Polavaram Project: పూర్తి చేసేది మేమే

CM YS Jagan on Polavaram in Andhra Pradesh Assembly - Sakshi

పోలవరంపై శాసనసభలో సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

ఈ ప్రాజెక్ట్‌ పేరు ఎత్తే అర్హత చంద్రబాబుకు లేదు

చంద్రబాబు, గజదొంగల బ్యాచ్‌ ప్రాజెక్ట్‌ను పీల్చి పిప్పి చేశారు

ఇది చంద్రబాబు ఏటీఎం అని స్వయానా ప్రధానే అన్నారు

వాళ్ల ధ్యాస నిధులు కాజేయడం పైనే.. అందుకే ముందు పనులు వెనుక.. వెనుకవిముందు 

ఇష్టారాజ్యంగా పనుల వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ 

మనందరి ప్రభుత్వంలో సక్రమంగా ప్రాజెక్ట్‌ పనులు

45.7 మీటర్ల పూర్తి ఎత్తుతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం

పోలవరం కోసమే ప్రధాని మోదీతో భేటీ

చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం నమ్మొద్దు

12 నెలల నుంచి 18 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం

పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. దీనికోసం కేంద్రం నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానిది పర్యవేక్షణ బాధ్యత. అయితే డబ్బులు రావడంలో ఆలస్యమవుతోందన్న కారణంతో పనులు ఆగిపోకూడదని భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం మన డబ్బులు రూ.2,600 కోట్లు ఇచ్చాం. అవి కేంద్రం నుంచి తెచ్చుకోవడం కోసం వాళ్ల చుట్టూ తిరుగుతున్నాం. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఎల్లో మీడియా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తుందో, ఎవరెవరి హయాంలలో ప్రాజెక్టు కోసం ఏం చేశారో గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మీ జగనే.
► సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్ట్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం. పోలవరం అంటే వైఎస్సార్‌... వైఎస్సార్‌ అంటే పోలవరం. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది ఆయన కొడుకుగా నేనే. మీ జగనే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబుకు పోలవరం అంటే ఏమిటో తెలియదని, ఆ ప్రాజెక్ట్‌ పేరు పలకడమే రాదని, అటువంటి చంద్రబాబుకు అసలు పోలవరం ప్రాజెక్ట్‌ పేరు ఎత్తే అర్హతే లేదని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే నిర్వచించారని గుర్తు చేశారు.

చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా పోలవరం ప్రాజెక్టును పీల్చిపిప్పి చేసి యథేచ్ఛగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. పోల­వరం ప్రాజెక్ట్‌ అంశంపై శాసనసభలో గురువారం స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌పై ఎల్లో మీడియాలో ఇటీవల వచ్చిన కథనాన్ని చూశాం. అసలు పనులు చేసింది చంద్రబాబేనంటూ ఒక అభూత కల్పనతో కలరింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు తాను ప్రజలకు మంచి చేసీ ఇదిగో ఫలానా మంచి చేశాను అని చెప్పి రాజకీయాలు చేయరు. కేవలం ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. వీళ్ల మీద ఆధారపడి మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తారు.

ఒక అబద్ధాన్ని గొప్పగా వందసార్లు చెప్పించే చెప్పి అదే నిజమేనేమో అని భ్రమ కల్పించేలా గోబెల్స్‌ ప్రచారం చేయగల గొప్ప వ్యక్తి చంద్రబాబు. మాకున్న ఇబ్బంది, వాళ్లకున్న అనుకూలత ఇదే. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేసింది చంద్రబాబేనంటూ ఎల్లో మీడియాలో అభూత కల్పన సృష్టించేందుకు యత్నిస్తోంది. పోలవరం అనే పదం పలికే అర్హత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి.. వీళ్లను మోస్తున్న ఈనాడు దినపత్రిక రామోజీరావుకు ఉందా అని నేను అడుగుతున్నాను’ అని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..  

పోలవరం వైఎస్సార్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు
► 2004లో నాన్నగారు వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పారు. అంత వరకు వీళ్లకు ఈ ప్రాజెక్టు గురించి తెలుసా? 2004కు ముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం వెలగబెట్టారు? చంద్రబాబు 1995లో మొట్టమొదటసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014 వరకు అంటే 19 ఏళ్ల పాటు కనీసం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారా? అప్పుడు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 ఏ గాడిదలు కాస్తున్నారు? వీళ్లంతా ఈరోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు కట్టారని, ఉరుకులు, పరుకులు తీయించారని కలరింగ్‌ ఇస్తున్నారు. 

► పోలవరం చంద్రబాబు ఒక్కరికే ఏటీఎం కాదు. చంద్రబాబుకు ఒక గజ దొంగల ముఠా ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అనే బ్యాచ్‌. ఈనాడు దినపత్రిక రామోజీరావు కొడుకు వియ్యంకుడుకి కూడా ఇది ఏటీఎం. నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. ఆ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో పనులిచ్చారు.

ఇంకా కొందరు ఉన్నారు. సుధాకర్‌ యాదవ్‌.. అప్పట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు. నామినేషన్‌ పద్ధతిలో పనులు తీసుకుని యథేచ్ఛగా దోచేశారు. వీళ్లు ఏ స్థాయిలో దోచారంటే చివరకి ప్రధాన మంత్రే పోలవరం ప్రాజెక్ట్‌ వాళ్ల ఏటీఎం అని నిర్వచించారు. 

నిధుల పారుదల మీదే టీడీపీ ధ్యాస
► వీళ్లు ఏ స్ధాయిలో దోచేశారు అన్నదానికి చిన్న ఉదాహరణ.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ చేశాం. పనులు రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేటాయించాం. ఆ విధానంలో ఒక్క పోలవరం ప్రాజెక్ట్‌లోనే ఖజానాకు రూ.800 కోట్లు ఆదా అయింది. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పేరు చెబితే వారి జేబుల్లోకి నిధులు పారేవి. ఆ నిధులు లెక్కలు చూసుకునేందుకు ఈ పెద్దమనిషి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్లేవారు. 

► ఒక్కో ప్రాజెక్టు కట్టడానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. ప్రోటోకాల్‌ ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్తే.. అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తై ఫలితాలు ఇస్తుంది. అప్పట్లో వాళ్ల దృష్టంతా నిధుల పారుదల మీదే. పోలవరం ప్రాజెక్టును పీల్చి పిప్పి చేసి డబ్బులు ఎలా తీసుకోవాలన్నదానిపైనే వాళ్ల ధ్యాసంతా. అందుకే ఎక్కువ డబ్బులొచ్చే పనులు ముందు.. తక్కువ డబ్బులొచ్చే పనులు తర్వాత చేస్తూ వెళ్లారు. ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్‌ డిజైన్‌.

► పోలవరంలో గోదావరి దాదాపుగా 2,400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ ప్రవాహాన్ని మళ్లించి డ్యామ్‌ నిర్మించాలి. ఇలా నీళ్లు మళ్లించాలంటే ముందుగా స్పిల్‌ వే నిర్మించాలి. స్పిల్‌ వే మీదుగా గోదావరి నదిని మళ్లించిన తర్వాతే ఈ 2,400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి ప్రవాహంలో మొదటి కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి.

ఆ తర్వాత దిగువ నుంచి నీళ్లు రాకుండా రెండో కాఫర్‌ డ్యాం నిర్మించాలి. ఇలా కట్టడం ద్వారా మధ్యలో నీళ్లు రాకుండా చేసిన తర్వాత ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ ఫిల్‌ డ్యాం నిర్మించాలి. అంటే ప్రధాన డ్యామ్‌ నిర్మించాలి. ఇదీ పద్దతి. 

చంద్రబాబు హయాంలో అసంపూర్ణంగా పనులు
► చంద్రబాబు ప్రభుత్వం స్పిల్‌ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసింది. పునాదులు తర్వాత గేట్లు పెట్టడం వంటివన్నీ అసంపూర్ణంగా వదిలేశారు. మరోవైపు 2,400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి నదీ ప్రవాహంలో ఏకంగా ఒకవైపు మొదటి కాఫర్‌ డ్యామ్, ఇంకోవైపు రెండో కాఫర్‌ డ్యామ్‌ పనులు మొదలు పెట్టారు. 

► కాఫర్‌ డ్యామ్‌ పూర్తయితేగానీ నీళ్లు రాలేని పరిస్థితి. అలాంటప్పుడు నీళ్లు ఇంకోవైపు డైవర్ట్‌ చేసే స్పిల్‌వే పని అవ్వకుండా కాఫర్‌ డ్యామ్‌ ఎలా పూర్తి చేస్తారు? అప్పుడు 2,400 మీటర్ల వెడల్పున ప్రవాహం ఎలా వెళ్తుంది? స్పిల్‌ వే పూర్తి కాలేదు. అఫ్రోచ్‌ ఛానెల్‌ పనులు జరగలేదు. స్పిల్‌ ఛానెల్‌ పనులు జరగలేదు. ఇలాంటప్పుడు నీళ్లు ఎలా మళ్లిస్తారు?

► కాబట్టి కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా ఆగిపోయాయి. కారణం సీజన్‌ వచ్చిందంటే గోదావరి నదిలో నీళ్లు వదిలేయాలి. మరో ఆప్షన్‌ లేదు. మెయిన్‌ లైన్లోంచే నీళ్లు వదలాలి. 2,400 మీటర్ల స్థానంలో 1,600 మీటర్ల మేర కాఫర్‌ డ్యామ్‌ కట్టి రెండు గ్యాప్‌లు నాలుగు వందలు మీటర్లు చొప్పున వదిలారు.

అప్పుడు నీళ్లు ఉధృతంగా వచ్చే చోట కేవలం రెండు గ్యాపుల్లో నుంచి ప్రవహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డయాఫ్రమ్‌ వాల్‌ను దెబ్బ తీసింది. కాఫర్‌ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. 

► బుద్ధి ఉన్న వారెవరైనా.. స్పిల్‌ వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యామ్‌ పనులు ఎలా ముట్టుకున్నారని గడ్డి పెట్టాల్సింది. కానీ అలా చేయలేదు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కాకుండా డయాఫ్రమ్‌ వాల్‌ అంటే మెయిన్‌ డ్యామ్‌కు పునాది గోడ వేశారు. ఇలా ఎందుకు కట్టారు.. బుద్దుందా అని రెండో ప్రశ్న అడగాలి. 

► మనం అధికారంలోకి వచ్చాక 2020లో గోదావరిలో ఎప్పుడూ ఊహకందని విధంగా వరద వచ్చింది.  గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద. స్పిల్‌ వే మీదుగా నీళ్లు మళ్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్పిల్‌వేలో పియర్స్‌ పౌండేషన్, గేట్లు పెట్టే పనులు జరుగుతున్నాయి. నీళ్లు అటువైపు మళ్లించడం సాధ్యం కాలేదు. రెండో వైపున చిన్న చిన్న గ్యాపుల్లోంచి నీళ్లు రావాలి. దాంతో కోతకు గురైంది. 

12–18 నెలల్లో ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తాం
► మనం అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ రిపేరు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. అఫ్రోచ్‌ ఛానెల్‌ మీదుగా స్పిల్‌ ఛానెల్‌ను, స్పిల్‌ ఛానెల్‌ దిగువన పైలెట్‌ ఛానెల్‌ను పూర్తిగా నిర్మించాం. ఈ రోజు స్పిల్‌వే అన్ని రకాలుగా పూర్తైంది. నీళ్లు కూడా స్పిల్‌ వే మీదుగా వస్తున్నాయి. 48 గేట్లు పెట్టాం. అందువల్లే గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చినా సమర్థవంతంగా స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగాం. 

► ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసింది. ఆ రెండు ఖాళీలను కూడా పూర్తి చేశాం. జరిగన నష్టాన్ని ఇసుక వేసి వైబ్రో కంపాక్షన్‌ చేసి.. అన్ని రకాలుగా ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేశాం. మెయిన్‌ డ్యామ్‌లో భాగమైన గ్యాప్‌ 3 వద్ద కాంక్రీటు పనులు పూర్తి చేశాం.

► 2021 జూన్‌ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించాం. అనూహ్య వరదల కారణంగా కాఫర్‌ డ్యామ్‌ దెబ్బతినకుండా అప్పటికప్పుడు ఒక మీటరు ఎత్తు కూడా పెంచగలిగాం. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశాన్ని కూడా పూడ్చాం. పనుల సీజన్‌ మొదలు కాగానే ఎంత వేగంగా పనిచేయాలో అంతవేగంగా పని చేశాం. 

► ఇప్పటికి పోలవరం నిర్మాణంలో స్పిల్‌ వే పూర్తయింది. డెడ్‌స్టోరేజీ ద్వారా, రివర్స్‌సూస్‌ ద్వారా గోదావరి డెల్టాకు నీరిచ్చే పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఎన్‌హెచ్‌పీసీ వాళ్లు డిజైన్స్‌ క్లియరెన్స్‌ కూడా ఇచ్చారు కాబట్టి ఈ సీజన్‌లో పనులు వేగంగా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. 

► వర్షాకాలం వచ్చినా మెయిన్‌ డ్యామ్‌ నిర్మిస్తున్నాం. 2022 నవంబర్‌లో తిరిగి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు మొదలుపెట్టాం. 2023 ఫిబ్రవరి 14 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను విజయవంతంగా పూర్తి చేశాం. ఎన్‌హెచ్‌పీసీ వారి ద్వారా డయాఫ్రం వాల్‌ టెస్టులు చేసి, ఆ రిపోర్టులను సీడబ్ల్యూసికి, డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ఫ్యానెల్‌కు పంపించాం.

వాళ్లు ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి సమావేశం నిర్వహించారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రదేశాలలో సమాంతరంగా డయాఫ్రం వాల్‌ కట్టాలని నిర్ణయించాం. అ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 12 నెలల నుంచి 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ వేగవంతం చేశాం. 

పోలవరం కోసమే ప్రధానితో సమావేశం
► సాంకేతికంగా అన్ని రకాల అనుమతులు లభించినందున ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. అందుకు అవసరమైన కేంద్ర ప్రభుత్వం సహకారం కోరేందుకే నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాను. ప్రధానికి వివరించిన అజెండాలో ఈ పాయింట్‌ కూడా ఉంది.

ఈ ప్రాజెక్టు రూ.55,656.87 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్‌ ఆమోదించాలి. అందుకు సమయం పడుతుంది కాబట్టే అడ్‌హాక్‌ గ్రాంట్‌ కింద రూ.15 వేల కోట్లు కేటాయించమని ప్రధానిని కోరాం.

► సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినప్పుడు ఆ మేరకు సర్దుబాటు చేసుకోవచ్చని చెప్పాం. ఈ రూ.15 వేల కోట్లు పూర్తిగా డ్యామ్‌ ఎత్తు 45.7 మీటర్ల వరకు నిర్మించడానికి సరిపోతుంది. దాంతో పాటు 41.15 మీటర్ల వరకు పూర్తిగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి కూడా సరిపోతుంది. 

► తర్వాత కనీసం మూడేళ్లలో దశల వారీగా డ్యామ్‌లో నీటిని నింపుకుంటూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి వస్తుంది. అందులో ఎలాంటి తప్పూ లేదు. కావాలనే కొందరు సృష్టిస్తున్న అపోహలను నమ్మొద్దు. కేంద్ర ప్రభుత్వానికి కూడా చెబుతున్నాం.

భూసేకరణ, పునరావాస ప్యాకేజీకి మేం వివరాలు ఇస్తాం.. మీరే డీబీటీ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో డబ్బులు వేయండి.. వారికి పరిహారం చెల్లించండి అని చెప్పాం. అంతా పద్ధతి ప్రకారం జరుగుతోంది. కొందరు ఉన్నవి లేనట్టుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదు. 

45.7 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తాం
► ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే డ్యామ్‌ ఎత్తు తగ్గిస్తున్నామని మాటి మాటికి దుష్ప్రచారం చేస్తున్నారు. 41.15 మీటర్ల ఎత్తుకే కడుతున్నారని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. డ్యామ్‌ పూర్తి ఎత్తు మేరకు అంటే 45.7 మీటర్లకు నిర్మిస్తాం. 

► డ్యామ్‌ భద్రత కోసం సీడబ్లూసీ నిబంధనలను అనుసరించి ఒకేసారి డ్యామ్‌ అంతా నింపకూడదు. సీడబ్ల్యూసీ గైడ్‌ లైన్స్‌ ప్రకారం నిల్వ సామర్థ్యంలో మొదటి ఏడాది 1/3వ వంతు,, రెండవ ఏడాది 2/3వ వంతు, మూడవ ఏడాది గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలి. 

► తొలి ఏడాది 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి డ్యామ్‌లో నీటిని నిల్వ చేస్తాం. 45.72 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం సర్దుబాటు చేయడానికి రెండేళ్ల వ్యవధి ఉంటుంది.

కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ తర్వాత రెండేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో.. అంటే 194.6 టీఎంసీలను నిల్వ చేస్తాం. అప్పుడు నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి కూడా వాళ్లకు సమయం వెసులుబాటు కూడా ఉంటుంది.

► నిర్వాసితులకు మరింత మేలు చేసేందుకు ప్రతి ముంపు కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఆ హామీ ప్రకారం కేబినెట్‌లో తీర్మానం చేసి జీవో కూడా ఇచ్చాం. 41.15 మీటర్లు వచ్చే లోపు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.550 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top