గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి: సీఎం జగన్‌

CM YS Jagan Review Meeting On Amul Project And Department Of Fisheries - Sakshi

సాక్షి, తాడేపల్లి: గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న అమూల్‌ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని తెలిపారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు. అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. అమూల్‌ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్‌ అన్నారు.

చదవండి: Andhra Pradesh: తక్షణమే రూ.5 లక్షలు

మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని తెలిపారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.

దానివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుందని, మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. 

మత్స్యశాఖపై సమీక్ష..
ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాదు, స్థానిక వినియోగాన్ని పెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.  ఇది జరక్కపోతే సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్‌ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారని అన్నారు. ప్రాసెసింగ్‌ చేసేవాళ్లు, ఎక్స్‌పోర్ట్‌ చేసేవాళ్లు సిండికేట్‌ అవుతున్నారని పలు దఫాలుగా రైతులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దీనికి పరిష్కారంగా ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని పేర్కొన్నారు.

పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని తెలిపారు. రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్‌లో నాణ్యత కోసం, రైతుల్ని దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఆక్వారంగ సబ్సిడీలు– రైతులకు మేలు
ఆక్వారంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు తెలిపారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్‌ కూడా పెట్టే ఆలోచన చేయాలని అన్నారు.  ఫిష్‌ ఆంధ్రా లోగోను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, అనుబంధిత రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రి ప్రాసెసింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 10 ప్రాసెసింగ్‌ప్లాంట్లు, 23 ప్రి ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు చెక్‌ పెట్టగలుగుతామని, రైతులకు మంచి ధరలు వస్తాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు
నాలుగు ఫిషింగ్‌ హార్బర్లలో పనులు మొదలయ్యాని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌–జులై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధం చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్‌ హార్బర్ల పనులు ఈ డిసెంబర్‌లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్ర కుమార్, అమూల్‌ ప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top