ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమం  | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమం 

Published Thu, Oct 12 2023 4:53 AM

CM YS Jagan in review on agriculture and allied sectors - Sakshi

గత నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. వాటి ద్వారా ప్రతీ రైతన్న లబ్ధి పొందాలి. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమయంలో అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలవాలి. ఏ ఒక్క రైతు నుంచి కూడా మద్దతు ధర దక్కలేదన్న మాటే వినిపించకూడదు. రైతులెవరూ మిల్లర్లు, మధ్యవర్తులను ఆశ్రయించే పరిస్థితే ఎక్కడా రాకూడదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధరతో పాటు జీఎల్టీ రూపంలో ప్రతీ క్వింటాల్‌కు రూ.250 చొప్పున రైతులు అదనంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకున్నాం. ఇదొక గొప్ప మార్పు.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి:  చిరు ధాన్యాలను (మిల్లెట్స్‌) సాగు చేసే రైతులకు తోడుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఏర్పాటు చేస్తున్న యూ నిట్లను వినియోగించుకుంటూ మిల్లెట్స్‌ను ప్రాసెస్‌ చేయాలన్నారు. ఏటా రైతుల నుంచి తృణ ధాన్యాల కొనుగోలు పెరిగే అవకాశాలున్నందున ఆ మేరకు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు.

పీడీఎస్‌ (రేషన్‌ షాపులు) ద్వారా మిల్లెట్లను ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుని వాటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయం, అను బంధ రంగాలతో పాటు పౌరసరఫరాల శాఖలపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించి పలు సూచనలు చేశారు. 

పంట వేసే ముందే భూసార పరీక్షలు 
ఏటా సీజన్‌లో పంటలు వేయటానికి ముందే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసి వాటి ఫలితాలతో కూడిన సర్టిఫికెట్లను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి. అందుకు అవసరమైన పరికరాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చూడాలి. ముందుగానే భూసార పరీక్షలు చేయడం ద్వారా ఏ పంటలు వేయాలి? ఏయే రకాల ఎరువులు ఎంత మో తాదులో వేయాలన్న దానిపై రైతులకు అవగాహన కల్పిస్తూ పూర్తి వివరాలు అందించేలా ఉండాలి.

దీనివల్ల అవసరమైన మేరకు మాత్రమే  ఎరువుల ను వినియోగిస్తారు. తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2023–24 సీజన్‌కు సంబంధించి ‘‘వైఎస్సార్‌ రైతు భరోసా’’ రెండో విడత పెట్టుబడి సాయాన్ని నవంబర్‌ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో పథకం ద్వారా రైతులకు రూ.31,005.04 కోట్లు అందజేసి తోడుగా నిలిచాం. 
సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సుస్థిర జీవనోపాధి మార్గాలపై దృష్టి 
వ్యవసాయంతో పాటు పాడిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వారికి సుస్థిర జీవనోపాధి మార్గాల కల్పనపై సమీక్ష జరగాలి. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతం కావాలి. వైఎస్సార్‌ చేయూత కింద ఏటా ఇస్తున్న డబ్బులకు అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలను చూపాలి. తద్వారా గ్రామీణ మహిళల ఆరి్ధక స్థితిగతులు ఎంతగానో మెరుగుపడతాయి.

ఇప్పటికే మంజూరు చేసిన యూనిట్లు విజయవంతంగా నడిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జగనన్న పాల వె ల్లువ పథకం కింద అమూల్‌ ద్వారా పాల సేకరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో మూగజీవాలకు పశుగ్రాసం, దాణా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్బీకేను యూనిట్‌గా తీసుకుని సంపూర్ణ మిశ్రమ దాణాను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. 

ముందస్తు రబీ.. 10 లక్షల ఎకరాల్లో సాగు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తు రబీలో 10 లక్షల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం ఉన్నట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఖరీఫ్‌ పంటలు సాగవని ప్రాంతాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే శనగ సహా ఇతర అన్ని రకాల విత్తనాలను ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. రబీలో సాగుచేసే శనగ విత్తనాలపై సబ్సిడీని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచామన్నారు. విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని, సుమారు లక్ష క్వింటాళ్ల శనగ విత్తనాలను సిద్ధం చేయగా, ఇప్పటికే  45 వేల క్వింటాళ్లను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్యా లేదని, రబీ సీజన్‌లో రైతుల అవసరాలకు తగిన విధంగా నిల్వలున్నాయని స్పష్టం చేశారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే 85 శాతం ఇ–క్రాప్‌ పూర్తి చేశామని, అక్టోబరు 15 లోగా వంద శాతం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జూన్, ఆగస్టులో వర్షాలు లేకపోవడం పంటల సాగుపై కొంత మేర ప్రభావం చూపిందన్నారు. ఈ కారణంగానే ఖరీఫ్‌ సీజన్‌లో 73 శాతం మేర పంటలు సాగైనట్లు చెప్పారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలోని డీఆర్‌ఓజీఓ– ఆర్‌టీపీఓ కేంద్రాల్లో ఔత్సాహికులైన వారికి కిసాన్‌ డ్రోన్లపై శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.

ఇప్పటివరకూ 422 మందికి శిక్షణ అందించామన్నారు. నవంబర్‌ మూడోవారం నాటికి నాటికి మండలానికి ఒకరు చొప్పున శిక్షణ పూర్తవుతుందని, వీరి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పాడి పరిశ్రమ మత్స్య శాఖల మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి,  సీఎస్‌ డాక్టర్‌  కేఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌ విజయ సునీత పాల్గొన్నారు.   

 
Advertisement
 
Advertisement