా నిలబడాల్సిన బాధ్యత ఉంది.
► మన వాళ్ల మీద మనం చర్యలు తీసుకోవాలంటే నాతో సహా ఎస్పీలందరికీ బాధే. అయితే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి.
► మద్యం, ఇసుక అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం సహించొద్దు. అక్రమంగా మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమాలను అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎక్కడా తప్పులు జరగకూడదు. అవినీతికి ఆస్కారం ఉండకూడదు. అధికారులు బాగా పని చేస్తున్నారు.