వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయండి: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting With Officials Over Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణ, వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటి సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ వల్ల తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు  ఆస్పత్రులను కూడా కరోనా చికిత్సకు సిద్ధంగా ఉంచాలని,  వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఫీవర్‌ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సినేషన్‌ చేయించుకోనివారు ఎవరైనా ఉంటే.. వారందరికీ టీకాలు వేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం, ఏపీలో  6 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.  టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ సూచించారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి
అదే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. సచివాలయం స్థాయి నుంచి అధికారులు డేటాను తెప్పించుకోవాలని తెలిపారు. దీనిపై వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని అధికారులతో  సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్‌ టీకాలు, 71.76 శాతం రెండో డోస్‌  టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.  

నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, ప.గో, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నూటికి నూరుశాతం మొదటి డోస్‌ను పూర్తి చేశారు. కడపలో 98.93, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూ.గో 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళంలో 96.70 శాతం మేర మొదటి డోస్‌ వేశారు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్నిరకాలుగా సిద్ధం కావాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు.

బూస్టర్‌డోస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టండి
ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారిపైన, వృద్ధులపైన బూస్టర్‌డోస్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమున్నట్లు ప్రాథమికంగా అంచనావేశామని  అధికారులు తెలిపారు. ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే కోవిడ్‌ గుర్తించే పరీక్షలు చేయాలని,  విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలతో పాటు వారిని ట్రేస్‌ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

పర్యాటకులను రెగ్యులర్‌గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్‌.. పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్ట్స్‌ను కూడా వెంటనే ట్రెసింగ్‌ చేయాలన్నారు. అదే విధంగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు – నేడు పనుల ప్రగతిని సీఎం జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ఇవి పూర్తికాగానే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఈ క్రమంలో.. మెడికల్‌ సీట్లు పెరగడమే కాదు.. మంచి వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు, ఈ కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలనూ ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను సూచించారు.

మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటు ప్రగతిపైనా అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్‌ ముఖ్య ఉద్దేశమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top