ఈ అమ్మఒడి  భవితకు పెట్టుబడి

CM YS Jagan Speech In Jagananna Amma Vodi Scheme Srikakulam - Sakshi

మారీచులతో మీ జగన్‌ యుద్ధం చేస్తున్నాడు

ఈ ప్రభుత్వం ద్వారా మన ఇంట్లో జరిగిన మంచి చూడండి

చేకూర్చిన మేలును కొలబద్దగా తీసుకోండి

పిల్లల తలరాతలు మార్చే శక్తి విద్యకే ఉంది

మూడేళ్లలో విద్యా రంగంలో రూ.55 వేల కోట్ల వ్యయం

ఒక్క అమ్మ ఒడితోనే రూ.19,618 కోట్లు 

51 వేల మంది తల్లులకు అందకపోవడం బాధాకరమే

బృహత్తర యజ్ఞం కోసమే 75 శాతం హాజరు తప్పనిసరి 

ఎగ్గొట్టే ఆలోచన ఉంటే ఇన్ని పథకాలు అమలు చేస్తామా?

మూడేళ్లలోనే 95 శాతం హామీలను నెరవేరుస్తామా?

దుష్టచతుష్టయం దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

మీ ఆశీస్సులు ఉన్నంతకాలం వెంట్రుక కూడా పీకలేరు

సెప్టెంబర్‌లో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు

అమ్మ ఒడి మూడో విడతలో 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

43,96,402 మంది తల్లుల ఖాతాలకు రూ.6,595 కోట్లు జమ

‘చదువుల మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడి. పిల్లల తలరాతలు, భవిష్యత్తును మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. నిజమైన ఆస్తి అదే. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా బతకగలిగే శక్తి చదువు ద్వారానే సమకూరుతుంది. అలాంటి నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లోనూ వెల్లివిరియాలి’ 
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించలేని పరిస్థితి ఎవరికీ రాకూడదనే సంకల్పంతో విద్యార్థుల చదువులకు అడుగడుగునా అండగా నిలుస్తూ మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు బాగుండాలనే తపనతో నాణ్యమైన విద్యా బోధన దిశగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తల్లులు తమ పిల్లల చదువులను ఒక తపస్సులా భావించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో వరుసగా మూడో ఏడాది అమ్మ ఒడి పథకం కింద రూ.6,595 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..

చదువొక హక్కుగా..
విద్యాధికులున్న దేశాల్లో ప్రజల తలసరి ఆదాయం మనకన్నా ఎక్కువగా ఉండటానికి కారణం చదువులే. ఏ ప్రభుత్వమైనా చదువుల మీద వెచ్చించే ఒక్క పైసా కూడా వృథా చేస్తున్నట్లు కాదు. పిల్లల తలరాతలు, భవిష్యత్తును మార్చే గొప్ప పెట్టుబడిని విమర్శించడం సరికాదు. రాష్ట్రంలో ప్రతి బిడ్డకూ మంచి చదువులను ఒక హక్కుగా, బాధ్యతగా అందిస్తున్నాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ మూడో ఏడాదీ అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి నాకెంతో సంతోషాన్నిచ్చే కార్యక్రమం. ఇవాళ మూడో విడత కింద రూ.6,595 కోట్లు అందజేస్తున్నాం. దీని ద్వారా 43,96,402 మంది తల్లులకు, దాదాపు 80 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. ఒక్క అమ్మ ఒడి ద్వారానే మూడేళ్లలో రూ.19,618 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం.
శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని 

స్కూల్‌ ఏదైనా..
పిల్లలను బాగా చదివించండి. మీకు తోడుగా నేనున్నా. బడికి పంపితే చాలు. అది ప్రైవేట్‌  స్కూల్‌ అయినా, ఎయిడెడ్‌ అయినా, ప్రభుత్వ స్కూలైనా.. ఎక్కడ చదివించినా జగన్‌ మామకు అభ్యంతరం ఉండదు. పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యం. బడికి పంపితే ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి ద్వారా అందిస్తాం. ఎంత ఎక్కువ మంది తల్లులకు అమ్మ ఒడి అందితే నాకు అంత ఆనందం. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది. అందుకే కనీసం 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని జీవో ఇచ్చే రోజే నిబంధన పొందుపరిచాం. కోవిడ్‌ తదితర కారణాలతో రెండేళ్లు మినహాయింపు ఇచ్చినా గత సెప్టెంబర్‌ నుంచి బడులన్నీ యథావిధిగా నడుస్తున్నందున హాజరు నిబంధన అమల్లోకి వచ్చింది. 

బాధాకరమైనా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా..
2021–22లో దాదాపు 51 వేల మంది తల్లులు అమ్మ ఒడి లబ్ధి అందుకోలేకపోయారు. 44,47,402 మంది తల్లులకు గాను ఒక్క 51 వేల మంది తల్లులకు మాత్రం ఇవ్వలేకపోయాం. దీన్ని మరోరకంగా చెప్పాలంటే 43,96,402 మంది తల్లులకు అమ్మ ఒడి పథకాన్ని అందించగలిగా>ం. 1.14 శాతం మందికి మాత్రమే ఇవ్వలేకపోయాం. ఆ తల్లులకు ఇవ్వలేకపోవడం చాలా బా«ధాకరమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా 75 శాతం హాజరుతో అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. ఇక్కడొక బృహత్తర యజ్ఞం జరుగుతోంది. పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపే బాధ్యతను అక్కచెల్లెమ్మలు తీసుకోవాలని కోరుతున్నా. 

ఎప్పటికీ అలాగే ఉండేలా...
నాడు – నేడుతో రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు ఎప్పటికీ అలాగే ఉండేందుకు, పరిశుభ్రమైన టాయిలెట్ల కోసం టాయిలెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ (టీఎంఎఫ్‌) ఏర్పాటు చేసి అమ్మ ఒడిలో కాస్త సొమ్ము కేటాయిస్తున్నాం. పాఠశాలలు నిరంతరం బాగుండాలంటే మరమ్మతులు ఎప్పటికప్పుడు వెంటనే చేపట్టాలి. అందుకనే అమ్మ ఒడి సొమ్ములో కాస్త సొమ్మును స్కూళ్ల నిర్వహణ కోసం ఎస్‌ఎంఎఫ్‌ కింద కేటాయిస్తున్నాం. స్కూళ్ల బాగోగుల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ రూ.2 వేలు కేటాయించడం వల్ల ప్రశ్నించే అవకాశం వారికి ఒక హక్కుగా వస్తుంది. దీనిపై విమర్శలు చేసే ఏ ఒక్కరైనా చదివించే తల్లికి ఒక్క రూపాయైనా ఇచ్చారా? ఏనాడూ రూపాయి ఇవ్వనివారు ఇవాళ సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 

ఎగ్గొట్టే ప్రభుత్వమైతే ఇంత చేస్తుందా?
ఇది ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు అమలు చేస్తామా? మేనిఫెస్టోను భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావిస్తూ ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. డబ్బులు ఎగ్గొట్టాలనుకుంటే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తపిస్తామా? దేశంలో అతి పెద్ద ఎడ్యుకేషన్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటామా? ఏటా రూ.24 వేలు ఖర్చు కానీ అందుబాటులోకి రాని బైజూస్‌ యాప్‌ ఇవాళ పేద పిల్లలకు ఉచితంగా అందుబాటులోకి వస్తున్న విషయం వాస్తవం కాదా? 

8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు 
8వ తరగతిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ఈ సెప్టెంబర్‌ నుంచే రూ.12 వేల ఖరీదైన ట్యాబ్‌ను ఉచితంగా ఇస్తాం. రూ.500 కోట్లతో 4.7 లక్షల ట్యాబ్‌లను అందచేస్తాం. విద్యా కానుకతో పాటు ట్యాబ్‌ అందిస్తాం. వీరంతా 2025లో పదో తరగతి పరీక్షలు సీబీఎస్‌ఈ నమూనాలో రాస్తారు. ప్రతి తరగతి గదిలోటీవీ లేదా డిజిటల్‌ బోర్డు నాడు – నేడు ద్వారా సమకూరుస్తున్నాం. బైజూస్‌ యాప్‌ ద్వారా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకూ కంటెంట్‌ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ఇదే కంటెంట్‌ను పాఠ్యపుస్తకాల్లో అనుసంధానిస్తున్నాం. ఇవన్నీ మన పిల్లలు పోటీ ప్రపంచంలో నెగ్గాలని, తలరాతలు, బతుకులు మారాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం.

విద్యారంగంపై రూ.55 కోట్ల వ్యయం
విద్యా రంగంపై మూడేళ్లలో పెద్ద ఎత్తున వ్యయం చేశాం. అమ్మ ఒడి కింద రూ.19,618 కోట్లు, విద్యా దీవెనకు రూ.8 వేల కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. గోరుముద్ద కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. విద్యాకానుక ద్వారా రూ.2324 కోట్లు వ్యయం చేశాం. నాడు పేదపిల్లల చదువుకి చంద్రబాబు సర్కారు ఏదో ముష్టి వేసినట్లుగా ఏడాదికి రూ.120 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకొంది. నాడు–నేడు కింద 15,715 స్కూళ్లను తొలిదశలో రూ.4 వేల కోట్లు వెచ్చించి రూపురేఖలు మార్చాం.

రెండో దశలో మరో 22,344 స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమం రూ.8 వేల కోట్లుతో కొనసాగుతోంది. టీడీపీ హయాంలో మధ్యాహ్న భోజన పథకానికి 8 నెలల పాటు బకాయిలు పెట్టి ఆయాలకు కనీసం జీతాలు చెల్లించలేదు. కూరగాయలు, సరుకుల బిల్లులు కట్టలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలను చెల్లించాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద మేం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే చంద్రబాబు హయాంలో రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు.

టీడీపీ సర్కారు విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజుల బకాయిలు పెట్టి దిగిపోయింది. జగనన్న ప్రభుత్వమే ఆ మొత్తమంతా తీర్చింది. ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఫలితంగా 2018–19లో టెన్త్‌లోపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య 37.21 లక్షలు కాగా 2021–22లో 44.30 లక్షలకు పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల మందికిపైగా విద్యార్థులు పెరిగారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఆయనకు ఎన్నడూ ఇలాంటి ఆలోచనలు రాలేదు. చంద్రబాబుకుగానీ, దుష్ట చతుష్టయంలోని రామోజీరావు, టీవీ 5, ఏబీఎన్‌కుగానీ ఏనాడైనా నిజాలు చెప్పే ధైర్యం ఉందా? 
జగనన్న అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

మీ ఆశీస్సులుండగా వెంట్రుక కూడా పీకలేరు..
మంచి చేసే ప్రభుత్వం మీద, మీ జగన్‌ మామయ్య మీద, మీ జగన్‌ అన్నపైన విమర్శలు చేసేవారు ఎలాంటివారో ఒకసారి గమనించాలి. యుద్ధం ఇవాళ నేరుగా జరగడం లేదు. కుయుక్తులు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. మారీచులతో, దుష్ట చతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబుతోనే కాదు ఈనాడుతో, టీవీ–5తో, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం. వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరందరితో ఒకే ఒక్క జగన్‌ పోరాటం చేస్తున్నాడు.

మీ జగన్‌కు.. ఈనాడు తోడు లేకపోవచ్చు.. ఆంధ్రజ్యోతి, టీవీ–5, రామోజీరావు తోడు లేకపోవచ్చు. కానీ మీ జగన్‌కు మీమీద నమ్మకం ఉంది. మీ ఆశీస్సులు ఉన్నంత వరకూ వారంతా కలిసినా మీ జగన్‌ వెంట్రుక కూడా పీకలేరు. వారు  చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. మన ప్రభుత్వం ద్వారా మన ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే చూడండి. చేసిన మేలును కొలబద్ధగా తీసుకోండి. జగనన్న వల్ల మంచి జరిగిందనుకుంటే మద్దతు ఇవ్వండి. దేవుడి దయతో ఇంకా మంచి జరగాలి. మీరంతా ఆశీస్సులివ్వాలి.

సిక్కోలుపై వరాల జల్లు
► శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్‌ వరాలు జల్లు కురిపించారు. వేదికపై మంత్రి ధర్మాన ప్రసాదరావు, పలువురు ప్రజాప్రతినిధుల విన్నపాలపై స్పందించి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. 
► టీడీపీ హయాంలో ధ్వంసం చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం బాగు చేసేందుకు రూ.10 కోట్లు
► ఇంటిగ్రేటేడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేసేందుకు అదనంగా రూ.69 కోట్లు
► శ్రీకాకుళం–ఆమదాలవలస నాలుగు లైన్ల రహదారి పనుల భూసేకరణ, యుటిలిటీ కింద అదనంగా రూ.18 కోట్లు
► గొట్టా బ్యారేజీ వద్ద  లిప్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు రూ.189 కోట్లు మంజూరు. 
► మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనుల రివైజ్డ్‌ ఎస్టిమేట్‌గా రూ.855 కోట్లు మంజూరు. 

యుద్ధ ప్రాతిపదికన పనులు
► వంశధార ఫేజ్‌ 2లో రెండో దశ పనుల పూర్తికి అంచనా వ్యయం రూ.1616.23 కోట్ల నుంచి రూ. 2,407.79 కోట్లకు పెంపు. ప్రాజెక్టు పూర్తి చేసి డిసెంబర్‌లో జాతికి అంకితం. 
► ఉద్దానంలో మంచినీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తి. ప్రాజెక్టు పరిధిలోకి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలతో పాటు పాతపట్నంలోని మూడు మండలాలు. ప్రాజెక్టుకు అదనంగా మరో రూ.265 కోట్లు మంజూరు. దాదాపు రూ.1000 కోట్లతో కిడ్నీ ప్రభావిత గ్రామాలకు వంశధార నుంచి నీళ్లిచ్చేలా పనులు.

ఆంగ్లంలో నిహారిక ఆహా
శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గురుగుబిల్లి నిహారిక ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. అమ్మ ఒడితో పాటు పలు పథకాల ద్వారా తన లాంటి లక్షల మంది విద్యార్థులకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరించింది. ‘జగన్‌ మావయ్యా.. మీరు రాజన్నకి పుత్రుడు. రైతన్నకి మిత్రుడు. అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ముడు. మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు’ అంటూ కృతజ్ఞతలు తెలియచేసింది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బాలిక ప్రతిభకు సీఎం జగన్‌తో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముగ్దులయ్యారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top