శ్రీవారి సేవలో సీఎం

CM YS Jagan presented silk clothes to Tirumala Srivaru TTD - Sakshi

బ్రహ్మాండ నాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

ధ్వజారోహణతో ప్రారంభమైన తిరుమల బ్రహ్మోత్సవాలు 

పెద్దశేషవాహన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అంతకుముందు సంప్రదాయబద్ధంగా తిరుపతి గంగమ్మకు సారె.. తిరుపతి–తిరుమల విద్యుత్‌ బస్సులకు పచ్చజెండా 

సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల/సాక్షి నెట్‌వర్క్‌: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమరి్పంచారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ.

అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు.

పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామి వైభవాన్ని తెలియజేయగా జీయర్లు శేషవస్త్రంతో íసీఎంను సత్కరించారు. అనంతరం వకుళమాతను దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రదక్షిణగా ఆనందనిలయంపై ఉన్న విమాన వేంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు.

టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో బియ్యాన్ని  తులాభారంగా సమర్పించారు. 2023 శ్రీవారి కేలండర్, డైరీ, టేబుల్‌ కేలండర్లను, అగ్గిపెట్టెలో పెట్టిన చీరను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తరువాత శ్రీవారి వాహన మండపానికి చేరుకున్న సీఎం.. పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు.
తిరుమలలో బియ్యాన్ని తులాభారంగా సమర్పిస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో సుబ్బారెడ్డి, మంత్రి రోజా 

అభిమానం.. అభివాదం
శ్రీవారి దర్శనాంతరం ఆలయం వెలుపలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాహన మండపానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న వారికి అభివాదం చేశారు. కొందరు భక్తులు సీఎంను చూసిన ఆనందంలో సీఎం సార్, సీఎం సార్‌ అంటూ కేకలు వేశారు. వారందరికీ అదే అభిమానంతో రెండుచేతులతో నమస్కరిస్తూ ఆయన ముందుకు సాగారు. 

ముందు తిరుపతి గంగమ్మను దర్శించుకున్న సీఎం 
ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 400 ఏళ్ల ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా భావించే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న తర్వాతే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సంప్రదాయం 900 ఏళ్లుగా ఉన్నట్లు చరిత్ర ఉంది. కాలక్రమేణా 400 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కనుమరుగైంది.

ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఘనచరిత్ర కలిగిన అమ్మవారి ఆలయ సంప్రదాయాన్ని  పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వెళుతూ ముందుగా శ్రీతాతయ్యగుంట గంగమ్మ దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమతో కూడిన సారెను సమర్పించారు.

దర్శనానంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ సందర్శన పుస్తకంలో సీఎం సంతకం చేశారు. 
తిరుమలలో అర్చకుల ఆశీర్వాదాలు అందుకుంటున్న సీఎం జగన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం కొట్టు 

ఎలక్ట్రికల్‌ బస్సులు ప్రారంభం
అనంతరం తిరుపతి–తిరుమల మధ్య నడిపే పది ఎలక్ట్రికల్‌ బస్సులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలిపిరిలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్‌ బస్సు ప్రత్యేకతలను ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు, చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి సీఎంకు వివరించారు. ఒలెక్ట్రా కంపెనీ నుంచి వంద ఎలక్ట్రికల్‌ బస్సులు రానున్నాయని తెలిపారు. 50 బస్సులను తిరుపతి–తిరుమల, 14 బస్సులను రేణిగుంట–తిరుమల, 12 బస్సులను తిరుపతి–మదనపల్లి, 12 బస్సులను తిరుపతి–కడప, 12 బస్సులను తిరుపతి–నెల్లూరు మధ్య నడపనున్నట్టు చెప్పారు. 
తిరుపతి–తిరుమల మధ్య నడిపే ఎలక్ట్రికల్‌ బస్సులను అలిపిరిలో జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం జగన్‌ 

సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం
తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు తిరుపతి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం, అలిపిరి, తిరుమల పద్మావతి అతిథిగృహం వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో టీటీడీ చైర్మెన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కే రోజా, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, జెడ్పీ చైర్మెన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, డీసీసీబీ చైర్మెన్‌ రెడ్డమ్మ, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, మేడా మల్లికార్జునరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, ఆర్టీసి వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, టీటీడీ జేఈవో సదాభార్గవి, ఆర్టీసీ ఈడీలు గోపీనాథరెడ్డి, కృష్ణమోహన్, తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్‌ అనుపమ అంజలి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్‌ కట్టా గోపీయాదవ్, జిల్లా దేవదాయశాఖ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top