ఫీవర్‌ సర్వే తప్పనిసరి.. వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేయండి | Cm Ys Jagan Review Meeting On Door To Door Fever Survey | Sakshi
Sakshi News home page

ఫీవర్‌ సర్వే తప్పనిసరి.. వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేయండి

Dec 28 2021 3:18 AM | Updated on Dec 28 2021 8:17 AM

Cm Ys Jagan Review Meeting On Door To Door Fever Survey - Sakshi

భయాందోళన అవసరం లేదు. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి. డేటాను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు తగిన నిర్ణయాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇంటింటా ఫీవర్‌ సర్వే జరగాలి. ఇది టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతులలో కొనసాగాలి. – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: క్రమం తప్పకుండా ఇంటింటా ఫీవర్‌ సర్వే తప్పనిసరిగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణకు ఇది మంచి మార్గం అని పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీవర్‌ సర్వే (ప్రస్తుతం 34వ సర్వే జరుగుతోంది) చేసే సమయంలోనే వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ఎవరైనా ఉంటే.. వారికి టీకాలు వేయాలని సూచించారు. టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్ధతుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వైద్యం అందించాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలని, సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని సూచించారు. వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని  సమీక్షిద్దామని చెప్పారు. కోవిడ్‌ నివారణ, నియంత్రణ, తాజా కేసులపై అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని తెలిపారు. అయితే వీరిలో ఎవ్వరూ కూడా ఆస్పత్రిపాలు కాలేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి

ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్‌ ఉధృతంగా చేయాలి. విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలి. ఆర్టీపీసీఆర్‌ పద్ధతిలోనే పరీక్షలు చేయాలి. పాజిటివ్‌ అని తేలితే ప్రైమరీ కాంటాక్టŠస్‌కు కూడా వెంటనే పరీక్షలు చేయాలి. 

కోవిడ్‌ వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులు కూడా దీనికి సిద్ధంగా ఉండాలి. 

కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటన నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి, వృద్ధులకు బూస్టర్‌ డోస్‌ ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 

 కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయాలి. ఇవి పూర్తయితే అత్యాధునిక వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. మెడికల్‌ సీట్లు పెరగడమే కాకుండా మంచి వైద్యం  అందుబాటులోకి వస్తుంది.

ఒకవైపు నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ఆస్పత్రులను ఆధునీకరించడం, ఇప్పటికే ఉన్న 11 బోధనాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడంతో పాటు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులను ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లాలి. 

మెడికల్‌ హబ్స్‌ ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలి. ప్రైవేటు రంగంలో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు రావాలన్నదే ఈ హబ్స్‌ ఉద్దేశం. 

ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

 బదిలీలు త్వరగా పూర్తి చేయాలి

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ప్రతి ఆస్పత్రిలో తగినంత సిబ్బంది ఉండాలని, అందువల్ల వెంటనే బదిలీలు పూర్తి చేయాలన్నారు. ఆలోగా కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

13 జిల్లాల్లో 98.96 శాతం మొదటి డోస్‌ టీకాలు 

71.76 శాతం రెండో డోస్‌  

నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వంద శాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి

వైఎస్సార్‌ జిల్లాలో 98.93 శాతం, విశాఖపట్నం 98.04, గుంటూరు 97.58, తూర్పు గోదావరి 97.43, కృష్ణా 97.12, శ్రీకాకుళం జిల్లాలో 96.70 శాతం మేర మొదటి డోస్‌.

15 నుంచి 18 ఏళ్ల వారికి కొత్తగా టీకా ఇవ్వడంతో పాటు మొత్తంగా 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమని ప్రాథమిక అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement